Telugu Global
Andhra Pradesh

బొత్స అన్నదేంటి..? మీడియా రాసిందేంటి..?

బొత్స ఉద్దేశంలో అవినీతి జరుగుతుంటే ఇది వరకే జీవీఎల్ ఆరోపణలు చేసేవారు కదా!?. ఎక్కడా అవినీతి జరగలేదు కాబట్టే జీవీఎల్ ఇంతకాలం ప్రశ్నించలేదు అన్నది బొత్స వ్యాఖ్యల సారాంశం.

బొత్స అన్నదేంటి..? మీడియా రాసిందేంటి..?
X

మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలను వైసీపీ వ్యతిరేక మీడియా వక్రీకరించి ప్రచారం చేస్తోంది. మంత్రి బొత్స ఒకటి చెప్పగా.. మీడియా మాత్రం మరోలా ప్రచారం చేస్తోంది. అమిత్ షా పర్యటన తర్వాత బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కూడా ఏపీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేశారు. దానికి స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ జీవీఎల్ ఈ రాష్ట్రానికి చెందిన వారే కదా.. అమిత్ షా వచ్చి చెప్పే వరకు అవినీతి ఉంటే తెలియలేదా.. అప్పుడెందుకు మాట్లాడలేదు అంటూ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలను టీడీపీకి అనుకూలమని పేరున్న మీడియా సంస్థలు మరోలా ప్రచారం చేస్తున్నాయి.

ఏపీలో ఎప్పటి నుంచో అవినీతి ఉంది.. కానీ ఇప్పుడే ఎందుకు ప్రశ్నిస్తున్నారు అంటూ బొత్స వ్యాఖ్యానించారంటూ ఒక ప్రముఖ మీడియా ఛానల్ ప్రసారం చేసింది. పైగా బొత్స వ్యాఖ్యలు జగన్‌ ప్రభుత్వానికి షాక్ ఇచ్చాయంటూ విశ్లేషించింది. కానీ, నిజానికి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యల వీడియోను పరిశీలిస్తే ఆయన ఉద్దేశం ఏంటో స్పష్టంగానే అర్థమవుతుంది.

ఏపీలో ఎప్పటి నుంచో అవినీతి ఉంది.. కానీ జీవీఎల్ ఇప్పుడే ఎందుకు ప్రశ్నిస్తున్నారని బొత్స ఎక్కడా అనలేదు. జీవీఎల్ ఈ రాష్ట్రానికి చెందిన వారే కదా.. నిజంగా అవినీతి ఉంటే జీవీఎల్ ఇది వరకే ప్రశ్నించేవారు కదా.. అలా చేయకుండా ఇప్పుడు అమిత్ షా పర్యటన తర్వాత విమర్శలు చేస్తున్నారంటే అవన్నీ కల్పితం అని స్పష్టంగా అర్థమవుతోంది కదా అంటూ బొత్స వ్యాఖ్యానించారు.

బొత్స ఉద్దేశంలో అవినీతి జరుగుతుంటే ఇది వరకే జీవీఎల్ ఆరోపణలు చేసేవారు కదా!?. ఎక్కడా అవినీతి జరగలేదు కాబట్టే జీవీఎల్ ఇంతకాలం ప్రశ్నించలేదు అన్నది బొత్స వ్యాఖ్యల సారాంశం. కానీ మీడియా దాన్ని తనకు కావాల్సిన విధంగా వక్రీకరించింది.

First Published:  15 Jun 2023 3:51 AM GMT
Next Story