Telugu Global
Andhra Pradesh

ఫైబర్ నెట్ విచారణలో జోరు పెరిగిందా?

ఈ కేసులో సంబంధాలున్నాయని సీఐడీ గుర్తించిన వాళ్ళ ఆస్తులను జప్తు చేయటానికి అనుమతి కోరుతు కోర్టులో పిటీషన్ వేయబోతోంది.

ఫైబర్ నెట్ విచారణలో జోరు పెరిగిందా?
X

ఫైబర్ నెట్ కేసు విచారణలో సీఐడీ జోరుపెంచింది. స్కిల్ స్కామ్‌లో అరెస్టయి రిమాండులో ఉన్న చంద్రబాబునాయుడు మధ్యంతర బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. చంద్రబాబు ఇలా రిలీజ్ అయ్యారో లేదో వెంటనే ఫైబర్ నెట్ కేసు విచారణ అలా స్పీడందుకుంది. ఈ కేసులో సంబంధాలున్నాయని సీఐడీ గుర్తించిన వాళ్ళ ఆస్తులను జప్తు చేయటానికి అనుమతి కోరుతు కోర్టులో పిటీషన్ వేయబోతోంది.

నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ ప్రభుత్వం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు టెండర్లు కట్టబెట్టారని సీఐడీ ఆరోపించింది. హరికృష్ణకు చెందిన కంపెనీ టెర్రాసాఫ్ట్ కి కోట్లాది రూపాయల పనులను చంద్రబాబు అప్పగించారన్నది సీఐడీ ఆరోపణ. అందుకనే టెర్రాసాఫ్ట్ కంపెనీ ఎండీ తుమ్మల గోపీచంద్ పేరుతో హైదరాబాద్‌లో ఉన్న ఆస్తులను, గోపీచంద్ భార్య పేరుతో ఉన్న ఫాం హౌస్‌ను, నిందితుడైన కోటేశ్వరరావుకు గుంటూరులో ఉన్న ఆస్తిని జప్తు చేయాలని పిటీషన్ వేయబోతోంది.

ఇక్కడ విషయం ఏమిటంటే బ్లాక్ లిస్టులో ఉన్న టెర్రాసాఫ్ట్ కంపెనీకి రూ.330 కోట్ల ఫైబ‌ర్ నెట్ మొదటిదశ పనులను అడ్డుగోలుగా అప్పగించటమే చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పు. టెండర్లను ఫైనల్ చేసిన కమిటీలో వేమూరి హరికృష్ణను సభ్యుడిగా నియమించటం రెండో తప్పు. ఎందుకంటే ఒకవైపు టెండర్ వేయటానికి కూడా అర్హతలేని కంపెనీని టెండర్ వేయటానికి అనుమతించింది ప్రభుత్వం. టెండర్ వేసిన బ్లాక్ లిస్టు కంపెనీ యజమాని వేమూరిని టెండర్లు ఫైనలైజ్ చేసే కమిటీలో సభ్యుడిగా చంద్రబాబు ఎలా నియమించారు?

చంద్రబాబు పాలన ఎలా జరిగిందంటే తాను ఏమి చెబితే అదే చట్టం, తాను ఏమిచేస్తే అదే న్యాయం అన్నట్లుగా సాగింది. నిబంధనలను యధేచ్చగా ఉల్లంఘించి తనవాళ్ళకు టెండర్లను దోచిపెట్టడానికి నిబంధనలను సైతం లెక్క చేయలేదు. తాను అనుకున్నవాళ్ళకి అనుకున్నట్లుగా పనులను చంద్రబాబు అప్పగించేశారు. అధికారంలో ఉన్నపుడు సవ్యంగానే సాగిపోయిన వ్యవహారాలు ఇప్పుడు మెడకు చుట్టుకుంటున్నాయి. దాంతో కేసులు నమోదయ్యే సరికి ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.


First Published:  2 Nov 2023 5:36 AM GMT
Next Story