Telugu Global
Andhra Pradesh

ఏపీలో తగ్గిన నిరుద్యోగ రేటు.. ఎందుకంటే..?

స్కిల్ స్కామ్ లాంటి కుంభకోణాలతో చంద్రబాబు కాలం సరిపెట్టారని.. అసలైన ఉపాధి అవకాశాలను యువత ముందుకు తెచ్చి సీఎం జగన్ తన మాట నిలబెట్టుకున్నారని అంటున్నారు వైసీపీ నేతలు.

ఏపీలో తగ్గిన నిరుద్యోగ రేటు.. ఎందుకంటే..?
X

నిన్న మొన్నటి వరకూ తెలంగాణలో నిరుద్యోగం, ఉద్యోగాల కల్పన అనే విషయాలు వార్తల్లో ప్రముఖంగా కనిపించేవి. ఎన్నికల వేళ అధికార, ప్రతిపక్షాల మధ్య ఉద్యోగాలు, నోటిఫికేషన్ల విషయంలో తీవ్ర విమర్శలు చెలరేగాయి కూడా. అక్కడ సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు ఏపీలో నిరుద్యోగిత బాగా తగ్గిందంటూ ప్రభుత్వం గర్వంగా చెబుతోంది. సీఎం జగన్ హయాంలో తీసుకున్న నిర్ణయాల వల్ల ఏపీలో నిరుద్యోగిత రేటు తగ్గిందని, ఇది తాము చెబుతున్న మాట కాదని, ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని చెప్పారు వైసీపీ నేతలు.

ఏపీలో సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓవైపు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తూ.. మరోవైపు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు పెద్ద పీట వేస్తుండటంతో ఉపాధి అవకాశాలను మెరుగయ్యాయని అంటున్నారు వైసీపీ నేతలు. ఈ కృషి ఆర్‌బీఐ గణాంకాల్లో స్పష్టంగా కనిపించిందని చెబుతున్నారు. 2018–19లో అంటే చంద్రబాబు పాలనలో ఏపీలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వెయ్యి మందికి 45 మంది నిరుద్యోగులుండగా.. 2022–23లో(జగన్ పాలనలో) ఆ సంఖ్య 33కు తగ్గింది. 2018–19లో పట్టణ ప్రాంతాల్లో ప్రతి వెయ్యి మందికి 73 మంది నిరుద్యోగులుండగా.. 2022–23లో ఆ సంఖ్య 65కు తగ్గింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళలు, పురుషుల్లోని నిరుద్యోగుల సంఖ్య కూడా 2018–19 కంటే 2022–23లో తగ్గిందని ఆర్‌బీఐ వెల్లడించింది.

సచివాలయాలతో ఉద్యోగ అవకాశాలు..

సీఎం జగన్ అధికారంలోకి రాగానే ఏపీలో సచివాలయ వ్యవస్థని తీసుకొచ్చారు. గ్రామాల్లో ప్రతి సచివాలయానికి 10మంది, పట్టణాల్లో వార్డు సచివాలయానికి 11మంది చొప్పున ఉద్యోగుల్ని కొత్తగా రిక్రూట్ చేసుకున్నారు. ఇప్పటి వరకు 4.93 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తే.. అందులో శాశ్వత ఉద్యోగాలే 2.13 లక్షలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. వైసీపీ హయాంలో 2.5 లక్షల ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ఏర్పాటు కాగా.. కొత్తగా 16.5 లక్షల మందికి ఉపాధి లభించింది. వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఆసరా, కాపు నేస్తం వంటి పథకాల ద్వారా మహిళలకు ఆర్థిక సాయం అందించడంతో వారు చిన్నచిన్న వ్యాపారాలు మొదలుపెట్టారు. దీంతో లక్షలాది మంది మహిళలు స్వయం ఉపాధి పొందుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 1.2 లక్షల మంది విద్యార్థులు క్యాంపస్ ప్లేస్ మెంట్లు సాధించారు. స్కిల్ స్కామ్ లాంటి కుంభకోణాలతో చంద్రబాబు కాలం సరిపెట్టారని.. అసలైన ఉపాధి అవకాశాలను యువత ముందుకు తెచ్చి సీఎం జగన్ తన మాట నిలబెట్టుకున్నారని అంటున్నారు వైసీపీ నేతలు.


First Published:  1 Dec 2023 7:30 AM GMT
Next Story