Telugu Global
Andhra Pradesh

బద్ధ శత్రువుతో చేతులు కలపాల్సిందేనా? కాలమహిమ

ఒకప్పుడు తనకు బద్ధ శత్రువు అయిన చంద్రబాబుతోనే కన్నా చేతులు కలపబోతున్నారు. గురువారం కన్నా చంద్రబాబు ఆధ్వర్యంలో పసుపు కండువా కప్పుకోబోతున్నారు. తాను తెలుగుదేశం పార్టీలో 23వ తేదీన చేరబోతున్నట్లు స్వయంగా కన్నాయే ప్రకటించారు.

బద్ధ శత్రువుతో చేతులు కలపాల్సిందేనా? కాలమహిమ
X

రాజకీయాల్లో శాశ్వత శ‌త్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనేది నానుడి. ఈ నానుడి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా పాపులరైన చంద్రబాబునాయుడుకు బాగా సరిపోతుంది. అయితే ఇదే కోవలో తాజాగా కన్నా లక్ష్మీనారాయణ కూడా చేరిపోయారు. విషయం ఏమిటంటే ఒకప్పుడు తనకు బద్ధ శత్రువు అయిన చంద్రబాబుతోనే కన్నా చేతులు కలపబోతున్నారు. గురువారం కన్నా చంద్రబాబు ఆధ్వర్యంలో పసుపు కండువా కప్పుకోబోతున్నారు. తాను తెలుగుదేశం పార్టీలో 23వ తేదీన చేరబోతున్నట్లు స్వయంగా కన్నాయే ప్రకటించారు.

చాలా సంవత్సరాల పాటు చంద్రబాబుతో కన్నాకు ఏమాత్రం పడేదికాదు. తనను చంపించటానికి చంద్రబాబు కుట్రలు చేసినట్లు కన్నా చాలాసార్లు ఆరోపించారు. వంగవీటి రంగాను చంపించినట్లే తనను కూడా చంపించేందుకు చంద్రబాబు కుట్రలు చేసినట్లు కన్నా ఎన్నో ఇంటర్వ్యూల్లో ఆరోపించారు. కన్నాను చంపించేందుకు చంద్రబాబు కుట్ర చేశారంటేనే వీళ్ళిద్దరి మధ్య వైరం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి చంద్రబాబుతోనే ఇప్పుడు ఏ విధంగా చేతులు కలుపుతున్నారు.

ఇక్కడ చేతులు కలపటమంటే సమాన స్థాయి అని అర్థం కాదు. చంద్రబాబు నాయకత్వంలో పనిచేయటానికి కన్నా అంగీకరించారంటేనే ఆయన పరిస్థితి ఏమిటో అర్థ‌మైపోతోంది. బీజేపీలో ఉండలేక జనసేనలో చేరలేక, వైసీపీలో అవకాశం లేక చివరకు వేరే దారిలేకే కన్నా టీడీపీలో చేరుతున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నాకు సామాజిక వర్గంలో ఏమంత పట్టులేదు. అలాగే నియోజకవర్గంలో కూడా పట్టు లేదనే చెప్పాలి.

కాకపోతే ఐదు సార్లు కాంగ్రెస్ తరపున గెలిచి మంత్రిగా, బీజేపీ అధ్యక్షుడిగా ప‌నిచేశారు కాబట్టి కన్నా ప్రముఖ నేతనే చెప్పాలి. 2019 ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంటుకు కన్నా పోటీ చేస్తే వచ్చిన ఓట్లు 15 వేలు. అంటే లోక్‌సభ నియోజకవర్గం ఏడు అసెంబ్లీ సిగ్మెంట్లలోని కాపులు కూడా కన్నాకు ఓట్లేయలేదని అర్థ‌మైపోతోంది. అలాంటి ప్రముఖ నేత జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు చంద్రబాబుతో చేతులు కలుపుతున్నారు. కారణం ఏదైనా ఒక్కపటి శ‌త్రువు నాయకత్వంలోనే కన్నా పనిచేయాల్సి రావటం కాలమహిమనే చెప్పాలి.

First Published:  22 Feb 2023 5:18 AM GMT
Next Story