Telugu Global
Andhra Pradesh

మళ్లీ తెరపైకి జగన్ కేసులు.. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే..?

విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. అసలు మూడో వ్యక్తి ఎందుకు పిటిషన్ వేశారని ప్రశ్నించింది. అదే సమయంలో.. బదిలీ పిటిషన్‍ ను ఎందుకు విచారించకూడదో చెప్పాలంటూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

మళ్లీ తెరపైకి జగన్ కేసులు.. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే..?
X

ఇటీవల కాలంలో వరుసగా చంద్రబాబు కేసుల వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హైలైట్ గా మారింది. సడన్ గా ఇప్పుడు జగన్ కేసుల వ్యవహారం కూడా వార్తల్లోకెక్కింది. ఎంపీ రఘురామకృష్ణంరాజు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ కారణంగా ఈ కదలిక వచ్చింది. ఈ కేసుల విచారణ మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ రఘురామ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. అసలు మూడో వ్యక్తి ఎందుకు పిటిషన్ వేశారని ప్రశ్నించింది. అదే సమయంలో.. బదిలీ పిటిషన్‍ ను ఎందుకు విచారించకూడదో చెప్పాలంటూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

సీబీఐకి నోటీసులు..

జగన్ పై సీబీఐ నమోదు చేసిన 11 కేసులు ఇప్పటివరకు 3,041 సార్లు వాయిదా పడ్డాయని, వాటి విచారణ త్వరగా జరిపి నిందితులను శిక్షించాలన్న ఉద్దేశం సీబీఐలో కనిపించట్లేదని, జగన్‌ కు ఇష్టానుసారం వాయిదాలు కోరే స్వేచ్ఛనిచ్చారని తన పిటిషన్ లో ఆరోపించారు ఎంపీ రఘురామకృష్ణంరాజు. సుప్రీంకోర్టు కలుగజేసుకుని ఈ కేసుల విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరారు. ఈ పిటిషన్ చూసిన వెంటనే ధర్మాసనానికి ఓ అనుమానం వచ్చింది. ఈ పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తి ప్రతిపక్ష పార్టీకి చెందినవారా అని ప్రశ్నించింది. కాదు, ఆయన కూడా అదే పార్టీ అని రఘురామ తరపు న్యాయవాది చెప్పారు.

ఉద్దేశపూర్వకంగానే పిటిషన్..

సీఐడీ కేసులతో చంద్రబాబుని వైసీపీ ఉక్కిరిబిక్కిరి చేస్తోందని, ఉద్దేశపూర్వకంగానే కేసులు పెడుతోందనేది టీడీపీ వాదన. ఈ క్రమంలో టీడీపీ ప్రోద్బలంతోనే వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు.. జగన్ కేసుల్ని కదిలించాలనే ప్రయత్నం చేశారనే ప్రచారం ఉంది. ఆయన పిటిషన్ తో సుప్రీంకోర్టు సీబీఐ సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. విచారణను జనవరికి వాయిదా వేసింది. సీబీఐ వివరణ ఎలా ఉంటుందో చూడాలి.


First Published:  3 Nov 2023 6:18 AM GMT
Next Story