Telugu Global
Andhra Pradesh

బ్లాక్ మ‌నీని మార్గ‌ద‌ర్శిలో దాచారా?

చిట్ ఫండ్ చందాదారులను రామోజీ, శైలజ పెద్ద ఎత్తున మోసం చేశార‌ని సీఐడీ అంటోంది. ఇదే విషయమై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. మార్గదర్శిలో ఉన్న డబ్బంతా బ్లాక్ మనీయే అని పదేపదే ఆరోపిస్తున్నారు.

బ్లాక్ మ‌నీని మార్గ‌ద‌ర్శిలో దాచారా?
X

మార్గదర్శి చిట్ ఫండ్ మోసాలపై ఛైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజా కిరణ్‌పై ఏపీ సీఐడీ చార్జిషీట్ దాఖలు చేసింది. అంటే వీళ్ళిద్దరిపైనే కాదు మొత్తం 15 మంది మీద చార్జిషీట్లు దాఖలు చేసింది. అందులో రామోజీ, శైలజ పేర్లు కూడా ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి చిట్ ఫండ్ పేరుతో రామోజీ వేల కోట్ల రూపాయల డిపాజిట్లను సేకరించినట్లు సీఐడీ కేసులు నమోదు చేసింది.

రామోజీ పాల్పడిన మోసాలకు ఆధారాలను కూడా సీఐడీ సేకరించింది. చిట్ ఫండ్ పేరుతో వేల కోట్ల రూపాయలను వసూళ్ళు చేసి చిట్టేతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టిన విషయం బయటపడింది. అనేక కంపెనీలకు చెందిన మ్యూచువల్ ఫండ్స్ లో కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టారు. చందాదారుల రక్షణ కోసమనే సీఐడీ మార్గదర్శిపై దాడులు చేసి కేసులు నమోదుచేసి దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగానే మొత్తం ఏడు కేసులు నమోదు చేసింది. అన్నింటిలోనూ రామోజీ, శైలజే కీలక పాత్రదారులు.

ఉషాకిరణ్ మీడియా లిమిటెడ్, ఉషోదయ ప్రైవేటు లిమిటెడ్ పేరుతో ఉన్న రూ.1035 కోట్ల ఆస్తులను రెండు విడతలుగా సీఐడీ ఇప్పటికే అటాచ్ చేసింది. మోసం, డిపాజిట్లు మళ్ళించటంపై చిట్ ఫండ్ చట్టం కింద అందరిపైనా కేసులు నమోదయ్యాయి. రెండు కేసుల్లో విచారణ అయిపోయింది. మిగిలిన ఐదు కేసుల్లో కూడా విచారణ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. విచారణ పూర్తి కాగానే ఈ కేసుల్లో కూడా చార్జిషీట్లు దాఖలు చేయటానికి సీఐడీ రెడీ అవుతోంది.

చిట్ ఫండ్ చందాదారులను రామోజీ, శైలజ పెద్ద ఎత్తున మోసం చేశార‌ని సీఐడీ అంటోంది. ఇదే విషయమై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. మార్గదర్శిలో ఉన్న డబ్బంతా బ్లాక్ మనీయే అని పదేపదే ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో మార్గదర్శిలో హవాలా జరుగుతోందనే అనుమానాన్ని సీఐడీ వ్యక్తం చేస్తోంది. రెండింటిలో ఏది నిజమన్న విషయాన్ని సీఐడీయే క్లియర్ చేయాలి. బహుశా ఇందుకేనేమో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) ఉన్నతాధికారులు కూడా దర్యాప్తులో పాల్గొంటున్నది. మరి చార్జిషీట్లు దాఖలు చేసిన తర్వాత అంకం ఏమిటో సీఐడీయే చెప్పాలి.

First Published:  29 July 2023 7:45 AM GMT
Next Story