Telugu Global
Andhra Pradesh

జేడీకి కేసీఆర్‌ ఫోన్

జేడీ గనుక బీఆర్ఎస్‌లో చేరితే రాయలసీమ జిల్లాలతో పాటు వైజాగ్ పార్లమెంటు పరిధిలో పార్టీకి ఊపు వ‌స్తుందని కేసీఆర్‌ అనుకుంటున్నారట. పోయిన ఎన్నికల్లో జనసేన తరపున ఎంపీగా పోటీ చేసిన జీడీకి సుమారు 2.89 లక్షల ఓట్లొచ్చాయి.

జేడీకి కేసీఆర్‌ ఫోన్
X

బీఆర్ఎస్ విస్తరణలో భాగంగా నేతలను చేర్చుకోవటంలో కేసీఆర్‌ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అయితే ఏపీలో మాత్రం కాస్త వేగంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే తోట చంద్రశేఖర్, పార్ధసారధి, రావెల కిషోర్ బాబు లాంటి కొందరిని చేర్చుకున్న విషయం తెలిసిందే. పనిలోపనిగా సీబీఐ జేడీగా పనిచేసిన వీవీ లక్ష్మీనారాయణతో కూడా కేసీఆర్‌ ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. జేడీని గనుక పార్టీలో చేర్చుకుంటే మధ్య తరగతి వర్గాలపై ప్రభావం చూపేందుకు అవకాశముందని కేసీఆర్‌ అంచనా వేస్తున్నారట.

లక్ష్మీనారాయణ ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో వైజాగ్ ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పట్లో మీడియాతో మాట్లాడినపుడు పోటీ ఖాయమని కాకపోతే ఏ పార్టీ తరపున అన్నది తర్వాత చెబుతానన్నారు. తర్వాత చెబుతానన్న పార్టీయే బీఆర్ఎస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉందని తాజా సమాచారం. బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖరే జేడీకి ఫోన్ చేసి కేసీఆర్‌తో మాట్లాడించినట్లు తెలుస్తోంది. తమ పార్టీలో చేరాలని, కోరుకున్నట్లుగా వైజాగ్ ఎంపీగా పోటీ చేయవచ్చని కేసీఆర్‌ హామీ ఇచ్చారట.

అయితే కాస్త ఆలోచించుకుని ఏ సంగతి చెబుతానని జేడీ బదులిచ్చినట్లు తెలిసింది. జేడీ గనుక బీఆర్ఎస్‌లో చేరితే రాయలసీమ జిల్లాలతో పాటు వైజాగ్ పార్లమెంటు పరిధిలో పార్టీకి ఊపు వ‌స్తుందని కేసీఆర్‌ అనుకుంటున్నారట. పోయిన ఎన్నికల్లో జనసేన తరపున ఎంపీగా పోటీ చేసిన జీడీకి సుమారు 2.89 లక్షల ఓట్లొచ్చాయి. ఇన్ని ఓట్లొచ్చాయంటేనే జనాలకు ఆయనపై మంచి సానుకూల అభిప్రాయం ఉందని అర్ధమైపోతోంది.

ఈ అభిప్రాయం ఉంది కాబట్టే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తే గెలిచినా ఆశ్చర్యపోవక్కర్లేదని కేసీఆర్‌ అంచనా వేశారట. మరి జేడీ ఏ విధంగా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. నిజానికి తోట-జేడీ మధ్య మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ సంబంధాలతోనే ఇప్పుడు కేసీఆర్‌తో డైరెక్టుగా జేడీకి తోట ఫోన్లో మాట్లాడించింది. జేడీ గనుక చేరితే ఆయన కారణంగా మరింతమంది బీఆర్ఎస్‌లో చేరే అవకాశాలున్నాయి. న్యూట్రల్స్‌పై ఈ ప్రభావం ఎక్కువగా పడుతుందని అనుకుంటున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.

First Published:  18 Jan 2023 5:28 AM GMT
Next Story