Telugu Global
Andhra Pradesh

మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నా.. మాజీ మంత్రి రఘువీరారెడ్డి ప్రకటన

ప్రధాని మోడీని రాహుల్ గాంధీ ఒక్క మాట అన్నందుకే ఆయన పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయడం తన మనసును కలచివేసిందని రఘువీరారెడ్డి చెప్పారు.

మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నా.. మాజీ మంత్రి రఘువీరారెడ్డి ప్రకటన
X

రాజ‌కీయాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న‌ట్టు అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఎన్. రఘువీరారెడ్డి తాజాగా ప్రకటించారు. తాను కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతానని చెప్పారు. రఘువీరారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడిగా వ్యవహరించారు. మడకశిర నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన రఘువీరా, 2009లో కళ్యాణదుర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

రఘువీరారెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన సన్నిహితుడిగా మెలిగారు. వైఎస్ క్యాబినెట్లో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. వైఎస్ మరణాంతరం రోశయ్య, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో కీలక మంత్రి పదవులు చేప‌ట్టారు. తెలంగాణ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పూర్తిగా బలహీనపడ్డ సంగతి తెలిసిందే. ఆ సమయంలో నవ్యాంధ్రప్రదేశ్ తొలి పీసీసీ అధ్యక్షుడిగా రఘువీరారెడ్డి 2014లో బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో డిపాజిట్లు కోల్పోయింది.

ఆ తర్వాత రఘురారెడ్డి కూడా క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకున్నారు. వ్యవసాయం చేసుకుంటూ సాధారణ రైతులా జీవించారు. అయితే ఆయన ఇప్పుడు మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. ప్రధాని మోడీని రాహుల్ గాంధీ ఒక్క మాట అన్నందుకే ఆయన పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయడం తన మనసును కలచివేసిందని రఘువీరారెడ్డి చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలనుంచి తప్పుకోవడం భావ్యం కాదని ప్రజల ముందుకు మళ్ళీ వచ్చినట్లు రఘువీరా తెలిపారు.

త్వరలో కర్ణాటకలో జరగబోయే ఎన్నికల్లో తనను బెంగళూరు నగర కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరిశీలకుడిగా నియమించారని, కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు కోసం కృషిచేస్తానని రఘువీరారెడ్డి తెలిపారు. కొన్నేళ్ల కిందట కాంగ్రెస్ కు రాష్ట్రంలో తిరిగి వైభవం తీసుకువస్తామని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, సాకే శైలజానాథ్ రాజకీయాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. అయితే కిరణ్ కుమార్ పార్టీలో చేరిన రోజు తప్ప మళ్లీ ఎప్పుడు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఇటీవల బీజేపీలో చేరారు. శైలజానాథ్ కొంతకాలం పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించి ఆ తర్వాత మళ్లీ రాజకీయాలకు దూరం అయ్యారు. ఇక ఇప్పుడు 66 ఏళ్ల వయసులో రఘువీరారెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగుతారో ఇతర నేతల్లాగా మళ్లీ దూరం అవుతారో వేచి చూడాలి.

First Published:  19 April 2023 6:07 AM GMT
Next Story