Telugu Global
Andhra Pradesh

వివేకా హత్య కేసు.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

తనపై యుద్ధానికి అందరూ కలిసి కట్టుగా వస్తున్నారని, వారంతా సరిపోదన్నట్లుగా ఇప్పుడు తన ఇద్దరు చెల్లెళ్లను కూడా తెచ్చుకున్నారని విమర్శించారు సీఎం జగన్.

వివేకా హత్య కేసు.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
X

వైఎస్ వివేకా హత్యకేసు విషయంలో సీఎం జగన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు శవరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. "వివేకా చిన్నాన్నను అతిదారుణంగా, అత్యంత హీనంగా చంపిన హంతకుడు బహిరంగంగా తిరుగుతున్నాడు, ఆ హంతకుడికి ఎవరు మద్దతిస్తున్నారో అంతా చూస్తున్నారు" అని చెప్పారు. చంపినోడికి, జైలులో ఉండాల్సినోడికి చంద్రబాబు మద్దతు ఇస్తున్నారని, ఎల్లో మీడియా ఆ హంతకుడిని నెత్తిన పెట్టుకుందని మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం తపించి పోతున్న ఒకరిద్దరు తన వాళ్లు కూడా వారికి జతకలిశారని అన్నారు. "మేమంతా సిద్ధం" బస్సు యాత్రలో భాగంగా ప్రొద్దుటూరు సభలో ప్రసంగించారు జగన్. తనపై వస్తున్న విమర్శలన్నిటికీ సమాధానం చెప్పారు. ప్రతిపక్షాల ఎత్తుగడలను వివరించారు, వారి మాయలో పడొద్దని ప్రజలకు సూచించారు.



తనపై యుద్ధానికి అందరూ కలిసి కట్టుగా వస్తున్నారని, వారంతా సరిపోదన్నట్లుగా ఇప్పుడు తన ఇద్దరు చెల్లెళ్లను కూడా తెచ్చుకున్నారని విమర్శించారు సీఎం జగన్. తన చిన్నాన్నను అన్యాయంగా చంపేసి, రాజకీయంగా తనపై నెట్టేసే యత్నం చేస్తున్నారని చెప్పారు. ఇది కలియుగం అని, అందుకే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రజల మద్దతు లేని చంద్రబాబు చేస్తున్న నీఛ రాజకీయం ఒకవైపు, ప్రజల పక్షం ఉన్న తాను మరోవైపు ఉన్నామని చెప్పారు. ఆ దేవుడు, ఆ ప్రజల్నే తాను నమ్ముకున్నానని, ధర్మం, న్యాయాన్ని నమ్ముకున్నానని అన్నారు జగన్.

"గట్టిగా గర్జించండి.. మేమంతా సిద్ధమేనని.. లక్ష సింహాల గర్జన చరిత్రలో నిలిచిపోతుందం"టూ తన ప్రసంగంతో కార్యకర్తలను హుషారెత్తించారు సీఎం జగన్. పేదల అభివృద్ధికి అడ్డుపడుతున్న, దుష్ట చతుష్టయాన్ని చిత్తుగా ఓడించేందుకు, పాంచజన్యం పూరించేందుకు శ్రీకృష్ణుడిలా మీరంతా సిద్ధమేనా? అని ప్రశ్నించారు. మీ అర్జునుడు సిద్ధంగానే ఉన్నాడని చెప్పారు. మే 13న ఫ్యాన్‌ గుర్తు మీద రెండు ఓట్లు వేసి, మరో వంద మందికి చెప్పి ఓట్లు వేయించి, మనందరి పార్టీని గెలిపించేందుకు అందరూ సిద్ధంగా ఉండాలన్నారు. గతంలో వైఎస్సార్ జిల్లాలో ఈ స్థాయిలో ఎప్పుడూ సభ జరగలేదని, తన ముందు ఓ మహా సముద్రం కనిపిస్తోందన్నారు జగన్. అభివృద్ధి నిరోధకులను పేదల వ్యతిరేకులను ఓడించేందుకు మీరంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

First Published:  27 March 2024 2:15 PM GMT
Next Story