Telugu Global
Andhra Pradesh

తాడేపల్లిగూడెంలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన.. భార్య తల రెండు ముక్కలు చేసి.. ఒక‌ చేయిని నరికి మరో చేతిలో పెట్టి..

తాను మారిపోయానని ఇంటికి రావాలని దావీద్ తరచూ నిర్మలను ప్రాధేయపడేవాడు. భర్త నిజంగా మారిపోయాడని నమ్మిన నిర్మల మూడు రోజుల కిందట అత్తవారింటికి వచ్చింది.

తాడేపల్లిగూడెంలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన.. భార్య తల రెండు ముక్కలు చేసి.. ఒక‌ చేయిని నరికి మరో చేతిలో పెట్టి..
X

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఒళ్ళు గగుర్పొడిచే దారుణ సంఘటన జరిగింది. ఓ భర్త తన భార్యను అత్యంత దారుణంగా నరికి చంపాడు. అంతటితో ఆగకుండా శరీరం నుంచి తలను పక్కకు తీసి రెండు ముక్కలుగా నరికాడు. ఒక చెయ్యిని నరికి మరో చేతిలో పెట్టాడు. హత్య జరిగిన తీరును చూసి పోలీసులే బిత్తరపోయారు. తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెంలో నివాస‌ముండే గంజి దావీద్, నిర్మల(30) దంపతులకు పదేళ్ల లోపు వయసున్న ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

అయితే భార్యాభర్తల మధ్య కొన్నేళ్లుగా విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిర్మల తన పిల్లలను పుట్టింట్లో ఉంచి బతుకుదెరువు కోసం కువైట్ వెళ్ళింది. భార్య వదిలేసి వెళ్లిన తర్వాత దావీద్ మద్యానికి బానిస అయ్యాడు. కువైట్‌కు వెళ్లిన నిర్మల తనకు డబ్బు పంపించకుండా పుట్టింటికి మాత్రమే పంపుతుండడంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు.

తనకు కూడా డబ్బు పంపాలంటూ కుమార్తెలను చిత్రహింసలు పెట్టి.. వీడియోలు తీయించి వాటిని కువైట్‌కు పంపేవాడు. అయితే ఆ వీడియోలు స్థానికంగా కూడా వైరల్ కావడంతో తాడేపల్లిగూడెం రూరల్ పోలీసులు దావీద్‌ను అరెస్టు చేసి జైలుకు పంపారు.

ఇదిలా ఉండగా కొన్ని నెలల కిందట నిర్మల కువైట్ నుంచి ఇంటికి వచ్చి పుట్టింట్లోనే ఉంటోంది. ఈ నేపథ్యంలో దావీద్ కొద్దిరోజుల కిందట బెయిల్ పై జైలు నుంచి వచ్చాడు. తరచూ నిర్మలను కలిసి తాను మారిపోయానని ఇంటికి రావాలని ప్రాధేయపడేవాడు. భర్త నిజంగా మారిపోయాడని నమ్మిన నిర్మల మూడు రోజుల కిందట అత్తవారింటికి వచ్చింది.

గురువారం రాత్రి భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవ జరిగింది. దీంతో ఆమెను చంపాలని నిర్ణయించుకున్న దావీద్ శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో కత్తితో నిర్మలను నరికి చంపాడు. శరీరం నుంచి తలను వేరు చేసి రెండు ముక్కలు చేశాడు. ఒక చెయ్యిని నరికి మరో చేతిలో పెట్టాడు. తెల్లవారిన తర్వాత నిర్మల హత్యకు గురైనట్లు తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తల రెండు ముక్కలై, ఒక చేతిలో నరికిన మరో చెయ్యి ఉండడం చూసి పోలీసులు సైతం బిత్తరపోయారు. నిందితుడిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ బండారు శ్రీనాథ్ తెలిపారు.

First Published:  28 April 2023 6:43 AM GMT
Next Story