Telugu Global
Andhra Pradesh

జగన్‌కి ముద్రగడ మేలుచేస్తున్నారా..?

గోదావరి జిల్లాల్లో కాపులకు బీసీ శెట్టిబలిజలకు ఏమాత్రం పడదని అందరికీ తెలిసిందే. ఉభయగోదావరి జిల్లాల్లోని 34 నియోజకవర్గాల్లో అత్యధిక నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కనబడుతుంది.

జగన్‌కి ముద్రగడ మేలుచేస్తున్నారా..?
X

ఒకరకంగా కాపు ఉద్యమనేత వైసీపీకి షాక్ ఇచ్చారని అనుకున్నా.. అదే సమయంలో మేలుచేశారని కూడా అనుకోవాలి. చాలాకాలంగా వైసీపీ నేతలు ముద్రగడతో టచ్ లో ఉన్నారు. ఎంపీ మిథున్ రెడ్డి మూడుసార్లు ముద్రగడని కలిసి వైసీపీలోకి రావాలని ఆహ్వానించారు. ఉద్యమనేత కూడా అందుకు సానుకూలంగా ఉన్నారని ప్రచారం జరిగింది. అయితే ఈమధ్య సడన్ గా ఏమి జరిగిందో అర్థం కావటంలేదు. కలలో కూడా తాను వ్యతిరేకించే చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ తో చేతులు కలపటానికి ముద్రగడ సిద్ధపడ్డారు.

తొందరలోనే ముద్రగడ టీడీపీలో చేరి పోటీచేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. బహుశా కాపుల ఓట్లలో చీలిక రాకూడదనే ముద్రగడను చంద్రబాబు, పవన్ ఏదో మాయచేసినట్లే అనుమానంగా ఉంది. వాళ్ళ మాయలో ముద్రగడ ఫ్లాట్ అయిపోయారు. లేకపోతే తాను వ్యతిరేకించే చంద్రబాబుతోనే ముద్రగడ చేయికలుపుతారని ఎవరూ ఊహించలేదు. సరే ఈ విషయం ఇలా ఉండటంతో గోదావరి జిల్లాల్లో సమీకరణలు మారిపోయే పరిస్థితులు కనబడుతున్నాయి.

ఎలాగంటే.. ముద్రగడ, చంద్రబాబు, పవన్ ఒకవైపు చేరటం దాదాపు ఖాయమే కాపుల ఓట్లకోసం. ఇదే సమయంలో కాపులను పూర్తిగా వ్యతిరేకించే బీసీలు ప్రత్యేకించి శెట్టిబలిజలు, ఎస్సీలతో పాటు పై ముగ్గురిని వ్యతిరేకించే వాళ్ళు వైసీపీ వైపున‌కు చేరే అవకాశాలున్నాయి. బహుశా ఈ పరిణామాలను ముందుగా ఊహించే జగన్ వీలైనన్ని సీట్లను బీసీలకు కేటాయిస్తున్నారు. గోదావరి జిల్లాల్లో కాపులకు బీసీ శెట్టిబలిజలకు ఏమాత్రం పడదని అందరికీ తెలిసిందే. ఉభయగోదావరి జిల్లాల్లోని 34 నియోజకవర్గాల్లో అత్యధిక నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కనబడుతుంది.

టీడీపీలో చేరాలని ముద్రగడ నిర్ణయించుకున్నదే నిజమైతే అనివార్యంగా బీసీలు వైసీపీ వైపున‌కు చేరుతారనటంలో సందేహంలేదు. అప్పుడు బీసీలకు తోడుగా ఎస్సీలు కూడా కలుస్తారు. దాంతో ప్రతి నియోజకవర్గంలో వైసీపీ-టీడీపీ+జనసేన అభ్యర్థుల మధ్య టైట్ ఫైట్ జరగటం ఖాయం. జనసేన అధినేత పవన్ అనుకుంటున్నట్లు రెండు జిల్లాల్లోను టీడీపీ, జనసన అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేయటం సాధ్యం కాకపోవచ్చు. ఏదేమైనా ముద్రగడ నిర్ణయంతో జిల్లాలో సమీకరణలు ఒక్కసారిగా మారిపోతున్నాయన్నది వాస్తవం. ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.

First Published:  13 Jan 2024 5:30 AM GMT
Next Story