Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్.. మరో కేసులో ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్

చంద్రబాబు తరపున హరీశ్ సాల్వే, సిద్దార్థ్ లూథ్రా, సిద్దార్థ్ అగర్వాల్ హైకోర్టులో వాదనలు వినిపించగా.. సీఐడీ తరపున సుప్రీంకోర్టు న్యాయవాది ముకుల్ రోహత్గితో పాటు ఏఏజీ వాదించారు.

చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్.. మరో కేసులో ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్
X

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో సీఐడీ పోలీసులు వేసిన రిమాండ్ రిపోర్టును కొట్టి వేయాలని కోరుతూ ఆయన తరపు లాయర్లు ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. మంగళవారం దీనికి సంబంధించి హైకోర్టులో దాదాపు ఐదు గంటల పాటు సుదీర్ఘ వాదనలు జరిగాయి.

చంద్రబాబు తరపున హరీశ్ సాల్వే, సిద్దార్థ్ లూథ్రా, సిద్దార్థ్ అగర్వాల్ హైకోర్టులో వాదనలు వినిపించగా.. సీఐడీ తరపున సుప్రీంకోర్టు న్యాయవాది ముకుల్ రోహత్గితో పాటు ఏఏజీ వాదించారు. అవినీతి నిరోధక చట్టంలోని 17ఏ పైనే బాబు తరపు లాయర్లు దృష్టి పెట్టారు. స్కిల్ డెవలప్‌మెంట్‌లో అవకతవకలు జరిగాయని సీఐడీ వాదిస్తోంది. కానీ అసలు ఆ డబ్బు ఎక్కడికి వెళ్లిందో మాత్రం ఆధారాలు చూపడం లేదని చెప్పారు. నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఇంకా తెరిచే ఉన్నాయని, వాటిలో యువతకు శిక్షణ సైతం కొనసాగుతోందని బాబు తరపు లాయర్లు వాదించారు. ఎన్నికల వేళ కావాలనే కుట్రపూరితంగా ఈ కేసులో చంద్రబాబును ఇరికించారని చెప్పారు. ఈ కేసులో ఎఫ్ఐఆర్ చట్ట విరుద్దంగా ఉందని పేర్కొన్నారు.

ఇక ప్రభుత్వం తరపున వాదించిన లాయర్లు మాత్రం.. షెల్ కంపెనీల ద్వారా నగదు వెళ్లిందని వివరించారు. ప్రస్తుతం ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్లిందో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. విచారణ దశలో కోర్టులు కలుగజేసుకోవద్దని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉదహరించారు. ఇప్పటికే సుదీర్ఘంగా వాదనలు విన్నాము. ఈ రోజు ఒక్క కేసుకే సమయం అయిపోయింది. కాబట్టి వాదనలు అన్నీ ఈ రోజే ముగించాలని ధర్మసనం కోరింది. ఇరు వైపుల వాదనలు పూర్తయ్యాక.. తీర్పును రెండు రోజుల తర్వాత వెల్లడిస్తామని పేర్కొన్నది.

పీటీ వారంట్ దాఖలు..

ఏసీబీ కోర్టులో చంద్రబాబుపై మరో పీటీ వారంట్ దాఖలు అయ్యింది. ఏపీ ఫైబర్‌ నెట్ స్కాంలో చంద్రబాబు ప్రధాన ముద్దాయిగా ఏసీబీ కోర్టులో సీఐడీ పీటీ వారంట్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించాల్సిందిగా కోరింది. . దీంతో ఏసీబీ కోర్టు పిటిషన్‌ను అంగీకరించింది. ఫైబర్‌నెట్ స్కాంలో రూ.115 కోట్ల మేర స్కామ్ జరిగిందని సిట్ దర్యాప్తులో తేలింది. 2019లోనే సైబర్ నెట్‌ స్కాంలో 19 మందిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఏ1గా వేమూరి హరి ప్రసాద్, ఏ2గా మాజీ ఎండీ సాంబశివరావుగా పేర్కొన్నది.

ఈ కేసులో ఏ1గా ఉన్న వేమూరి హరిప్రసాద్.. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా సీఐడీ చెబుతోంది. ఫైబర్ నెట్ స్కాంలో చంద్రబాబు పాత్ర ఉందని సీఐడీ విచారణలో తేలింది. టెర్రా సాఫ్ట్ అనే కంపెనీకి అక్రమ మార్గంలో టెండర్లు ఇచ్చినట్లు సీఐడీ చెబుతోంది. నిబంధనలకు విరుద్దంగా టెండర్ల గడువు వారం రోజులు పొడిగించారని.. బ్లాక్ లిస్టులో ఉన్న టెర్రా సాఫ్ట్‌కే టెండర్ దక్కేలా వేమూరి చక్రం తిప్పారని సీఐడీ ఆరోపిస్తోంది. ఈ స్కాంలో రూ.115 కోట్ల మేర అవినీతి జరిగిందని సీఐడీ విచారణలో తేలింది.

కస్టడీ పిటిషన్ 21కి వాయిదా..

ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్‌పై తీర్పు రిజర్వులో ఉండటంతో ఏసీబీ న్యాయస్థానంలో సీఐడీ వేసిన కస్టడీ పిటిషన్‌పై విచారణను రెండు రోజులు వాయిదా వేసింది. చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లపై కూడా విచారణ వాయిదా పడింది.

First Published:  19 Sep 2023 1:30 PM GMT
Next Story