Telugu Global
Andhra Pradesh

ఎన్డీఏతో టీడీపీ సంసారం.. కొడాలి నాని సెటైరిక్ ట్వీట్

ఇంతకు ముందు కూడా సంసారం చేశాం కదా అన్న చంద్రబాబు మాటల తర్వాత మోదీని ఆయన గతంలో ఎన్నెన్ని మాటలు అన్నారో జతచేర్చారు మీమర్స్.

ఎన్డీఏతో టీడీపీ సంసారం.. కొడాలి నాని సెటైరిక్ ట్వీట్
X

సీఎం జగన్, ప్రతిపక్షనేత చంద్రబాబు ఒకేసారి వేర్వేరు న్యూస్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలిచ్చారు. జగన్ ఇంటర్వ్యూలో ప్రశ్నలు, సమాధానాలు అన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే చంద్రబాబు ఇంటర్వ్యూ మాత్రం మీమర్స్ కి బాగా పనిపెట్టింది. రాధాకృష్ణ ప్రశ్నలు, చంద్రబాబు సమాధానాలను సోషల్ మీడియాలో చీల్చి చెండాడుతున్నారు నెటిజన్లు.


ప్రస్తుతానికి ప్రయాణం బాగానే ఉంది, రేప్పొద్దున ప్రభుత్వం వస్తే ఎన్డీఏతో సంసారం ఎలా ఉంటుందన్న రాధాకృష్ణ ప్రశ్నకు చంద్రబాబు సమాధానం చెప్పారు. కొత్తేముంది, ఇంతకు ముందు కూడా చేశాం కదా అందరం.. అని ఆయన బదులిచ్చారు. ఆ సమాధానమే సోషల్ మీడియాలో కావాల్సినంత కామెడీ పంచుతోంది.

ఇంతకు ముందు ఏం చేశారు..?

ఇంతకు ముందు కూడా సంసారం చేశాం కదా అన్న చంద్రబాబు మాటల తర్వాత మోదీని ఆయన గతంలో ఎన్నెన్ని మాటలు అన్నారో జతచేర్చారు మీమర్స్. మోదీ కనీసం నమస్కారం కూడా పెట్టరని, అది ఆయన అహంకారం అని గతంలో చంద్రబాబు అన్న మాటల్ని జతకలిపారు. భార్యనే చూసుకోలేని వారు దేశాన్ని ఏం చూసుకుంటారని కూడా చంద్రబాబు గతంలో అన్నారు. "మోదీ వాచ్ మేన్ కాదు, దగాకోరు.. మోదీ కరడుగట్టిన ఉగ్రాది.. మోదీకి ఈ దేశంలో ఉండే అర్హత లేదు, మనకి అన్యాయం చేసిన వ్యక్తి మోదీ.. ఏపీలో బీజేపీ లేదు, మనతో పొత్తు పెట్టుకోబట్టే గెలిచారు.." ఇలా చంద్రబాబు గతంలో అన్న మాటలన్నిటినీ ఆ వీడియో ద్వారా గుర్తు చేశారు. చంద్రబాబుని కూడా మోదీ గతంలో తీవ్రంగా విమర్శించారు. పోలవరాన్ని బాబు ఏటీఎంలా వాడుకున్నారని అన్నారు. ఆ వ్యాఖ్యలు కూడా ఈ వీడియోలో ఉంటాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియోని మాజీ మంత్రి కొడాలి నాని షేర్ చేశారు.

First Published:  9 May 2024 10:56 AM GMT
Next Story