Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు నోటికి అదుపు లేదా.. జగన్‌ చేసిన అప్పులపై అంత అబద్ధమా..?

జగన్‌ ప్రభుత్వం చేసిన అప్పుల విషయంలో చంద్రబాబు చెప్పిన మాటల్లో ఇసుమంత నిజం కూడా లేదని పార్లమెంటు సాక్షిగా తేలిపోయింది. ఆంధ్రప్రదేశ్‌ చేసిన అప్పులపై పార్లమెంటులో కేంద్ర మంత్రి పంకజ్‌ చౌదరి సోమవారం నాడు స్పష్టత ఇచ్చారు.

చంద్రబాబు నోటికి అదుపు లేదా.. జగన్‌ చేసిన అప్పులపై అంత అబద్ధమా..?
X

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చేసిన అప్పులపై టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. జగన్‌ ప్రభుత్వం రూ. 12 లక్షల కోట్ల అప్పులు చేసిందని బాబు ఆరోపిస్తున్నారు. విచక్షణారహితమైన అప్పుల వల్ల రాష్ట్రం పూర్తిగా సంక్షోభంలో పడిపోయిందని మాజీ సీఎం తెగ బాధపడిపోయారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఏదో విధంగా విజయం సాధించాలనే తాపత్రయంతో జగన్‌ ప్రభుత్వంపై కావాల్సినంత బురద చల్లుతున్నారు. ఆయన మాటలకు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ వంత పాడుతున్నారు. ఎల్లో మీడియా దాన్నే ప్రచారం చేస్తోంది.

జగన్‌ ప్రభుత్వం చేసిన అప్పుల విషయంలో చంద్రబాబు చెప్పిన మాటల్లో ఇసుమంత నిజం కూడా లేదని పార్లమెంటు సాక్షిగా తేలిపోయింది. ఆంధ్రప్రదేశ్‌ చేసిన అప్పులపై పార్లమెంటులో కేంద్ర మంత్రి పంకజ్‌ చౌదరి సోమవారం నాడు స్పష్టత ఇచ్చారు. 15వ ఆర్థిక సంఘం సూచనలకు, నిబంధనలకు లోబడి మాత్రమే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అప్పులు చేసిందని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ అప్పులు 4,85,490.8 కోట్లు ఉన్నాయని కేంద్ర మంత్రి స్పష్టంచేశారు. అప్పుల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ఏడో స్థానంలో ఉందని కూడా చెప్పారు. జగన్‌ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అప్పులు 4.85 లక్షల కోట్లు. అయితే, ఇందులో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులు కూడా ఉన్నాయి.

కోవిడ్‌ మహమ్మారి రాజ్యమేలిన 2020, 2021 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్‌ జీడీపీ, జీఎస్‌డీపీల్లో సానుకూల వృద్ధి రేటును సాధించిందని మంత్రి చెప్పారు. జీడీపీ, జీఎస్‌డీపీ వృద్ధి రేటు 26 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో క్షీణించినా ఆంధ్రప్రదేశ్‌ 2.1 శాతం వృద్ధి రేటును సాధించిందని చెప్పారు. కోవిడ్‌ కాలంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల కింద నగదు ప్రయోజనం కల్పించి డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ)ని సమర్థంగా వాడుకుంది. ఆర్థిక లావాదేవీలు కుంటుపడకుండా జగన్‌ ప్రభుత్వం ప్రజల కొనుగోలు శక్తిని పెంచింది.

వచ్చే ఎన్నికల్లో ప్రయోజనం పొందడానికి చంద్రబాబు నాయుడు జగన్‌ ప్రభుత్వంపై బురద చల్లుతున్నారు. అయితే, నిజం బయట పడక తప్పదు. రాష్ట్రం చేసిన అప్పుల విషయంలో చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని కేంద్ర మంత్రి ప్రకటనతో తేలిపోయింది.

First Published:  6 Feb 2024 2:27 PM GMT
Next Story