Telugu Global
Andhra Pradesh

జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల కలకలం.. ఈసారి ఎక్కడంటే

కొడాలి నాని నామినేషన్ ర్యాలీలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆయనకు మద్దతు తెలిపారు. ఎన్టీఆర్ ఫొటోలు, నాని ఫొటోలు ఉన్న ఫ్లెక్సీలు పట్టుకుని ఆయన ర్యాలీలో పాల్గొన్నారు.

జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల కలకలం.. ఈసారి ఎక్కడంటే
X

ఏపీలో ఎన్నికలంటే కచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన వస్తుంది. ఆయన టీడీపీకి మద్దతు ఇస్తారా, లేదా అనే విషయం పక్కనపెడితే ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆర్ ఫ్లెక్సీలు, బ్యానర్లు, ఆయన ఫొటోలతో ఉన్న ప్లకార్డులు కనపడటం ఖాయం. ఇక్కడ విశేషం ఏంటంటే.. పార్టీలకు అతీతంగా ఆయ ఫొటోలు కనపడటం. తాజాగా కొడాలి నాని నామినేషన్ ర్యాలీలో జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.

గుడివాడలో ఐదోసారి ఎమ్మెల్యేగా గెలిచేందుకు బరిలో దిగుతున్నారు కొడాలి నాని. నానీకి, ఎన్టీఆర్ కి మధ్య ఉన్న సత్సంబంధాలు అందరికీ తెలుసు. టీడీపీని, చంద్రబాబుని చెడామడా తిట్టినా జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ కుటుంబంపై మాత్రం తన అభిమానాన్ని చాటుకుంటారు కొడాలి నాని. తాజాగా నాని నామినేషన్ ర్యాలీలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆయనకు మద్దతు తెలిపారు. ఎన్టీఆర్ ఫొటోలు, నాని ఫొటోలు ఉన్న ఫ్లెక్సీలు పట్టుకుని ఆయన ర్యాలీలో పాల్గొన్నారు. తమ మద్దతు నానీకేనని స్పష్టం చేశారు. పెనమలూరు నుంచి పోటీ చేస్తున్న మంత్రి జోగి రమేష్ నామినేషన్ ర్యాలీలో కూడా ఆయనకు మద్దతుగా ఎన్టీఆర్ అభిమానులు సందడి చేశారు. ఈ ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

టీడీపీలో అయోమయం..

2009లో చంద్రబాబు చేసిన మోసానికి జూనియర్ ఎన్టీఆర్ కి కనువిప్పు కలిగి చాన్నాళ్లుగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కనీసం టీడీపీకి ఓటు వేయండని ఆయన ఎప్పుడూ ఎక్కడా బహిరంగంగా చెప్పలేదు. పోనీ టీడీపీలో ఉన్న తన సన్నిహితులకోసం కూడా ఆయన ప్రచారం చేయలేదు. అప్పుడప్పుడు ఆయన ఫొటోలతో టీడీపీ అభిమానులు సందడి చేస్తుంటారు. కుప్పంలో ఎన్టీఆర్ అభిమానుల ఉత్సాహాన్ని చంద్రబాబు పూర్తిగా నిర్వీర్యం చేశారు. పార్టీ సభల్లో కానీ, ప్రచారంలో కానీ ఎక్కడా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన లేకుండా చేశారు. లోకేష్ అసమర్థత బయటపడిపోతుందనేది ఆయన బాధ, భయం. ఆమధ్య ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పెట్టిన ఫ్లెక్సీలపై బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేయడం, వెంటనే వాటిని పక్కకు తీసేయడం తెలిసిందే. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ షర్ట్ పై సైకిల్ గుర్తు ఉన్న లోగో ఉందని, ఆయన ప్రచారానికి వస్తున్నారంటూ సోషల్ మీడియాలో పుకార్లు వచ్చాయి. వాటిలో ఏమాత్రం వాస్తవం లేదని తేలిపోయింది. తాజాగా వైసీపీ అభ్యర్థులకు ఎన్టీఆర్ అభిమానులు మద్దతు తెలపడం మాత్రం విశేషం.

First Published:  26 April 2024 3:55 AM GMT
Next Story