Telugu Global
Andhra Pradesh

చంద్రబాబుకి బెయిల్ కోసం దుర్గ గుడిలో భువనేశ్వరి పూజలు

చంద్రబాబు తన కోసం, తన కుటుంబంకోసం ఎప్పుడూ ఆలోచించలేదని, ప్రజల కోసమే ఆలోచించారని చెప్పారు. ప్రజల హక్కులకోసం పోరాడారన్నారు. అలాంటి మనిషికి ప్రజలందరూ అండగా నిలబడాలన్నారు భువనేశ్వరి.

చంద్రబాబుకి బెయిల్ కోసం దుర్గ గుడిలో భువనేశ్వరి పూజలు
X

చంద్రబాబు అరెస్ట్ అనంతరం ఆయన భార్య భువనేశ్వరి బెజవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. చంద్రబాబుకి బెయిల్ రావాలని అమ్మవారిని వేడుకున్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆమె చంద్రబాబుకి మనో ధైర్యం ఇవ్వాలని అమ్మవారిని కోరుకున్నట్టు తెలిపారు. ఆయన బయటకు రావాలన్నారు. చంద్రబాబు తన కోసం, తన కుటుంబంకోసం ఎప్పుడూ ఆలోచించలేదని, ప్రజల కోసమే ఆలోచించారని చెప్పారు. ప్రజల హక్కులకోసం పోరాడారన్నారు. అలాంటి మనిషికి ప్రజలందరూ అండగా నిలబడాలన్నారు భువనేశ్వరి.


బాలయ్య రియాక్షన్..

చంద్రబాబు అరెస్టును బాలకృష్ణ ఖండించారు. ఆయన అరెస్ట్ దుర్మార్గం అని అన్నారు. ప్రజా సంక్షేమాన్ని సీఎం జగన్‌ గాలికొదిలేశారని, ప్రతిపక్షాలపై కక్షసాధింపులకే వైసీపీ పాలన పరిమితమైందని దుయ్యబట్టారు. చంద్రబాబుని ఎలాగైనా జైలులో ఉంచాలనేదే సీఎం జగన్‌ కుట్ర అని మండిపడ్డారు బాలయ్య. ఆధారాలు లేకుండా ఏ చట్టం ప్రకారం చంద్రబాబును అరెస్టు చేశారన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ అంటున్న సీఐడీ.. నిజంగా అవితీని జరిగి ఉంటే ఇంతవరకు ఛార్జిషీట్‌ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. అక్రమ అరెస్టులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు బాలయ్య.

అంబేద్కర్ విగ్రహాలు బాధపడతాయి..

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజాస్వామ్యం అపహాస్యం అయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు దర్శకుడు రాఘవేంద్రరావు. చంద్రబాబు ఒక విజనరీ లీడర్ అని, అలాంటి నాయకుడిని అరెస్ట్ చేసిన విధానం అప్రజాస్వామికం అని అన్నారు. ఏపీలో ఉన్నఅంబేద్కర్ విగ్రహాలన్నీ ఈరోజు రాజ్యాంగం చచ్చిపోతున్నందుకు బాధ పడుతున్నాయని తనదైన శైలిలో పోలిక చెప్పారు రాఘవేంద్రరావు.


First Published:  9 Sep 2023 9:14 AM GMT
Next Story