Telugu Global
Andhra Pradesh

మ‌ళ్లీ యాక్టివ్ పాలిటిక్స్‌లోకి బైరెడ్డి.. టీడీపీకి ఒరిగేదేంటి..?

నంద్యాల ఎంపీ సీటుకు బైరెడ్డి రాజ‌శేఖ‌ర రెడ్డి అయితే బాగుంటుంద‌ని టీడీపీలో ఓ వ‌ర్గం భావిస్తోంది. అయితే బైరెడ్డి కుమార్తె శ‌బ‌రిని ఇక్క‌డ ఎంపీ అభ్య‌ర్థిగా నిల‌బెట్టాల‌న్న‌ది చంద్ర‌బాబు ఆలోచ‌న‌.

మ‌ళ్లీ యాక్టివ్ పాలిటిక్స్‌లోకి బైరెడ్డి.. టీడీపీకి ఒరిగేదేంటి..?
X

మాజీ మంత్రి, రాయ‌ల‌సీమ ప‌రిర‌క్ష‌ణ స‌మితి అధ్య‌క్షుడు బైరెడ్డి రాజ‌శేఖ‌ర‌రెడ్డి మ‌ళ్లీ క్రియాశీల‌క రాజ‌కీయాల్లోకి రావాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నారు. తాను రాజ‌కీయ జీవితం ప్రారంభించిన టీడీపీ నుంచే మ‌ళ్లీ రీఎంట్రీ ఇవ్వాల‌ని భావిస్తున్నారు. స్కిల్ కేసులో చంద్ర‌బాబు జైల్లో ఉన్న‌ప్పుడు రాజ‌మండ్రి వెళ్లి మ‌రీ భువ‌నేశ్వ‌రిని ప‌ల‌క‌రించి రావ‌డం టీడీపీలోకి రీఎంట్రీ ప్ర‌య‌త్నాల్లో భాగ‌మేన‌ని అప్ప‌ట్లోనే వార్త‌లొచ్చాయి.

ఏ పార్టీలోనూ ఇమ‌డ‌లేరు

టీడీపీలో రెండుసార్లు (1994, 1999) ఎమ్మెల్యేగా గెలిచి, త‌ర్వాత రెండుసార్లు ఓడిపోయిన బైరెడ్డి, ఆ త‌ర్వాత సైకిల్ దిగిపోయారు. 2012లో రాయ‌ల‌సీమ ప‌రిర‌క్ష‌ణ స‌మితి పెట్టి రాష్ట్ర విభ‌జ‌న‌ను తీవ్రంగా వ్య‌తిరేకించారు. తెలంగాణ ఇస్తే ప్ర‌త్యేక రాయ‌ల‌సీమ రాష్ట్రం కూడా ఇవ్వాల‌ని ప‌ట్టుబట్టారు. 2018లో కాంగ్రెస్‌లో ఆ త‌ర్వాత బీజేపీలో చేరినా ఎక్క‌డా నిల‌క‌డ‌గా ఏడాది కూడా ఉండ‌లేదు. చివ‌ర‌కు మళ్లీ త‌న సొంత పార్టీ టీడీపీలోకి వెళ్లాల‌నుకుంటున్నారు.

పాణ్య‌మా? నంద్యాల ఎంపీ సీటా?

నంద్యాల ఎంపీ సీటుకు బైరెడ్డి రాజ‌శేఖ‌ర రెడ్డి అయితే బాగుంటుంద‌ని టీడీపీలో ఓ వ‌ర్గం భావిస్తోంది. అయితే బైరెడ్డి కుమార్తె శ‌బ‌రిని ఇక్క‌డ ఎంపీ అభ్య‌ర్థిగా నిల‌బెట్టాల‌న్న‌ది చంద్ర‌బాబు ఆలోచ‌న‌. బైరెడ్డి శ‌బ‌రి ప్ర‌స్తుతం నంద్యాల జిల్లా బీజేపీ అధ్య‌క్షురాలిగా ఉన్నారు. ఆమెను టీడీపీ అభ్య‌ర్థిగా ఆలోచిస్తున్నారంటే ఆమె కూడా పార్టీ మారే అవ‌కాశం ఉన్న‌ట్లు. ఒక‌వేళ త‌న కూతురికి ఎంపీ టికెట్ ఇస్తే త‌న‌కు పాణ్యం ఎమ్మెల్యే టికెట్ కావాల‌ని బైరెడ్డి కోరుతున్న‌ట్లు స‌మాచారం.

నిజంగానే ప్ర‌భావం చూప‌గ‌ల‌రా?

బైరెడ్డి మంచి నాయ‌కుడే కానీ, అన్ని పార్టీలూ తిరిగేసి వ‌చ్చారు. ఏ పార్టీలోనూ నిల‌క‌డ లేక‌పోవ‌డం, ప్ర‌త్యేక రాయ‌ల‌సీమ నినాదంతో హ‌డావుడి చేసి ఇప్పుడు మ‌ళ్లీ టీడీపీలో చేర‌తాన‌న‌డం ఆయ‌న విశ్వ‌స‌నీయ‌త‌ను దెబ్బ‌తీశాయి. పైగా రాయ‌ల‌సీమ‌లో అత్యంత బ‌లంగా ఉన్న వైసీపీని ఎదుర్కొని ఆయ‌న గెల‌వ‌గ‌ల‌రా..? లేదా కూతుర్ని గెలిపించుకోగ‌ల‌రా..? అంటే స‌మాధానం లేదు. సొంత అన్న కుమారుడు సిద్ధార్ధ‌రెడ్డి శాప్ ఛైర్మ‌న్‌గా, నంద్యాల జిల్లా వైసీపీని న‌డిపిస్తున్నారు. సొంత అన్న కొడుకును వ‌ర్గ శ‌త్రువులా చూసే బైరెడ్డి రాజ‌శేఖ‌ర‌రెడ్డికి జ‌నాద‌ర‌ణ ఎంత వ‌ర‌కు ఉంటుంద‌న్నా .. జ‌వాబు దొర‌క‌దు. ఈ నేప‌థ్యంలో బైరెడ్డి తిరిగి వ‌చ్చినా టీడీపీకి మేలు ఎంత‌న్న‌ది చంద్ర‌బాబుకే తెలియాలి.

First Published:  1 Feb 2024 5:51 AM GMT
Next Story