Telugu Global
Andhra Pradesh

నేరాలు, ఘోరాలు.. చంద్రబాబు వీటికే ఫిక్స్ అయ్యారా..?

సాక్షాత్తూ అధికార పార్టీ ఎంపీ కుటుంబ సభ్యులు కిడ్నాప్ కావడంతో ప్రభుత్వం కవర్ చేసుకోడానికి తంటాలు పడుతోంది. విశాఖపై నిందలేయడానికి రెడీగా ఉన్న ప్రతిపక్షాలు ఈ ఉదాహరణతో మరింతగా రెచ్చిపోతున్నాయి.

నేరాలు, ఘోరాలు.. చంద్రబాబు వీటికే ఫిక్స్ అయ్యారా..?
X

ఏపీలో అధికార వైసీపీని టార్గెట్ చేయడానికి ప్రతిపక్షం దగ్గర పెద్దగా ఆయుధాలు లేవు. సంక్షేమం పేరెత్తడానికి కూడా చంద్రబాబు భయపడుతున్నారు. పోనీ అభివృద్ధి అంటారా..? చంద్రబాబు పోలవరం పూర్తి చేయలేకపోయారు, అమరావతిలో పర్మినెంట్ బిల్డింగ్ లు కట్టలేకపోయారు, పోర్ట్ లు, ప్రాజెక్ట్ లకు శంకుస్థాపనలు చేశారే కానీ పనులు మొదలు కాలేదు.. అన్నీ అరకొరగానే వదిలేశారు. సంగం, నెల్లూరు బ్యారేజ్ వంటి వాటిల్ని జగన్ పూర్తి చేసి ఆ క్రెడిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఇక అమరావతి రాజధాని అంశం కూడా కలసి రాదని స్థానిక సంస్థల ఎన్నికల్లో రుజువైంది. మేనిఫెస్టో హామీలతో చంద్రబాబు ఎప్పటికీ ప్రజల్లో నమ్మకాన్ని చూరగొనలేరు. అందుకే ఇప్పుడు శాంతి భద్రతలు అంటూ కొత్తపల్లవి అందుకున్నారు చంద్రబాబు. అటు పవన్ కల్యాణ్ కూడా ఇదే అంశంపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు.

తాజాగా చంద్రబాబు ఏపీ ప్రజలకు ఓ బహిరంగ లేఖ రాశారు. నేరాంధ్రప్రదేశ్ అంటూ నిందలేశారు, వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. బాపట్ల జిల్లాలో అమర్నాథ్ అనే పిల్లవాడిపై పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటనను చంద్రబాబు ప్రస్తావించారు. ఆడపిల్లలను వేధించడమే కాకుండా, తప్పు అని చెప్పినందుకు గంజాయి మత్తులో కొంతమంది అమర్నాథ్ ని హత్య చేశారని ఆరోపించారు చంద్రబాబు. అనంతపురం కమలానగర్ లో ప్రింటింగ్ ప్రెస్ యజమానికి చెందిన భూమిని వైసీపీ నేతలు లాగేసుకున్నారని, దీంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు చంద్రబాబు. అమలాపురంలో మున్సిపల్ చైర్మన్ పై వైసీపీ కౌన్సిలర్ భర్త దాడికి దిగడం దారుణం అన్నారు. సాక్షాత్తూ రాష్ట్ర మంత్రి ముందే ఈ ఘటన జరిగిందని గుర్తు చేశారు. ఇక విశాఖలో వైసీపీ ఎంపీ కుటుంబం కిడ్నాప్ కావడాన్ని కూడా చంద్రబాబు తన లేఖలో ప్రస్తావించారు. ఈ కిడ్నాప్ తర్వాత ఎంపీ సత్యనారాయణ విశాఖ వదిలి హైదరాబాద్ పారిపోయారన్నారు. వైసీపీ పాలనలో ఏపీ నేరాంధ్రప్రదేశ్ గా మారిందన్నారు చంద్రబాబు.


ప్రతిపక్షాల విమర్శల సంగతి పక్కనపెడితే, వైసీపీకి శాంతి భద్రతల విషయం మాత్రం కలసి రావడంలేదనే చెప్పాలి. సాక్షాత్తూ అధికార పార్టీ ఎంపీ కుటుంబ సభ్యులు కిడ్నాప్ కావడంతో ప్రభుత్వం కవర్ చేసుకోడానికి తంటాలు పడుతోంది. విశాఖపై నిందలేయడానికి రెడీగా ఉన్న ప్రతిపక్షాలు ఈ ఉదాహరణతో మరింతగా రెచ్చిపోతున్నాయి. వైఎస్ వివేకా హత్య దగ్గర్నుంచి, ఎమ్మెల్సీ కారు డ్రైవర్ హత్యోదంతం వరకు అన్నిట్లోనూ వైసీపీని వేలెత్తి చూపిస్తున్నాయి ప్రతిపక్షాలు. ఎక్కడ ఏ అఘాయిత్యం జరిగినా గన్ కంటే ముందు జగన్ ఎందుకు రాలేదని నిలదీస్తున్నారు. దిశ యాప్ ని ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారనే లెక్కలు చెబుతున్నారే కానీ, దిశ చట్టం విషయంలో ప్రభుత్వం నోరెత్తలేని పరిస్థితి. టీడీపీ హయాంలో నేరాలు జరగలేదని చెప్పలేం కానీ, వైసీపీ మాత్రం ఈ విషయంపై మరింత సీరియస్ గా దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందనే చెప్పాలి. అందుకే ఇదే అంశాన్ని హైలెట్ చేస్తూ పదే పదే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు చంద్రబాబు, పవన్ కల్యాణ్. గూండాలు, రౌడీలు, క్రిమినల్స్ రాజ్యమేలుతున్నారని కౌంటర్లిస్తున్నారు.

First Published:  19 Jun 2023 8:31 AM GMT
Next Story