Telugu Global
Andhra Pradesh

హెరిటేజ్‌ ఆస్తులపై భువనేశ్వరి వ్యాఖ్యల్లో నిజమెంత..?

హెరిటేజ్‌కు సంబంధించి ఇంటర్‌నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం.. 1992లో హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌ను ఏర్పాటు చేశారు.

హెరిటేజ్‌ ఆస్తులపై భువనేశ్వరి వ్యాఖ్యల్లో నిజమెంత..?
X

``మా కుటుంబానికి ప్రజల డబ్బు అవసరం లేదు.. నేనూ ఓ కంపెనీని నడుపుతున్నా.. అందులో 2 శాతం అమ్ముకున్నా నాకు రూ.400 కోట్లు వస్తాయి.. ప్రజల సొమ్ము మాకు అక్కర్లేదు..`` అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి హెరిటేజ్‌ కంపెనీని ఉద్దేశిస్తూ తాజాగా చేసిన వ్యాఖ్యలివి. ఆమె లెక్క ప్రకారం హెరిటేజ్‌ కంపెనీ విలువ రూ.20 వేల కోట్లు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కుంభకోణంలో టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టయి రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. 2014-19 మ‌ధ్య ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పేరుతో రూ.371.25 కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారని చంద్రబాబుపై అభియోగాలు ఉన్నాయి. దీంతో సీఐడీ అధికారులు ఆయన్ను అరెస్టు చేశారు. ఈ కేసులో చంద్రబాబు పాత్రపై ఆధారాలు బలంగా ఉండటంతో తొలుత ఆయనకు 14 రోజులు రిమాండ్‌ విధించిన ఏసీబీ న్యాయస్థానం.. ఇటీవల ఆ గడువు ముగియడంతో రిమాండ్‌ను మరో 11 రోజులు పొడిగిస్తూ ఆదేశించింది.

ఇకపోతే భువనేశ్వరి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో హెరిటేజ్‌ అసలు విలువ ఎంతనేది ఒక్కసారి తెలుసుకుందాం.. హెరిటేజ్‌కు సంబంధించి ఇంటర్‌నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం.. 1992లో హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌ను ఏర్పాటు చేశారు. దీనికి నారా భువనేశ్వరి మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. 2023 సెప్టెంబర్‌ 21 నాటికి హెరిటేజ్‌ కంపెనీ విలువ (మార్కెట్‌ విలువ) రూ.2,181 కోట్లు. 2023లో ఆ కంపెనీ ఆదాయం రూ.3,241 కోట్లు. ఇక నెట్‌ వర్త్‌ (నికర విలువ) చూసుకుంటే రూ.756 కోట్లు.

హెరిటేజ్‌ కంపెనీ ప్రస్తుత మార్కెట్‌ విలువ రూ.2,181 కోట్లు.. అందులో 2 శాతం అంటే రూ.21 కోట్లు. వాస్తవ విలువ ఇలా ఉంటే.. తమ కంపెనీలో కేవలం 2 శాతం అమ్ముకుంటే చాలు రూ.400 కోట్లు వస్తాయని నారా భువనేశ్వరి చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఆ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్న ఆమె ఇలా నోటికొచ్చిన లెక్కలు చెప్పడం చూస్తే.. ఈ కేసు నుంచి జనం దృష్టిని మళ్లించడానికి.. ప్రజల్లో సానుభూతి పెంచుకోవడానికి వారు పడుతున్న తాపత్రయం స్ప‌ష్టంగా అర్థమవుతోంది.


First Published:  26 Sep 2023 7:09 AM GMT
Next Story