Telugu Global
Andhra Pradesh

తెరపైకి మీనా, రమ్యకృష్ణ, నవనీత్ కౌర్.. బండారు క్షమాపణ చెప్పక తప్పదా..?

రోజురోజుకీ బండారుపై విమర్శలు తీవ్రమవుతున్నాయి. ఈ దశలో ఆయన రోజాకు క్షమాపణలు చెప్పి పరువు దక్కించుకుంటే మంచిదనే సలహాలు వినపడుతున్నాయి.

తెరపైకి మీనా, రమ్యకృష్ణ, నవనీత్ కౌర్.. బండారు క్షమాపణ చెప్పక తప్పదా..?
X

మంత్రి రోజాపై బండారు సత్యనారాయణ అనుచిత వ్యాఖ్యల వ్యవహారం ఇంకా పొలిటికల్ హాట్ టాపిక్ గానే ఉంది. ఆ కేసులో బండారుని పోలీసులు అరెస్ట్ చేయడం, ఆయన బెయిల్ పై బయటకు రావడం అంతా చకచకా జరిగిపోయాయి. అరెస్ట్ విషయంలో రెండు రోజులు హడావిడి జరిగినా, బెయిల్ మాత్రం సునాయాసంగానే వచ్చింది. అయితే ఇప్పుడు ఆయనపై విమర్శల దాడి పెరిగింది. సినీ ఇండస్ట్రీ నుంచి మంత్రి రోజాకి పెద్ద ఎత్తున మద్దతు వస్తోంది. రాజకీయాల్లో ఉన్న సినీతారలు ముందుగా రోజాపై బండారు వ్యాఖ్యలను ఖండించారు. కవిత, ఖుష్బూ, రాధిక.. ఘాటుగా స్పందించారు. బండారుకి కఠిన శిక్ష పడాలన్నారు. తాజాగా ఎంపీ నవనీత్ కౌర్ కూడా ఈ ఘటనపై స్పందించారు. రమ్యకృష్ణ, మీనా కూడా బండారు వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.


ఇండస్ట్రీ సరే.. సహచర ఎమ్మెల్యేల స్పందన ఏది..?

సినీ ఇండస్ట్రీ నుంచి వస్తున్న మద్దతును చూసి రోజా ఊరట చెందాలా, లేక సొంత పార్టీనుంచి సరైన స్పందన రాలేదని బాధపడాలా.. అర్థం కాని పరిస్థితి. ఇండస్ట్రీ జనాలు స్పందించినంత ఘాటుగా వైసీపీ నుంచి సరైన స్పందన లేదు అనేది వాస్తవం. కనీసం సహచర మహిళా ఎమ్మెల్యేలయినా రోజాకు మద్దతుగా నిలిచారా, ఆమెను కలసి ఓదార్చారా..? అంటే సరైన సమాధానం లేదు. మహిళా కమిషన్ కూడా నిస్సహాయంగా మారిపోయింది. బండారుని అరెస్ట్ చేయాలంటూ డీజీపీకి లేఖరాసి సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలో రోజా.. జాతీయ మీడియా సపోర్ట్ కోరుతూ ట్వీట్ వేయడం విశేషం.

బండారు ఉక్కిరిబిక్కిరి..

సినీ ఇండస్ట్రీకి చెందిన మహిళా ఆర్టిస్ట్ లు బండారు సత్యనారాయణను నేరుగా టార్గెట్ చేస్తున్నారు. బండారుకి తల్లి, చెల్లి, భార్య లేరా అని ప్రశ్నిస్తున్నారు. అలాంటి వారికి కుటుంబ సభ్యులైనా బుద్ధి చెప్పాలని, క్షమాపణలు చెప్పించాలని అంటున్నారు. అటు టీడీపీ కూడా ఈ వ్యవహారాన్ని లైట్ తీసుకుంది. మొదట్లో బండారు వ్యాఖ్యల్ని టీడీపీ నేతలు సమర్థించినా.. ఇప్పుడు సైలెంట్ గా ఉంటున్నారు. మొత్తమ్మీద రోజురోజుకీ బండారుపై విమర్శలు తీవ్రమవుతున్నాయి. ఈ దశలో ఆయన రోజాకు క్షమాపణలు చెప్పి పరువు దక్కించుకుంటే మంచిదనే సలహాలు వినపడుతున్నాయి.

First Published:  8 Oct 2023 3:30 AM GMT
Next Story