Telugu Global
Andhra Pradesh

షర్మిల వ్యాఖ్యలకు అవినాష్ రెడ్డి ఘాటు రిప్లై

ఆ వ్యాఖ్యలు వినడానికే చాలా భయంకరంగా ఉన్నాయని అంటున్నారు అవినాష్ రెడ్డి. మసి పూసి పైగా బూడిద చల్లి తుడుచుకోమంటున్నారని, తుడుచుకుంటూ పోతే తిడుతూనే ఉంటారని చెప్పారు.

షర్మిల వ్యాఖ్యలకు అవినాష్ రెడ్డి ఘాటు రిప్లై
X

వరుసకు అక్క, తమ్ముడు. కానీ ఇప్పుడు కడప లోక్ సభ బరిలో వారిద్దరూ ప్రత్యర్థులు. వైసీపీ సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల. ఇక్కడ ఎలక్షన్ పాయింట్ ఒకటే. వైఎస్ వివేకా హత్యకేసు. ఆ హత్యకేసులో అవినాష్ రెడ్డి హంతకుడంటూ షర్మిల తీవ్ర విమర్శలు చేస్తున్నారు. హంతకుడికి ఓటు వేస్తారా, హంతకుడిని చట్టసభలకు పంపిస్తారా అంటూ షర్మిల తన ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆమె వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు అవినాష్ రెడ్డి. ఆ వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు.

మనుషులేనా..?

వివేకా హత్యకేసులో విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తి అనడం వరకు సబబు. అయితే నేరుగా అవినాష్ రెడ్డి హంతకుడంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. ఆ వ్యాఖ్యలు వినడానికే చాలా భయంకరంగా ఉన్నాయని అంటున్నారు అవినాష్ రెడ్డి. మసి పూసి పైగా బూడిద చల్లి తుడుచుకోమంటున్నారని, తుడుచుకుంటూ పోతే తిడుతూనే ఉంటారని చెప్పారు. "వారు ఏమైనా, ఎంతైనా మాట్లాడుకోనీ.. వారు మనుషులైతే, వారిది మనిషి పుట్టుక అయితే విచక్షణ, విజ్ఞత ఉంటుంది. అందుకే ఆ వ్యాఖ్యలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నా." అంటూ షర్మిల పేరెత్తకుండానే ఘాటు వ్యాఖ్యలు చేశారు అవినాష్ రెడ్డి.

సీఎం జగన్ కు దూరం జరిగాక, తెలంగాణ వెళ్లి వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టి, ఆ తర్వాత దాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసి, ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి ఇక్కడకు వచ్చారు వైఎస్ షర్మిల. ఇన్నాళ్లూ పోటీకి దూరంగా ఉంటూ అపజయాన్ని తప్పించుకున్న ఆమె, ఇప్పుడు కడప బరిలో నిలవడంతో కష్టాలు మొదలయ్యాయి. వైఎస్ఆర్ బిడ్డను అని చెప్పుకుకుంటున్న ఆమెకు ఈ విజయం కీలకంగా మారింది. అందుకే వైఎస్ వివేకా హత్యకేసుని తెరపైకి తెచ్చారు. అది మినహా కాంగ్రెస్ కి ఓటు ఎందుకు వేయాలో చెప్పలేని పరిస్థితుల్లో షర్మిల ఉన్నారు. అందుకే అవినాష్ రెడ్డి హంతకుడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు, ఎల్లో మీడియాలో ఉచిత ప్రచారం పొందారు. అవినాష్ రెడ్డి కూడా ఇప్పుడు ఘాటుగానే స్పందించారు.

First Published:  6 April 2024 7:56 AM GMT
Next Story