Telugu Global
Andhra Pradesh

బాబు ష్యూరిటీ, గ్యారెంటీపై సెటైర్లు

నెటిజన్లు తమదైన సృజనతో రెచ్చిపోతున్నారు. చంద్రబాబు ష్యూరిటీ మీద, చంద్రబాబు చెప్పే భవిష్యత్తుకు గ్యారెంటీ మీద సెటైర్లు పేలుస్తున్నారు.

బాబు ష్యూరిటీ, గ్యారెంటీపై సెటైర్లు
X

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత నెటిజన్లు ఆకాశమే హద్దుగా సెటైర్లతో చెలరేగిపోతున్నారు. నెటిజన్లు తమదైన సృజనతో రెచ్చిపోతున్నారు. తాజాగా అలాంటి సెటైర్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. చంద్రబాబు ష్యూరిటీ మీద, చంద్రబాబు చెప్పే భవిష్యత్తుకు గ్యారెంటీ మీద సెటైర్లు పేలుతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే ష్యూరిటీకి సంబంధించి ఒక కామెంట్ ఉంది. అదేమిటంటే ‘చంద్రబాబుకే ఇద్దరు ష్యూరిటీలు ఇస్తేగాని జైలులో నుంచి వదల్లేదు... అలాంటిది జనాలకు చంద్రబాబు ష్యూరిటీ ఇస్తారా’? అన్నది మొదటిది.

ఇక రెండోది ఏమిటంటే భవిష్యత్తుకు గ్యారెంటీ. ‘చంద్రబాబు భవిష్యత్తుకే గ్యారెంటీ లేదు అలాంటిది 5 కోట్ల మంది జనాలకు చంద్రబాబు ఏమి గ్యారెంటీ ఇస్తారు’? అంటే టీడీపీ ప్రోగ్రామ్ ‘చంద్రబాబు ష్యూరిటీ..భవిష్యత్తుకు గ్యారెంటీ’ ని నెటిజన్లు ఇలా విడదీసి తమ సృజనను జోడించారు. ఏ ముహూర్తంలో చంద్రబాబు ష్యూరిటీ..భవిష్యత్తుకు గ్యారెంటీ అనే ప్రోగ్రామ్ ప్రారంభించారో అప్పటి నుండి అన్నీ అవరోధాలు ఎదురవుతున్నాయి.

నెల్లూరు, గుంటూరు జిల్లాల పర్యటనల్లో కొందరు చనిపోయారు. నంద్యాల పర్యటనలో ఉండగానే స్కిల్ స్కామ్‌లో అరెస్టయ్యారు. మొత్తానికి ఈ ప్రోగ్రామ్ టీడీపీకి అంతగా అచ్చిరాలేదన్న వాదనే పార్టీలో కూడా బాగా వినబడుతోంది. చంద్రబాబు అరెస్టు ఎఫెక్టు యువగళం మీదపడి లోకేష్ పాదయాత్ర ఆగిపోయింది. ఇప్పుడు పాదయాత్ర పునఃప్రారంభమైనా పాత ప్లాన్‌కు చాలా సవరణలు చేసి 18 రోజులకు కుదించేశారు. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో ముగించాల్సిన పాదయాత్రను వైజాగ్‌లోనే ముగించేస్తున్నారు.

ఇక్కడ విషయం ఏమిటంటే చంద్రబాబుకు ష్యూరిటీ ఇచ్చిన ఇద్దరు తమ ష్యూరిటీని వెనక్కు తీసుకునే అవకాశం లేదు. అయితే బెయిల్‌పై ఎన్నిరోజులుంటారనే విషయంలో మాత్రం గ్యారెంటీ లేదు. చంద్రబాబు బెయిల్‌ను సుప్రీంకోర్టు గనుక రద్దు చేస్తే చంద్రబాబు వెంటనే రాజమండ్రి జైలుకెళ్ళాల్సిందే తప్ప వేరే దారిలేదు. ఇదే సమయంలో ఇప్పటికే చంద్రబాబుపైన నమోదైన మరో ఆరు కేసుల్లో ఎందులో అయినా సీఐడీ అరెస్టు చేసే అవకాశముంది. అదే జరిగితే చంద్రబాబు జైలుకు వెళ్ళి మళ్ళీ బెయిల్ కోసం పోరాటం చేయాల్సిందే. కాబట్టి చంద్రబాబు ష్యూరిటీ కన్నా గ్యారెంటీపైనే జనాలు ఎక్కువగా సెటైర్లు వేస్తున్నారు.

First Published:  28 Nov 2023 5:19 AM GMT
Next Story