Telugu Global
Andhra Pradesh

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు కొడాలి నాని విన్నపం

పుట్టినరోజుకి, చావుకు తేడా తెలియని లోకేష్‌ను సీఎం చేయడం కోసం.. జూనియర్‌ ఎన్టీఆర్‌పై కుట్రలు చేసి, ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు కొడాలి నాని.

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు కొడాలి నాని విన్నపం
X

ఏపీ రాజకీయాల్లో మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకొచ్చారు మాజీ మంత్రి కొడాలి నాని. 2009 ఎన్నికల ప్రచారంలో ప్రాణాపాయం నుంచి బయటపడిన జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ కోసం ఎంతో కష్టపడ్డారని, కానీ ఆయన్ను చంద్రబాబు తొక్కేశారని ఆరోపించారు. జూనియర్ ఎన్టీఆర్ పై చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని, ఆయన కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. సీనియర్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబుని గొయ్యి తీసి పాతిపెట్టాలని, అప్పుడే టీడీపీ బతికి బట్టకడుతుందని అన్నారు కొడాలి నాని. ఎన్టీఆర్ అభిమానులందరూ కలసి ఈ ఎన్నికల్లో చంద్రబాబుని ఓడించాలని పిలుపునిచ్చారు.

ఈ ఎన్నికల్లో చంద్రబాబు గెలిస్తే జూనియర్‌ ఎన్టీఆర్‌ను టీడీపీ నుంచి శాశ్వతంగా గెంటేస్తారని అన్నారు నాని. పుట్టినరోజుకి, చావుకు తేడా తెలియని లోకేష్‌ను సీఎం చేయడం కోసం.. జూనియర్‌ ఎన్టీఆర్‌పై కుట్రలు చేసి, ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుని ఓడిస్తేనే తెలుగుదేశం పార్టీ జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లోకి వస్తుందన్నారు.

చంద్రముఖిని ఈవీఎంలో బంధించండి..

చంద్రబాబు అనే చంద్రముఖిని ఈసారి ఈవీఎంలో బంధిస్తే రాష్ట్రానికి పట్టిన పీడ శాశ్వతంగా వదిలిపోతుందని అన్నారు కొడాలి నాని. మీ కోసం 120 సార్లు బటన్ నొక్కిన జగన్ కోసం ఎన్నికల్లో రెండు బటన్‌లు నొక్కండంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. అంబేద్కర్ బాటలో నడుస్తున్న సీఎం జగన్‌కు అందరూ అండగా నిలవాలని కోరారు. మంచి జరిగిందని భావిస్తేనే ఓటేయమని అడుగుతున్న దమ్మున్న నాయకుడు జగన్ అని కొనియాడారు నాని.

First Published:  6 March 2024 3:19 AM GMT
Next Story