Telugu Global
Andhra Pradesh

భూమా కుటుంబానికి టీడీపీ షాకివ్వ‌బోతుందా..?

టీడీపీ రాజకీయ వ్యవహారాలను పర్యవేక్షించే ఓ సంస్థ ఇటీవ‌ల ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లాలో స‌ర్వే చేస్తే గ‌త ఎన్నిక‌ల‌కు ఇప్ప‌టికీ ప‌రిస్థ‌తి ఏ మాత్రం మెరుగుప‌డ‌లేద‌ని తేలింద‌ని స‌మాచారం.

భూమా కుటుంబానికి టీడీపీ షాకివ్వ‌బోతుందా..?
X

భూమా కుటుంబానికి టీడీపీ షాకివ్వ‌బోతుందా..?

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప‌ట్టుకోసం టీడీపీ తెగ ప్ర‌య‌త్నిస్తోంది. గత 20 ఏళ్లలో ఇక్కడ ఎన్నిక‌ల్లో టీడీపీ అత్యధికంగా ఓసారి నాలుగు స్థానాలు మాత్ర‌మే నెగ్గింది. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. వైసీపీ ఇక్క‌డ అత్యంత బ‌లంగా ఉంద‌ని టీడీపీకి తెలుసు. దానికి తోడు దివంగ‌త నేత భూమా నాగిరెడ్డి వార‌సుల ఒంటెత్తు పోక‌డల‌తో పార్టీకి ఉన్న కాస్త ప‌ట్టు కూడా పోతోంద‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. అందుకే ఈసారి భూమా కుటుంబాన్ని ప‌క్క‌న‌పెట్టే అవ‌కాశాలే ఎక్కువ క‌నిపిస్తున్నాయి.

టీడీపీ స‌ర్వేల్లోనూ మైన‌స్సే!

టీడీపీ రాజకీయ వ్యవహారాలను పర్యవేక్షించే ఓ సంస్థ ఇటీవ‌ల ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లాలో స‌ర్వే చేస్తే గ‌త ఎన్నిక‌ల‌కు ఇప్ప‌టికీ ప‌రిస్థ‌తి ఏ మాత్రం మెరుగుప‌డ‌లేద‌ని తేలింద‌ని స‌మాచారం. 2019 ఎన్నికల ఫలితాలే ఈ జిల్లాలో పునరావృతం అవుతాయని స‌ర్వే తేల్చ‌డంతో ఈసారి ఆచితూచి టికెట్లు ఇవ్వాల‌ని టీడీపీ భావిస్తోంది. అందుకే భూమా కుటుంబానికి ప‌ట్టున్న ఆళ్ల‌గ‌డ్డ‌, నంద్యాల వంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో వారిని కాద‌ని ప్ర‌త్యామ్నాయ అభ్య‌ర్థుల వైపు చూస్తున్న‌ట్లు తెలుస్తోంది.

నంద్యాల‌లో బ్ర‌హ్మానంద‌రెడ్డికి నో ఛాన్స్‌!

నంద్యాల నుంచి భూమా బ్రహ్మనందరెడ్డిని తప్పించేందుకు అక్క‌డి కీల‌క నేత బీసీ జనార్దన్‌రెడ్డి కొన్నాళ్లుగా ప్ర‌య‌త్నిస్తున్నారు. బ్రహ్మనందరెడ్డి, బీసీ జ‌నార్ద‌న్‌రెడ్డి ఒక‌రిపై ఒక‌రు చంద్రబాబుకు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. చంద్ర‌బాబు ఇటీవల స్కిల్ కేసులో నంద్యాలలో అరెస్టయ్యే ముందురోజు ఈ త‌తంగం జోరుగా న‌డిచింది. నంద్యాల బహిరంగసభలో బ్రహ్మానంద‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలని భూమా అనుచరులు నినాదాలు చేసినా.. చంద్రబాబు సర్వేలను బట్టే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసేశారు. ఈ క్రమంలో నంద్యాల నుంచి మైనార్టీ అభ్య‌ర్థి, సీనియ‌ర్ నేత ఫ‌రూఖ్ పేరును ఖ‌రారు చేయ‌డానికి ఆ పార్టీ దాదాపు సిద్ధ‌మైంద‌ని చెబుతున్నారు.

అఖిల‌ప్రియ అవ‌కాశాలూ గ‌ల్లంత‌వుతున్నాయా..?

మ‌రోవైపు భూమా నాగిరెడ్డి కుమార్తె, మాజీ మంత్రి అఖిల‌ప్రియ‌కు ఆళ్ల‌గడ్డ‌లోనూ అవ‌కాశాలు స‌న్న‌గిల్లుతున్నాయి. ఎవరికి టిక్కెట్ ఇచ్చినా ఆళ్లగడ్డలో గెలిచే పరిస్థితులు లేవ‌ని అంచ‌నా వేస్తున్న టీడీపీ.. దీన్ని జ‌న‌సేన‌కు పొత్తులో ఇస్తే ఎలా ఉంటుంద‌ని ఆలోచిస్తున్న‌ట్లు తెలిసింది. ఇక్క‌డ బలిజ ఓటర్లు అధికంగా ఉండటంతో జనసేనకు ఇస్తే బాగుంటుంద‌నే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఈ త‌రుణంలో సీనియ‌ర్ నాయకుడు ఇరిగెల రాంపుల్లారెడ్డి జనసేన పార్టీలో చేర‌డం ప్రాధాన్యత‌ సంత‌రించుకుంది.

పొత్తులో భాగంగా జనసేన టిక్కెట్ తనకే వస్తుందని ఆయన ధీమా. ఈ లెక్క‌న నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డి, ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియకు టికెట్లు దక్కకపోతే 'భూమా' కుటుంబం క‌ర్నూలు రాజకీయాల్లో తెర‌మ‌రుగైన‌ట్లే. అప్పుడు వాళ్ల దారేంటి..? వ‌దిలేసుకుని వ‌చ్చిన వైసీపీ వెళ‌తారా..? అనేది ఇప్పుడు ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ .

First Published:  11 Nov 2023 7:52 AM GMT
Next Story