Telugu Global
Andhra Pradesh

ఏపీ స్కూళ్లలో ఇకపై రంగు రంగుల కోడి గుడ్లు.. ఎందుకో తెలుసా..?

నెలలో తొలివారం రాష్ట్రవ్యాప్తంగా నీలం రంగు కోడిగుడ్లు పంపిణీ చేస్తారు. ఒకవేళ వాటిని మిగిల్చి రెండోవారం పంపిణీ చేయాలన్నా కుదరదు. మళ్లీ వాటిని వచ్చే నెలలో మొదటి వారం వాడాల్సిందే.

ఏపీ స్కూళ్లలో ఇకపై రంగు రంగుల కోడి గుడ్లు.. ఎందుకో తెలుసా..?
X

కోడి గుడ్లు ఎక్కడైనా తెల్లగానే ఉంటాయి, నాటుకోడి గుడ్లు మాత్రం కాస్త గోధుమరంగులో ఉంటాయి. కానీ ఏపీలోని స్కూళ్లలో ఇకపై కోడిగుడ్లు వారానికో రంగు మార్చుకుంటాయి. మొదటి వారం నీలం, రెండో వారం గులాబీ, మూడోవారం ఆకుపచ్చ, నాలుగో వారం వంగపువ్వు రంగులతో గుడ్లకు రంగులద్దబోతున్నారు. ఆయా వారాల్లో ఆయా రంగుల్లో ఉన్న గుడ్లు ఇస్తేనే అవి తాజావి అన్నట్టు లెక్క. రంగు మారితే మాత్రం పాత గుడ్లు వడ్డిస్తున్నట్టే అనుకోవాలి.

ఎందుకీ రంగులు.. ?

స్కూళ్లలో పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనంలో పాడైపోయిన గుడ్లు పెడుతున్నారనే ఆరోపణలున్నాయి. నిల్వ ఉన్న గుడ్లను పెడుతున్నారని, పిల్లలు తినలేకపోతున్నారని కొన్నిచోట్ల తల్లిదండ్రులు ఫిర్యాదులు చేస్తున్నారు. దీన్ని నివారించేందుకే ఈ రంగుల ప్రయత్నం. నెలలో తొలివారం రాష్ట్రవ్యాప్తంగా నీలం రంగు కోడిగుడ్లు పంపిణీ చేస్తారు. ఒకవేళ వాటిని మిగిల్చి రెండోవారం పంపిణీ చేయాలన్నా కుదరదు. మళ్లీ వాటిని వచ్చే నెలలో మొదటి వారం వాడాల్సిందే. కాంట్రాక్టర్లు ఎవరైనా కక్కుర్తిపడి వాటిని మిగిల్చినా నెలరోజులకి అవి కచ్చితంగా పాడైపోతాయి. అంటే నిల్వ ఉంచడం కంటే తాజా గుడ్లని ఇవ్వడానికే అవకాశాలు ఎక్కువ. అందుకే ఏపీ ప్రభుత్వం ఈ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది.

అక్రమాలు ఆగిపోతాయా..?

సహజంగా స్కూళ్లలో మధ్యాహ్న భోజనాలకు ప్రభుత్వం కేటాయించే డబ్బులతో నాణ్యమైన ఆహారం అసాధ్యం. అందుకే కోడిగుడ్లు, ఇతరత్రా సరుకుల్లో కాంట్రాక్టర్లు సొమ్ము మిగుల్చుకుంటారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలతో కాంట్రాక్టర్లకు నష్టం జరుగుతుంది. తమకు నష్టం జరిగే పనిని కాంట్రాక్టర్లు స్వాగతిస్తారని అనుకోలేం. అయితే వాటికి ప్రత్యామ్నాయం వెదకడం కూడా కష్టమైన పనే కావడంతో పిల్లలకు తాజా కోడిగుడ్లు అందుతాయని భావిస్తున్నారు అధికారులు. ఈ మార్పు ఫలితం ఎలా ఉంటుందో ముందు ముందు తెలుస్తుంది. అయితే పిల్లలకు ఇచ్చే కోడిగుడ్లపై వైసీపీ నీలం రంగుకి చోటు దక్కింది కానీ, టీడీపీ పసుపు రంగు మాత్రం జాబితాలో లేకపోవడం విశేషం.

First Published:  25 Oct 2022 7:49 AM GMT
Next Story