Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు రాజకీయ జీవితం ముగిసిన అధ్యాయం

రంగా హత్య, ముద్రగడ కుటుంబానికి వేధింపులు, రత్నాచల్‌ దహనం ఘటనలో తప్పుడు కేసుల బనాయింపు ఉదంతాలను కాపు జాతి ఎన్నటికీ మరచిపోదని, చంద్రబాబును ఎన్నటికీ క్షమించదని స్పష్టంచేశారు.

చంద్రబాబు రాజకీయ జీవితం ముగిసిన అధ్యాయం
X

చంద్రబాబు రాజకీయ జీవితం ముగిసిన అధ్యాయం

చంద్రబాబు రాజకీయ జీవితం ఇక ముగిసిన అధ్యాయమని ఏపీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. ఆయన తీరు.. ఏరు దాటేవరకు ఓడ మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న.. అన్న‌ చందంగా ఉంటుందని వివరించారు. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ నిరంతర అజ్ఞాని అని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు. శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ‌ విలేకరులతో మాట్లాడుతూ... చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వారిని ప్రజలు నమ్మొద్దని ఈ సందర్భంగా ఆయన కోరారు.

రంగా హత్య, ముద్రగడ కుటుంబానికి వేధింపులు, రత్నాచల్‌ దహనం ఘటనలో తప్పుడు కేసుల బనాయింపు ఉదంతాలను కాపు జాతి ఎన్నటికీ మరచిపోదని, చంద్రబాబును ఎన్నటికీ క్షమించదని స్పష్టంచేశారు. ఒక పక్క పేద ప్రజల ఆర్థిక ఎదుగుదల కోసం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే.. పవన్‌ ఆ పథకాల గురించి అవగాహన లేకుండా మాట్లాడటం అతని అజ్ఞానానికి నిదర్శనమన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రతి పేద కుటుంబం ఎంతో సంతోషంగా ఉందని మంత్రి చెప్పారు.

సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో సోషల్‌ ఇంజనీరింగ్‌ చేస్తున్నారని, సంక్షేమ పథకాల ద్వారా ప్రతి పేద కుటుంబం ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశాలు కల్పిస్తున్నారని మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ‌ వివరించారు. అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేయడం ద్వారా పేదల కుటుంబాల్లోని పిల్లలను చదువు వైపు నడిపించేందుకు పూర్తి సహకారం అందిస్తున్నారని చెప్పారు. చదువు ద్వారానే ఏ కుటుంబం ఆర్థిక పరిస్థితులైనా మెరుగవుతాయనేది అందరికీ తెలిసిన విషయమేనన్నారు. అందుకే పేద కుటుంబంలోని ప్ర‌తి చిన్నారీ ఉన్నత చదువులు చదువుకోవడం కోసం ఆర్థిక సహకారం అందిస్తున్నారన్నారు.

First Published:  18 Nov 2023 3:41 AM GMT
Next Story