Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు నెత్తిన చార్జిషీట్ పిడుగు

రింగ్ రోడ్డు నిర్మాణం జరగకపోయినా జరుగుతున్నట్లు మాస్టర్ ప్లాన్ ప్రకటనతో చంద్రబాబు ప్రభుత్వం జనాలను నమ్మించిందని సీఐడీ ఆరోపించింది.

చంద్రబాబు నెత్తిన చార్జిషీట్ పిడుగు
X

ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) కుంభకోణంలో సీఐడీ దూకుడు పెంచింది. కుంభకోణానికి బాధ్యులంటూ చంద్రబాబునాయుడు అండ్ కో పైన సీఐడీ ఏసీబీ కోర్టులో చార్జిషీటు దాఖలు చేయటం సంచలనంగా మారింది. సరిగ్గా ఎన్నికలకు ముందు అందులోనూ చంద్రబాబు ఎన్డీయేలో చేరబోతున్న సమయంలో సీఐడీ చార్జిషీటు దాఖలు చేయటం కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే స్కిల్ స్కామ్ లో అరెస్టయిన చంద్రబాబు 53 రోజులు రిమాండులో ఉన్న విషయం తెలిసిందే. అనేక కేసులు వివిధ కోర్టుల్లో నడుస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే సడన్ గా ఉరుములేని పిడుగులా ఐఆర్ఆర్ కుంభకోణంలో చంద్రబాబును ఏ1గా, మాజీమంత్రి పొంగూరు నారాయణను ఏ2గా, ఏ3గా లింగమనేని రమేష్, ఏ14గా లోకేష్ ను సీఐడీ ప్రస్తావించింది. చార్జిషీట్ దాఖలు చేయటంతో మళ్ళీ చంద్రబాబు అరెస్టు తప్పదా అనే చర్చలు పెరిగిపోతున్నాయి. లింగమనేని రమేష్ భూములకు లబ్దిచేకూర్చేందుకే రాజధాని పరిధిలోని భూముల అలైన్మెంట్ ను చంద్రబాబు ప్రభుత్వం మూడుసార్లు మార్చిందని సీఐడీ ఆరోపిస్తోంది.

రింగ్ రోడ్డు నిర్మాణం జరగకపోయినా జరుగుతున్నట్లు మాస్టర్ ప్లాన్ ప్రకటనతో చంద్రబాబు ప్రభుత్వం జనాలను నమ్మించిందని సీఐడీ ఆరోపించింది. దాంతో కొందరి భూములకు రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. తమకు కావాల్సిన వాళ్ళ భూముల ధరలు పెరిగిపోవటం కోసమే మూడుసార్లు అలైన్మెంట్లను మార్చిందన్నది సీఐడీ అభియోగం. దీని ఫలితంగా అమ్ముకోదలచుకున్న వాళ్ళు భూములకు అత్యధిక ధరలకు అమ్ముకున్నారు. అలాగే కొనదలచుకున్న వాళ్ళు అతితక్కువ ధరలకు భూములను కొన్నారు. తక్కువ ధరలకు భూములను తమవాళ్ళు కొనేయగానే మళ్ళీ అలైన్మెంట్లను మార్చటంతో అవే భూముల ధరలకు రెక్కలు వచ్చేట్లు చంద్రబాబు ప్రభుత్వం కుట్రచేసిందట.

ఈ విధంగా లింగమనేని భూములకు దగ్గరలో ఔటర్ రింగ్ రోడ్డు మాస్టర్ ప్లాన్ ఆగిపోయింది. దాంతో లింగమనేని వందలాది ఎకరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. క్విడ్ ప్రో కో పద్దతిలో లింగమనేని భూముల ధరలు పెంచేందుకు సహకరించినందుకు హెరిటేజ్ కు 14 ఎకరాలను లింగమనేని ఇచ్చారట. అలాగే కరకట్ట మీద నిర్మించిన అక్రమ భవనాన్ని కూడా చంద్రబాబుకు కానుకగా ఇచ్చారన్నది సీఐడీ ఆరోపణ. అలైన్మెంట్ మార్చటంలో కీలకపాత్ర పోషించిన, లబ్దిపొందిన పొంగూరు నారాయణ, లింగమనేని, లోకేష్ తదితరులపై చార్జిషీట్ దాఖలు చేసింది. మరి ఏసీబీ కోర్టు ఏమంటుందో చూడాలి.

First Published:  9 Feb 2024 7:42 AM GMT
Next Story