Telugu Global
Andhra Pradesh

తప్పుడు రాతలతో రైతులపై రామోజీ మొసలి కన్నీళ్లు

కేసీ కెనాల్‌ ఆయకట్టులో సాగు చేసిన పంటలు ఎండిపోకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను జల వనరుల ఇంజినీర్లు కచ్చితంగా పాటిస్తున్నారు.

తప్పుడు రాతలతో రైతులపై రామోజీ మొసలి కన్నీళ్లు
X

కేసీ కెనాల్‌ కింది రైతులపై ఈనాడు రామోజీరావు మొసలి కన్నీరు కారుస్తున్నారు. రైతులను పట్టించుకోకుండా శ్రీశైలం జలాలను అమ్ముకుంటున్నారని ఆయన తెగ బాధపడిపోయారు. అందులో ఏ మాత్రం సత్యం లేదని వాస్తవాలను పరిశీలిస్తే అర్థమవవుతుంది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. అయినా కూడా ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికి అన్ని చర్యలూ తీసుకుంది.

కేసీ కెనాల్‌ ఆయకట్టులో సాగు చేసిన పంటలు ఎండిపోకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను జల వనరుల ఇంజినీర్లు కచ్చితంగా పాటిస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల శ్రీశైలం ప్రాజెక్టులో నీటి లభ్యత తగ్గింది. దీంతో కేసీ కెనాల్‌ పరిధిలోని ఉమ్మడి కర్నూలు, కడప జిల్లాల్లోని 2.65 లక్షల ఎకరాల ఆయకట్టులో వరికి బదులు ఆరుతడి పంటలు వేసుకోవాలని అధికారులు రైతులకు సూచించారు. ఈ విషయంపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించారు. దాంతో రైతులు ఆరుతడి పంటలే వేశారు

అనంతరం సెప్టెంబర్‌, నవంబర్‌ మాసాల్లో కాస్తా వర్షాలు పడ్డాయి. దాంతో నవంబర్‌ 25వ తేదీన రెండోసారి సాగునీటి సలహా మండలి సమావేశం నిర్వహించి కేసీ కెనాల్‌కు డిసెంబర్‌ 15వ తేదీ వరకు నీటిని ఇవ్వాలని తీర్మానించారు. అయితే, కలెక్టర్‌ను, ప్రజా ప్రతినిధులను రైతులు కలిసి శ్రీశైలం లెవెల్‌ పర్మిట్‌ చేసేంత వరకు నీటిని ఇవ్వాలని కోరారు. దాంతో నంద్యాల కలెక్టర్‌, జేసీ ఆదేశాల మేరకు వారాబందీ ప్రకారం నీటిని విడుదల చేస్తున్నారు. నీరు వృథా కాకుండా జలవనరుల శాఖ అధికారులు రాత్రింబవళ్లు గస్తీ కాసి ప్రతి ఎకరాకు నీరు అందేలా చూశారు.

బడా వాణిజ్య రైతులతో కుమ్మకై రబీలోని మిరప పంటకు నీటిని అమ్ముకుంటున్నారని రామోజీరావు ఈనాడు మరో అబద్ధాన్ని రాసింది. నిజానికి కేసీ కెనాల్‌ ఆయకట్టులో మిరప సాగు చేసినవారిలో బడా రైతులు ఎవరూ లేరు. ఒకరికి మాత్రమే పది ఎకరాలుంది. మిగతా అందరూ ఎకరా, ఎకరన్నర ఉన్న సన్నకారు రైతులే. కానీ, అనధికారికంగా 20 వేల ఎకరాల్లో మిరప సాగు చేశారని రామోజీ పత్రిక తప్పుడు లెక్కలతో కుస్తీ పట్టింది.

పోతిరెడ్డిపాడు నుంచి తీసుకునే నీటిలో 5 టీఎంసీలు కేసీ కెనాల్‌కు తీసుకోవచ్చు. ప్రస్తుతం అక్కడి నుంచి తీసుకునేందుకు అవకాశం లేదు. దాంతో ముచ్చుమర్రి నుంచి నీటిని తీసుకుంటే ఈనాడులో తప్పుడు కూతలు కూశారు.

First Published:  6 Feb 2024 8:40 AM GMT
Next Story