Telugu Global
Andhra Pradesh

పుంగనూరు ఘటనపై ఏపీ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ రియాక్షన్

శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా విధులు నిర్వహిస్తున్న పోలీసులపై ఉద్దేశపూర్వకంగా దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్రలు, రాళ్లు వంటి మారణాయుధాలతో దాడి చేశారని, పోలీస్ వాహనాలకు నిప్పు పెట్టి భారీ విధ్వంసం సృష్టించారన్నారు.

పుంగనూరు ఘటనపై ఏపీ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ రియాక్షన్
X

పుంగనూరు ఘటనలో ఇరు పార్టీల నేతలతోపాటు పోలీసులు కూడా గాయపడ్డారు. 50మంది పోలీసులు గాయాలతో చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. 2 పోలీస్ వ్యాన్లు కూడా తగలబెట్టారు ఆందోళనకారులు. రాజకీయ పార్టీల మధ్య జరిగిన గొడవల్లో పోలీసు వాహనాలను తగలబెట్టడం, పోలీసులపై దాడులు చేయడం సరికాదంటోంది ఏపీ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్. పుంగనూరు ఘటనను తీవ్రంగా ఖండించారు అసోసియేషన్ నేతలు.

ఇటీవల కాలంలో ఏపీలో ఇలాంటి ఘటనలు జరగలేదని అంటున్నారు ఏపీ పోలీసులు. అమరావతిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ నేతలు.. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా విధులు నిర్వహిస్తున్న పోలీసులపై ఉద్దేశపూర్వకంగా దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్రలు, రాళ్లు వంటి మారణాయుధాలతో దాడి చేశారని, పోలీస్ వాహనాలకు నిప్పు పెట్టి భారీ విధ్వంసం సృష్టించారన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని డీజీపికి విజ్ఞప్తి చేశారు.

సంయమనం పాటించాం..

ఘర్షణలు జరుగుతున్న ప్రదేశంలో పోలీసులు ఎంతో సంయమనం పాటించారని చెప్పారు అసోసియేషన్ నేతలు. చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి కూడా పోలీసులు లాఠీ చార్జి చేయలేదన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా డ్యూటీ చేశారని, ఏ వర్గానికి మద్దతివ్వ లేదన్నారు. చంద్రబాబు, టీడీపీ నేతలు తమపై చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. పోలీస్ అసోసియేషన్ నేతలు కూడా ఈ ఆరోపణలను ఖండించారు.

పుంగనూరు ఘటనపై ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి విచారణకు ఆదేశించారు. రాళ్లు రువ్వినవారిని, వాహనాలకు నిప్పు పెట్టిన వారందరినీ గుర్తించామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన వారిపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. పుంగనూరులో సీసీ కెమెరా పుటేజీని విశ్లేషిస్తున్నామని చెప్పారు. సామాజిక మాధ్యమాలలో వైరల్ అయిన వీడియోలనుంచి కూడా ఆందోళనకారుల్ని గుర్తించామన్నారు. రెచ్చగొట్టే ప్రసంగాలపై కూడా దృష్టి పెట్టామన్నారు డీజీపీ. 30 మంది టీడీపీ నేతలపై పుంగనూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.

First Published:  5 Aug 2023 10:07 AM GMT
Next Story