Telugu Global
Andhra Pradesh

అప్పు చెల్లించాలంటూ అఖిలప్రియ ఇంటి పైకి బంధువులు

ఆ సమయంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. విషయం తెలుసుకున్న ఆళ్లగడ్డ ఎస్ఐ వెంకట్ రెడ్డి పోలీసులతో పాటు అక్కడికి చేరుకొని బంధువులకు సర్ది చెప్పారు.

అప్పు చెల్లించాలంటూ అఖిలప్రియ ఇంటి పైకి బంధువులు
X

భూమా దంపతుల మరణం తర్వాత వారి పిల్లలు తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తున్నారు. మరీ ముఖ్యంగా మాజీ మంత్రి అఖిలప్రియ చుట్టూ అనేక వివాదాలు అలుముకుంటున్నాయి. కొద్దిరోజుల క్రితమే భూమా నాగిరెడ్డి తీసుకున్న అప్పు చెల్లించాలంటూ బ్యాంకు సిబ్బంది అఖిలప్రియ ఇంటి ముందు ధర్నా చేశారు.

ఇప్పుడు భూమా నాగిరెడ్డి బంధువులంతా కలిసి అఖిలప్రియ ఇంటి ముందు అప్పు వసూలు కోసం ఆందోళనకు దిగడం సంచలనంగా మారింది. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి బ‌తికున్నప్పుడు బంధువుల దగ్గర సుమారు 8 కోట్ల రూపాయల వరకు అప్పుగా తీసుకున్నారు. వారు చనిపోయిన తర్వాత అప్పు చెల్లించాల్సిందిగా భూమా నాగిరెడ్డి పిల్లల్ని పదేపదే బంధువులు విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ, వారి నుంచి సరైన సమాధానం లేదు.

ఈ నేపథ్యంలో బంధువులంతా ఏక‌మై భూమా నాగిరెడ్డి కుమార్తె అఖిలప్రియ ఇంటి వ‌ద్ద‌కు వ‌చ్చారు. తమ బాకీ తిరిగి చెల్లించాలంటూ భూమా అఖిలప్రియను కోరారు. అయితే భూమా అఖిలప్రియ తాను ఎవరికీ బాకీలేనని, తానేమైనా పత్రాలు రాసిచ్చానా అంటూ ఎదురు తిరిగినట్టు చెబుతున్నారు. ఈ సమయంలోనే భూమా అఖిలప్రియకు, బంధువులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది.

ఒక దశలో ఘర్షణపడబోయారు. అక్కడున్న కొందరు మధ్యవర్తులు.. బంధువుల్ని సముదాయించి బయటకు పంపించారు. అయితే భూమా అఖిలప్రియ అసలు తాను ఎవరికీ బాకీ లేనని తెగేసి చెబుతుండటంతో అప్పు ఇచ్చిన మరికొందరు బంధువులతో పాటు మొత్తం బాధితులంతా మరోసారి భూమా అఖిలప్రియ ఇంటి మీదికి వెళ్లారు.

ఆ సమయంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. విషయం తెలుసుకున్న ఆళ్లగడ్డ ఎస్ఐ వెంకట్ రెడ్డి పోలీసులతో పాటు అక్కడికి చేరుకొని బంధువులకు సర్ది చెప్పారు. అయినప్పటికీ అప్పులు ఇచ్చిన బంధువులంతా భూమా అఖిలప్రియ ఇంటి ముందు చాలాసేపు బైఠాయించారు. గురువారం రాత్రి ఇదంతా జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

First Published:  14 Jan 2023 4:02 AM GMT
Next Story