Telugu Global
Andhra Pradesh

చంద్రబాబుకు ఎస్సీ, బీసీలే దొరుకుతారా?

ఎమ్మెల్యే కోటాలో భర్తీ అవబోయే ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీసీని ఏకగ్రీవంగా ఎందుకు గెలవనివ్వాలనే ఓర్వలేనితనమే చంద్రబాబులో ఎక్కువగా కనబడుతోంది. ఎలాగూ విప్ జారీ చేసే అవకాశమే లేని ఈ ఎన్నికలో పోటీ పెట్టిమాత్రం చంద్రబాబు సాధించేది ఏముంటుంది? నామినేషన్ వేసిన పంచుమర్తి పరువును తీయటం తప్ప.

చంద్రబాబుకు ఎస్సీ, బీసీలే దొరుకుతారా?
X

చంద్రబాబు నాయుడు వైఖరి చాలా విచిత్రంగా ఉంటుంది. నామినేషన్ వేస్తే చాలు గెలిచిపోయినట్లే అన్నపుడేమో తన సామాజికవర్గంలోని ప్రముఖులు, ఇతర సామాజికవర్గంలోని బలమైన నేతలు మాత్రమే గుర్తుకొస్తారు. అదే గెలుపు అవకాశం ఏమాత్రం లేదని అనుకున్నపుడేమో ఎస్సీ, బీస్సీల్లో మామూలు నేతలే దొరుకుతారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ఎమ్మెల్యే కోటాలో భర్తీ చేయాల్సిన ఎమ్మెల్సీ స్థానానికి పంచుమర్తి అనూరాధ నామినేషన్ వేశారు. ఈమెతో ఎందుకు నామినేషన్ వేయించారో చంద్రబాబుకే తెలియాలి.

ఒక‌ప్పుడు రాజ్యసభకు ఇలాగే ఎస్సీ నేత వర్ల రామయ్యతో నామినేషన్ వేయించారు. ఏ రకంగా చూసినా గెలుపు అవకాశంలేదని తెలిసీ వర్లతో చంద్రబాబు నామినేషన్ వేయించారు. అంతకుముందు నామినేషన్ వేస్తే ఎంపీ అయిపోయినట్లే అనుకున్నపుడు ముందు వర్లను ఎంపిక చేసి చివరి నిమిషంలో డ్రాప్ చేశారు. వర్ల స్థానంలో కనకమేడల రవీంద్రను ఎంపీగా పంపించారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ అభ్యర్థుల‌ ఎంపిక సమయంలో కూడా చంద్రబాబుకు వర్ల గుర్తుకురాలేదు.

అలాంటిది ఇప్పుడు గెలుపు అవకాశాలు ఏమాత్రం లేవని తెలిసీ పంచుమర్తితో నామినేషన్ వేయించటమే విచిత్రంగా ఉంది. పైగా ప్రతిరోజు బీసీలను గుర్తించిందే టీడీపీ అని, టీడీపీకి బీసీలే వెన్నెముక అంటు చాలా మాటలు చెబుతారు. అవకాశాల దగ్గరకు వచ్చేటప్పటికి సుజనా చౌద‌రి, గరికపాటి మోహన్ రావు లేకపోతే అన్నీ విధాల గట్టినేతలైన టీజీ వెంకటేష్, సీఎం రమేష్, యనమల రామకృష్ణుడు, బీద రవిచంద్రయాదవ్ లాంటి వాళ్ళు మాత్రమే గుర్తుకొస్తారు.

చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు రాజ్యసభకు ఒక ఎస్సీ లేదా బీసీ నేతేనే ఎంపిక చేయలేదు. అదే జగన్మోహన్ రెడ్డిని చూస్తే రాజ్యసభకు, శాసన మండలికి బీసీలు, ఎస్సీలు, మహిళలు అందరినీ ఎంపిక చేశారు. ఎమ్మెల్యే కోటాలో భర్తీ అవబోయే ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీసీని ఏకగ్రీవంగా ఎందుకు గెలవనివ్వాలనే ఓర్వలేనితనమే చంద్రబాబులో ఎక్కువగా కనబడుతోంది. ఎలాగూ విప్ జారీ చేసే అవకాశమే లేని ఈ ఎన్నికలో పోటీ పెట్టిమాత్రం చంద్రబాబు సాధించేది ఏముంటుంది? నామినేషన్ వేసిన పంచుమర్తి పరువును తీయటం తప్ప.

First Published:  14 March 2023 5:58 AM GMT
Next Story