Telugu Global
Andhra Pradesh

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ : రెండు రోజుల్లో 352 ఎంవోయూలపై సీఎం జగన్ సంతకాలు

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ప్రాధాన్యత వల్లే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కాపాడుకోగలిగామని సీఎం జగన్ అన్నారు.

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ : రెండు రోజుల్లో 352 ఎంవోయూలపై సీఎం జగన్ సంతకాలు
X

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 విజయవంతం అయ్యింది. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకొని రావడమే లక్ష్యంగా ఈ సమ్మిట్‌ను ఏర్పాటు చేయగా.. ప్రభుత్వం అంచనా వేసిన దాని కంటే ఎక్కువే వచ్చినట్లు తెలుస్తున్నది. ఈ రెండు రోజుల్లో పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ఏపీని నమ్మి ఇన్వెస్ట్ చేయడం పట్ల సీఎం జగన్ మోహన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రాన్ని మరింత తీసుకొని వెళ్లే అనుకూల వాతావరణ ఏర్పడటానికి ఈ సమ్మిట్ దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ప్రాధాన్యత వల్లే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కాపాడుకోగలిగామని సీఎం జగన్ అన్నారు. బ్రాడ్‌బ్యాండ్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందరికీ అందించినట్లు తెలిపారు. పదిహేను రంగాలను ప్రాధాన్యత అంశాలుగా తీసుకొని.. వాటిని అభివృద్ధి చేసేందుకు పలు చర్యలు చేపట్టామని అన్నారు. గత మూడున్నర ఏళ్లుగా ఏపీ ఆర్థికంగా ముందుకు దూసుకొని పోతుందని చెప్పారు.

ప్రస్తుతం రాష్ట్రానికి అతి కీలకమైన సమయం అన్నారు. ఈ సమయంలో సమ్మిట్ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ సమ్మిట్‌లో ప్రభుత్వం 352 ఎంవోయూలు కుదుర్చుకున్నదని చెప్పారు. మన రాష్ట్రం రూ.13,05,663 కోట్ల పెట్టుబడులు ఆకర్షించగలిగిందని వెల్లడించారు. ఈ పెట్టుబడుల కారణంగా రాష్ట్రంలోని 6,03,223 మందికి ఉపాధి లభించనున్నదని సీఎం జగన్ చెప్పారు. రాష్ట్రంలో అపారమైన వనరులు ఉన్నాయని.. అందుకే భారీగా పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపించినట్లు ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వం చేసుకున్న ఎంవోయూల వల్ల ఎనర్జీ సెక్టర్‌లో 1,90,268 మందికి, ఐటీ అండ్ ఐటీఈఎస్‌లో 1,04,442 మందికి, పర్యాటక రంగంలో 30,787 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. సమ్మిట్ వేదికపై నుంచే 14 పరిశ్రమలను సీఎం జగన్ ప్రారంభించారు. ఈ యూనిట్లలో 9,108 మంది కార్మికులకు ఉపాధి లభిస్తుందని అన్నారు. ఏపీ ప్రభుత్వం గ్రీన్, రెన్యూవబుల్ ఎనర్జీపై దృష్టి పెట్టిందని అన్నారు. మరోవైపు ఆటోమొబైల్, ఈవీ సెక్టార్లతో పాటు హెల్త్ కేర్ అండ్ మెడికల్ ఎక్విప్‌మెంట్, అగ్రీ ప్రాసెసింగ్, టూరిజం సెక్టార్లపై ప్రత్యేక సెషన్స్ నిర్వహించారు. ఏపీ ప్రభుత్వ ప్రతినిధులతో పాటు యూఏఈ, నెదర్లాండ్స్, వియత్నాం, ఆస్ట్రేలియాకు చెందిన వారు ఈ సెషన్లలో పాల్గొన్నారు.


First Published:  4 March 2023 10:50 AM GMT
Next Story