Telugu Global
Andhra Pradesh

గీతాంజలి కేసులో బోండా ఉమా అనుచరుడు అరెస్ట్

మరోవైపు గీతాంజలిపై అనుచిత పోస్టులు పెట్టిన టీడీపీ, జనసేన నేతల అకౌంట్ల పరిశీలన జరుగుతోందని పోలీసులు చెబుతున్నారు.

గీతాంజలి కేసులో బోండా ఉమా అనుచరుడు అరెస్ట్
X

గీతాంజలి ఆత్మహత్య కేసులో తొలి అరెస్ట్ జరిగింది. పసుమర్తి రాంబాబు అనే వ్యక్తిని తెనాలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో ఆయన గీతాంజలిపై అనుచిత పోస్టింగ్ లు పెట్టినట్టు తేలింది. సదరు రాంబాబు టీడీపీ నేత బోండా ఉమా మహేశ్వరరావు అనుచరుడు అని తెలుస్తోంది. బోండా ఉమాతో రాంబాబు కలసి ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ కేసులో మరిన్ని అరెస్ట్ లు జరిగే అవకాశముంది.

టీడీపీ గగ్గోలు..

గీతాంజలి ఆత్మహత్య ఉదంతం బయటకు రాగానే టీడీపీ కవర్ చేసుకోలేక తంటాలు పడుతోంది. టీడీపీ అనుబంధ సోషల్ మీడియా అకౌంట్ల నుంచే ఆమెకు వేధింపులు ఎక్కువయ్యాయనే విషయం బహిరంగ రహస్యం అయితే ఆమెది అసలు ఆత్మహత్యా కాదా అనే కోణంలో టీడీపీ కొన్ని వీడియోలను పోస్ట్ చేస్తోంది. ఆమెకు వైసీపీ డిజిటల్ మీడియాతో సంబంధాలున్నాయనే అనుమానాలు రేకెత్తించేలా టీడీపీ కొత్త కథనాలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తోంది. తాజా అరెస్ట్ తో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. బోండా ఉమా అనుచరుడు ఈ కేసులో అరెస్ట్ కావడంతో మరికొందరు టీడీపీ నేతల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నట్టు అర్థమవుతోంది.

మరోవైపు గీతాంజలిపై అనుచిత పోస్టులు పెట్టిన టీడీపీ, జనసేన నేతల అకౌంట్ల పరిశీలన జరుగుతోందని పోలీసులు చెబుతున్నారు. చాలామంది ఇప్పటికే ఆ పోస్ట్ లు డిలీట్‌ చేశారని, అయినా కూడా స్క్రీన్‌ షాట్లను పరిశీలించి వారిపై చర్యలు తీసుకుంటామని అంటున్నారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న కొంతమంది పరారీలో ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఏపీ పోలీసులు ఈ కేసు విచారణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

గీతాంజలికి మద్దతుగా..

గీతాంజలి ఆత్మహత్య ఘటనను ఖండిస్తూ సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ట్రోలింగ్ చేసి అన్యాయంగా ఆమె ప్రాణాలు బలితీసుకున్నారని టీడీపీ-జనసేన నేతల్ని తిట్టిపోస్తున్నారు నెటిజన్లు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందానని చెప్పుకోవడం కూడా తప్పేనా అని అంటున్నారు. ఇలాంటి వేధింపులకు ఇకనైనా అడ్డుకట్ట పడాలని, నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

First Published:  14 March 2024 6:35 AM GMT
Next Story