Telugu Global
Andhra Pradesh

బీసీ కార్పొరేషన్లపై నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీసీ సంక్షేమంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు.

బీసీ కార్పొరేషన్లపై నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
X

ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ కార్పొరేషన్ల వల్ల బీసీలకు ఎలాంటి ప్రయోజనం లేదని విమర్శించారు జనసేన నేత నాదెండ్ల మనోహర్. కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వం బీసీలను విడదీస్తోందని మండిపడ్డారాయన. కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు కార్లపై స్టిక్కర్లు అంటించుకుని తిరుగుతున్నారని, టోల్ ఫీజు కట్టకుండా టోల్ గేట్ల వద్ద గొడవ పడుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకు తప్ప ఆ స్టిక్కర్లు, ఆ పదవులు దేనికీ పనికి రావడంలేదన్నారు.

మంగళగిరిలో బీసీ సభ..

మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీసీ సంక్షేమంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు. వివిధ కుల సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సమస్యలను వివరించారు. బీసీలను అణగదొక్కుతున్నారని, కార్పొరేషన్ల వల్ల తమకెలాంటి లాభం లేదని పేర్కొన్నారు. వారి సమస్యలను విన్న నాదెండ్ల.. కార్పొరేషన్ల పేరుతో బీసీలను ప్రభుత్వం విడదీయాలని చూస్తోందని, వారిలో ఐక్యత లేకుండా చేసి పబ్బం గడుపుకుంటోందని విమర్శించారు. కార్పొరేషన్ల నాయకులు స్టిక్కర్లు వేసుకుని పైరవీలు చేసుకుంటున్నారని, ఆయా కులాల్లోని పేదలకు మేలు చేయడం మరచిపోయారన్నారు.


అన్నిటికీ నవరత్నాలేనా..?

కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం వాటికి నిధులు విడుదల చేయకుండా నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు నాదెండ్ల. నవరత్నాల కార్యక్రమాలకు ఇచ్చిన నిధులనే కార్పొరేషన్ల పేరిట జమ చేస్తున్నారని అన్నారు. బీసీ సాధికారిత కోసం గత ఎన్నికల మేనిఫెస్టోలోనే అనేక పథకాలను జనసేన ప్రవేశ పెట్టిందని, బీసీలంతా సామాజిక, ఆర్ధిక అభివృద్ధి సాధించాలనేది పవన్ కల్యాణ్‌ ఆలోచన అని అన్నారు. బీసీలకు జనసేన పార్టీ అండగా ఉంటుందన్నారు. టోల్ గేట్ల వద్ద గొడవ పడుతున్నారంటూ బీసీ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్ల గురించి నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

First Published:  11 March 2023 12:17 PM GMT
Next Story