Telugu Global
Andhra Pradesh

వైపీపీలోకి రాయపాటి... తప్పు చేస్తున్నారా?

ఇప్పుడు గనుక రాయపాటిని వైసీపీలో చేర్చుకుంటే పార్టీలో ఇప్పుడున్న స్ట్రక్చర్ అంతా డిస్ట్రబ్ అవుతుంది. మాజీ ఎంపీ చేరికను వ్యతిరేకిస్తున్న వాళ్ళెవరైనా ఉంటే వాళ్ళలో అసంతృప్తి మొదలై చివరకు టీడీపీలో చేరినా ఆశ్చర్యంలేదు.

వైపీపీలోకి రాయపాటి... తప్పు చేస్తున్నారా?
X

గుంటూరు జిల్లాలో సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు వైసీపీలో చేరబోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీలో ఇమడలేకపోతున్న ఈ మాజీ ఎంపీ అధికార పార్టీలో చేరేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఒకప్పటి తన శిష్యుడు, జిల్లా వైసీపీ అధ్య‌క్షుడైన డొక్కా మాణిక్యవరప్రసాద్ ద్వారా ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు ప్రచారం ఊపందుకుంది. దశాబ్దాలుగా బద్ధ శతృవుగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరటమే కారణం. అలాగే కన్నాకు చంద్రబాబునాయుడు విపరీతమైన ప్రాధాన్యత ఇవ్వటాన్ని రాయపాటి తట్టుకోలేకపోతున్నారట.

రాబోయే ఎన్నికల్లో తమ కొడుకు రంగబాబును సత్తెనపల్లి అసెంబ్లీకి పోటీ చేయించాలని ప్రయత్నిస్తున్నారు. అయితే రాయపాటి ప్రయత్నాలకు చంద్రబాబు పెద్దగా సానుకూలంగా లేరు. పైగా కన్నాను సత్తెనపల్లికి ఇన్‌చార్జిగా నియమించారు. అప్పటి నుండి రాయపాటికి మండిపోతోంది. అందుకనే టీడీపీలో ఉంటే లాభం లేదని అర్థ‌మైపోవటంతోనే వైసీపీలోకి మారాలని ప్రయత్నాలు మొదలుపెట్టారట.

జరుగుతున్న ప్రచారం ప్రకారం రాయపాటి గనుక వైసీపీలో చేరటం ఖాయమైతే జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తున్నట్లే అనుకోవాలి. ఎందుకంటే రాయపాటి ఏ పార్టీలోను ఇమడలేరు. ఏ పార్టీలో ఉన్నా పోటీ చేయటానికి అవకాశం ఆయనకే దక్కాలి. ఆయన ఏమనుకుంటే అది జరిగిపోవాలి. అలా కాదంటే ఇక అసంతృప్తితో గొడవలు మొదలుపెడతారు. మిగిలిన నేతలను కూడా కంపు చేస్తారు. అనారోగ్యంతో రాయపాటి చాలాకాలంగా వీల్ ఛైర్‌కే పరిమితమయ్యారు. ఈయన కొడుకు రంగబాబుకు నియోజకవర్గంలో పెద్దగా పట్టులేదు. నరసరావుపేట ఎంపీగా లేదా సత్తెనపల్లి లేదా పెదకూరపాడు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారు.

ఇప్పుడు గనుక రాయపాటిని వైసీపీలో చేర్చుకుంటే పార్టీలో ఇప్పుడున్న స్ట్రక్చర్ అంతా డిస్ట్రబ్ అవుతుంది. మాజీ ఎంపీ చేరికను వ్యతిరేకిస్తున్న వాళ్ళెవరైనా ఉంటే వాళ్ళలో అసంతృప్తి మొదలై చివరకు టీడీపీలో చేరినా ఆశ్చర్యంలేదు. నిజానికి రాయపాటి కుటుంబానికి రాజకీయాల్లో ఇప్పుడేమంత పట్టులేదు. ఈ విషయాలను గ్రహించే చంద్రబాబు పట్టించుకోవటంలేదు. అలాంటిది జగన్ గనుక రాయపాటిని చేర్చుకుంటే తప్పు చేస్తున్నారనే అనుకోవాలి. మరి రాయపాటి ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తుంది? జగన్ ఏమంటారో చూడాల్సిందే.

First Published:  18 July 2023 5:27 AM GMT
Next Story