Telugu Global
Andhra Pradesh

పొత్తులకు పార్టీలున్నాయా?

బీజేపీతో పొత్తులో ఉంటూనే టీడీపీకి దగ్గరయ్యారు. పొత్తుల విషయంలో చంద్రబాబును కూడా మించిపోయేట్లున్నారే అని పవన్ కల్యాణ్‌పై నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు.

పొత్తులకు పార్టీలున్నాయా?
X

తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటనపై నెటిజన్లు విపరీతమైన సెటైర్లు వేస్తున్నారు. రాజమండ్రి జైలులో చంద్రబాబునాయుడును కలిసిన తర్వాత పవన్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి వెళ్ళాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. దీనిపై మొదట సెటైర్ వేసింది మాజీమంత్రి పేర్నినాని. ఇప్పుడు కొత్తగా పొత్తు పెట్టుకునేది ఏముంది ఎప్పటి నుండో కలిసే ఉన్నారుగా అని నాని చురకలు అంటించారు. అక్కడి నుండి చాలామంది పవన్ ప్రకటనను ఎద్దవా చేస్తున్నారు.

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే బీజేపీతో పొత్తులో ఉంటూనే టీడీపీతో పొత్తును పవన్ ప్రకటించటం. టీడీపీ, బీజేపీలను కలపాలని పవన్ ఎంత ప్రయత్నించినా సాధ్యం కావటంలేదు. అవసరమైతే బీజేపీని వదిలేయాలని డిసైడ్ చేసుకున్న తర్వాతే పవన్ టీడీపీతో పొత్తు ప్రకటన చేశారని అర్థ‌మవుతోంది. ఇదే సమయంలో పవన్ పొత్తు పెట్టుకోని పార్టీలు ఏమున్నాయి అంటు వెటకారాలు మొదలుయ్యాయి.

గుర్తున్నంతవరకు కాంగ్రెస్ పార్టీతో మాత్రమే పవన్ ఇంతవరకు పొత్తు పెట్టుకోలేదు. 2014లో బీజేపీ, టీడీపీతో కలిశారు. 2019లో బీఎస్సీ, సీపీఐ, సీపీఎంలతో జట్టు కట్టి ఎన్నికలకు వెళ్ళారు. తర్వాత ఆ పార్టీలను వదిలేసి మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. బీజేపీతో పొత్తులో ఉంటూనే టీడీపీకి దగ్గరయ్యారు. పొత్తుల విషయంలో చంద్రబాబును కూడా మించిపోయేట్లున్నారే అని నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు. టీడీపీతో కలిసేందుకు అంగీకరించకపోతే బీజేపీని కూడా వదిలేయటం ఖాయమనే అనిపిస్తోంది. ఎందుకంటే పవన్‌కు చంద్రబాబు మీద ప్రేమ కన్నా జగన్ మీద ధ్వేషం అంతకంతకు బాగా పెరిగిపోతోంది.

జగన్‌పై అకారణ ధ్వేషమే పవన్‌ను రాత్రుళ్ళు సరిగా నిద్రకూడా పోనీయటంలేదేమో. అందుకనే ఎక్కడ బహిరంగసభన్నా, వారాహియాత్రలో కూడా 24 గంటలూ జగన్‌ను తిట్టడమే టార్గెట్‌గా పెట్టుకున్నారు. జగన్ గుర్తుకొస్తే చాలు తానేం మాట్లాడుతున్నది కూడా పవన్ చూసుకోరు. పూనకం వచ్చినవాడిలా ఊగిపోతు నోటికేదొస్తే అది మాట్లాడేస్తుంటారు. సో, పవన్ పొత్తుల విషయాన్ని చూస్తే మిగిలింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. బహుశా ఏదో సందర్భంలో కాంగ్రెస్‌తో కూడా పవన్ పొత్తు పెట్టేసుకుంటే చంద్రబాబు రికార్డును సమం చేయటమో లేకపోతే బ్రేక్ చేయటమో జరిగిపోతుంది.


First Published:  16 Sep 2023 5:04 AM GMT
Next Story