Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు చివరి అస్త్రం షర్మిల - సజ్జల

ప్రత్యేక హోదాకు ఇవాల్టికి కూడా వైసీపీ కట్టుబడి ఉందన్న సజ్జల.. ఆనాడూ కాంగ్రెస్‌ ప్రత్యేక హోదాను చట్టంలో పెట్టి ఉంటే ఇవాళ పోరాటాలు చేయాల్సిన పరిస్థితి ఉండేది కాదన్నారు.

చంద్రబాబు చివరి అస్త్రం షర్మిల - సజ్జల
X

ఏపీసీసీ అధ్యక్ష బాధ్యతల స్వీకరణ సందర్భంగా షర్మిల చేసిన వ్యాఖ్యలపై స్పందించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి. ఈ సందర్భంగా షర్మిలపై సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు చివరి అస్త్రం షర్మిలేనన్నారు. వైఎస్ అభిమానుల ఓట్లు చీలితే తనకు కొంతైనా కలిసొస్తుందని చంద్రబాబు భావిస్తున్నారన్నారు. చంద్రబాబును ఎలా సీఎం చేయాలన్నదే షర్మిల లక్ష్యంగా కనిపిస్తోందన్నారు. అందుకే ఆయన వర్గం మీడియా షర్మిలను భుజాలకెత్తుకుందన్నారు.

చంద్రబాబు, కాంగ్రెస్‌ కలిసే జగన్‌పై కేసులు బనాయించారన్న సజ్జల.. చనిపోయిన వైఎస్సార్ పేరును సైతం ఛార్జ్‌షీట్‌లో చేర్చారని గుర్తుచేశారు. జగన్‌పై పెట్టినవి అక్రమ కేసులేనని గులాం నబీ ఆజాదే గతంలో చెప్పారని.. కాంగ్రెస్‌ గురించి షర్మిలకు ఏం తెలుసన్నారు సజ్జల. వైఎస్‌ మరణాంతరం ఆయన కుటుంబ సభ్యులను కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టిందన్నారు. ఏపీని అడ్డగోలుగా విభజించింది కాంగ్రెస్‌ పార్టీ కాదా అని షర్మిలను ప్రశ్నించారు. అడ్డగోలుగా విభజన చేసినందుకు కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించుకుందన్నారు. గతంలో ఏపీలో నోటా కంటే కాంగ్రెస్ పార్టీకి తక్కువ ఓట్లు వచ్చాయన్నారు. తెలంగాణ నుంచి ఏపీకి హఠాత్తుగా షర్మిల ఎందుకు షిఫ్ట్ అయ్యారో చెప్పాలన్నారు. షర్మిలను తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు గుర్తించలేదన్నారు.

ప్రత్యేక హోదాకు ఇవాల్టికి కూడా వైసీపీ కట్టుబడి ఉందన్న సజ్జల.. ఆనాడూ కాంగ్రెస్‌ ప్రత్యేక హోదాను చట్టంలో పెట్టి ఉంటే ఇవాళ పోరాటాలు చేయాల్సిన పరిస్థితి ఉండేది కాదన్నారు. అవకాశం వచ్చినప్పుడు ప్రత్యేక హోదా సాధించాలనే పట్టుదలతో ఉన్నామని చెప్పారు. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా.. ఏపీకి మేలు చేయాలనే భావనతోనే సీఎం జగన్ నడుచుకుంటున్నారని చెప్పారు.

First Published:  21 Jan 2024 12:57 PM GMT
Next Story