Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు కవరింగ్ గేమ్ లో పావులుగా మారిన షర్మిల, సునీత..

చంద్రబాబు వల్లే ఇంటికొచ్చే పెన్షన్లు ఆగిపోయాయనే విషయం బాగా జనాల్లోకి వెళ్లింది. దీంతో మళ్లీ డైవర్షన్ గేమ్ మొదలైంది. షర్మిల, సునీత తెరపైకి వచ్చారు.

చంద్రబాబు కవరింగ్ గేమ్ లో పావులుగా మారిన షర్మిల, సునీత..
X

చంద్రబాబుకి జనసేన, బీజేపీతోపాటు.. కాంగ్రెస్ కూడా లోపాయికారీగా సహాయం చేస్తుందని పలుమార్లు సీఎం జగన్ నేరుగా విమర్శించారు. తన చెల్లెల్లు షర్మిల, సునీతను అడ్డు పెట్టుకుని బాబు నీఛ రాజకీయాలు చేస్తున్నారని కూడా మండిపడ్డారు. ఇవన్నీ కేవలం విమర్శలు కావు.. ఏపీ తాజా రాజకీయాలను పరిశీలిస్తే చంద్రబాబు మైండ్ గేమ్ అర్థమవుతుంది. షర్మిల, సునీత ఆయనకు ఎలా సహాయం చేస్తున్నారో స్పష్టమవుతుంది.

బాబు డ్యామేజ్ కంట్రోల్ కోసం..

చంద్రబాబు డ్యామేజ్ కంట్రోల్ కోసం షర్మిల, సునీత తాపత్రయ పడటం ఇక్కడ విశేషం. ఆమధ్య శింగనమల వైసీపీ అభ్యర్థి టిప్పర్ డ్రైవర్ అంటూ హేళనగా మాట్లాడి చంద్రబాబు సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెంటనే షర్మిల, సునీత తెరపైకి వచ్చారు. సరిగ్గా అదే సమయంలో వివేకా హత్య కేసు గురించి ప్రొద్దుటూరు సభలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యల్ని వారు టార్గెట్ చేశారు. చంద్రబాబుకి ఎక్కువ డ్యామేజీ కాకుండా, ఆయన మాటలు వైరల్ కాకుండా డైవర్షన్ గేమ్ మొదలు పెట్టారు. జగన్ పై షర్మిల, సునీత చేసిన విమర్శలను ఎల్లో మీడియా బాగా హైలైట్ చేసింది, ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ హడావిడి మొదలు పెట్టింది.

తాజాగా ఏపీలో పెన్షన్ల గొడవ మొదలైంది. ఇంటింటి పెన్షన్ల పంపిణీని అడ్డుకుంటూ చంద్రబాబు వేసిన ఎత్తుగడ పూర్తిగా ఫెయిలైంది. అది రివర్స్ లో తగలడంతో బాబు లబోదిబోమంటున్నారు. మీడియా అయినా, సోషల్ మీడియా అయినా అన్నిచోట్లా ఇదే చర్చ. చంద్రబాబు వల్లే పెన్షన్లు ఆగిపోయాయనే విషయం బాగా జనాల్లోకి వెళ్లింది. దీంతో మళ్లీ డైవర్షన్ గేమ్ మొదలైంది. షర్మిల, సునీత తెరపైకి వచ్చారు.

చిన్నాన్న చివరి కోరిక నెరవేర్చేందుకే తాను కడప ఎంపీగా బరిలో నిలుస్తున్నట్టు తెలిపారు వైఎస్ షర్మిల. అభ్యర్థుల జాబితా విడుదల సందర్భంగా సొంత పార్టీ గురించి గొప్పలు చెప్పుకోవాల్సిన షర్మిల, ఇలా పూర్తిగా జగన్ ని టార్గెట్ చేయడం చాలామందికి విచిత్రంగా తోచింది. కానీ చంద్రబాబు వ్యాఖ్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే షర్మిల, జగన్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారనేది వాస్తవం. రాజన్న రాజ్యం తెస్తానని రాక్షస రాజ్యం తెచ్చారంటూ జగన్ పై మండిపడ్డారు షర్మిల.

వివేకా కుమార్తె సునీత కూడా ఈ పొలిటికల్ గేమ్ లో పావుగా మారారు. వివేకం అనే సినిమాకి ప్రచారం కల్పిస్తూ ఆమె మాట్లాడటం విశేషం. అలాంటి చీప్ సినిమా గురించి ఆమె మాట్లాడటమే అవివేకం అనుకుంటే.. ఆ సినిమాలో ఉన్నదున్నట్టు చూపించారంటూ ప్రచారం చేయడం మరింత విడ్డూరం. ఆ సినిమా గురించి మాట్లాడటం సునీత లక్ష్యం కాదు. కానీ చంద్రబాబుకి జరుగుతున్న డ్యామేజీని తగ్గించేందుకే ఆమె జగన్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడారనేది వాస్తవం. ఇలాంటి పొలిటికల్ గేమ్ లు ఆడటంలో చంద్రబాబు దిట్ట. కానీ ఈసారి అక్కడుంది జగన్. ఆయనకున్న ప్రజా మద్దతు చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. ఆ కంగారులో బాబు వ్యూహాలన్నీ వరుసగా విఫలమవుతున్నాయి.

First Published:  3 April 2024 4:21 AM GMT
Next Story