Telugu Global
Andhra Pradesh

బాబుకు భారీ షాక్‌.. వైసీపీలోకి కేశినేని

కేశినేని నాని టీడీపీకి రాజీనామా చేసిన నేపథ్యంలో కేశినేని భవన్‌ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. నిన్నటి వరకు చంద్రబాబు, కేశినేని నాని, శ్వేత ఫ్లెక్సీలతో పసుపుమయంగా ఉన్న కేశినేని భవన్‌ పూర్తిగా మారిపోయింది.

బాబుకు భారీ షాక్‌.. వైసీపీలోకి కేశినేని
X

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి భారీ షాక్‌ తగిలినట్లే. టీడీపీకి రాజీనామా చేసిన విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని వైఎస్‌ జగన్‌ నాయకత్వంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఆయన ఈ నెల 11వ తేదీన వైసీపీలో చేరే అవకాశాలున్నాయి. నోరేసుకుని తనకు మద్దతు పలుకుతూ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మీద తిట్ల వర్షం కురిపిస్తూ వస్తున్న ఇద్దరు నేతల కోసం చంద్రబాబు కేశినేని నానిని వదులుకున్నారు.

బొండా ఉమామహేశ్వరరావు, బుద్ధా వెంకన్నలతో కేశినేని నానికి చాలా కాలంగా తగాదాలున్నాయి. చంద్రబాబు వారిద్దరి కోసం ప్రజా మద్దతు గల కేశినేని నానిని వదులుకున్నారు. ఆయనతో పాటు కేశినేని శ్వేత కూడా కార్పొరేటర్‌ పదవికి, టీడీపీకి రాజీనామా చేశారు. దాంతో ఆమె కూడా వైసీపీలో చేరే అవకాశాలున్నాయి. కేశినేని ప్రభావం కృష్ణా జిల్లావ్యాప్తంగా ఉంటుంది. ఇది చంద్రబాబుకు పెద్ద మైనస్‌ అవుతుందని చెప్పవచ్చు.

కేశినేని నాని టీడీపీకి రాజీనామా చేసిన నేపథ్యంలో కేశినేని భవన్‌ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. నిన్నటి వరకు చంద్రబాబు, కేశినేని నాని, శ్వేత ఫ్లెక్సీలతో పసుపుమయంగా ఉన్న కేశినేని భవన్‌ పూర్తిగా మారిపోయింది. ఆ ఫ్లెక్సీలన్నీ మాయమైపోయాయి. పార్టీలతో సంబంధం లేకుండా ఐ లవ్‌ విజయవాడ టైటిల్‌తో ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. విజయవాడలో నిర్మించిన మూడు ఫ్లైఓవర్ల ఫొటోలు ఉండే విధంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలపై ఎన్టీఆర్‌ ఫొటోతో పాటు కేశినేని నాని, శ్వేత ఫొటోలు మాత్రమే ఉన్నాయి.

వైసీపీలో చేరడానికి కేశినేని బేరసారాలు సాగిస్తున్నారు. తనకు ఎంపీ సీటుతో పాటు తనకు సంబంధించిన ఐదుగురికి అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని కేశినేని నాని కోరుతున్నారు. కేశినేని శ్వేతకు విజయవాడ తూర్పు, ఎమ్మెస్‌ బేగ్‌కు విజయవాడ పశ్చిమ, జీవరత్నంకు నందిగామ, స్వామి దాసుకు తిరువూరు, బొమ్మసాని సుబ్బారావుకు మైలవరం అసెంబ్లీ స్థానాలతో పాటు తనకు విజయవాడ పార్లమెంటు సీటు ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. అయితే, కేశినేని నానికి ఎంపీ సీటు ఇస్తామని, ఆయనకు చెందిన ఒకరికి అసెంబ్లీ సీటు ఇస్తామని వైసీపీ అధిష్టానం చెబుతున్నది.

First Published:  10 Jan 2024 10:08 AM GMT
Next Story