Telugu Global
NEWS

వింబుల్డన్ టైటిల్ కు జోకో గురి.. కిర్గిసోతో నేడే టైటిల్ ఫైట్!

ప్రపంచంలోనే అత్యంత పురాతన గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీ వింబుల్డన్ -2022 పురుషుల సింగిల్స్ టైటిల్ సమరానికి కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. మరికొద్ది గంటల్లో జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియన్ సంచలనం నిక్ కిర్గిసో తో టాప్ సీడ్ నొవాక్ జోకోవిచ్ అమీతుమీ తేల్చుకోనున్నాడు. ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ఆటగాడు, ఆరుసార్లు విజేత నొవాక్ జోకోవిచ్ తన కెరియర్ లో ఎనిమిదోసారి వింబుల్డన్ ఫైనల్స్ చేరితే.. 40వ ర్యాంక్ ఆటగాడు నిక్ కిర్గిసో తొలిసారి టైటిల్ సమరానికి […]

వింబుల్డన్ టైటిల్ కు జోకో గురి.. కిర్గిసోతో నేడే టైటిల్ ఫైట్!
X

ప్రపంచంలోనే అత్యంత పురాతన గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీ వింబుల్డన్ -2022 పురుషుల సింగిల్స్ టైటిల్ సమరానికి కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. మరికొద్ది గంటల్లో జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియన్ సంచలనం నిక్ కిర్గిసో తో టాప్ సీడ్ నొవాక్ జోకోవిచ్ అమీతుమీ తేల్చుకోనున్నాడు. ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ఆటగాడు, ఆరుసార్లు విజేత నొవాక్ జోకోవిచ్ తన కెరియర్ లో ఎనిమిదోసారి వింబుల్డన్ ఫైనల్స్ చేరితే.. 40వ ర్యాంక్ ఆటగాడు నిక్ కిర్గిసో తొలిసారి టైటిల్ సమరానికి అర్హత సంపాదించాడు.

జోకోవిచ్ గ్రాండ్.. రికార్డు..

సెర్బియన్ థండర్ నొవాక్ జోకోవిచ్ తన కెరియర్ లో 32వసారి గ్రాండ్ స్లామ్ ఫైనల్స్ చేరడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. వింబుల్డన్ రెండో సెమీఫైనల్లో గ్రేట్ బ్రిటన్ ఆటగాడు, 12వ ర్యాంకర్ కమెరోన్ నోరీని నాలుగు సెట్ల పోరులో అధిగమించడం ద్వారా 8వసారి వింబుల్డన్ ఫైనల్లో అడుగుపెట్టాడు. ఆల్ ఇంగ్లండ్ క్లబ్ సెంటర్ కోర్టు వేదికగా జరిగిన పోరులో టాప్ సీడ్ జోకోవిచ్ 2-6, 6-3, 6-2, 6-4తో నోరీని అధిగమించాడు. ఇప్పటికే ఆరుసార్లు వింబుల్డన్ విజేతగా నిలిచిన జోకోవిచ్ గ్రాండ్ స్లామ్ టోర్నీ ఫైనల్స్ చేరడం ఇది 32వసారి. ఇప్పటి వరకూ రోజర్ ఫెదరర్ పేరుతో ఉన్న 31 ఫైనల్స్ రికార్డును జోకోవిచ్ 32 ఫైనల్స్ తో తెరమరుగు చేశాడు.

27 వరుస విజయాల జోకో..

వింబుల్డన్ గ్రాస్ కోర్టులో జోకోవిచ్ కు ఇది వరుసగా 27వ విజయం. 28 విజయాలతో రోజర్ ఫెదరర్ అత్యధిక వరుస విజయాల రికార్డు నెలకొల్పాడు. ఆదివారం జరిగే ఫైనల్లో జోకోవిచ్ విజేతగా నిలువగలిగితే..ఫెదరర్ పేరుతో ఉన్న 28 వరుస విజయాల రికార్డును సమం చేయగలుగుతాడు.
ఆస్ట్రేలియా ఆటగాడు నిక్ కిర్గిసోతో జరిగే టైటిల్ పోరులో జోకోవిచ్ నెగ్గితే తన గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సంఖ్యను 21కు పెంచుకోగలుగుతాడు. స్పానిష్ బుల్ రాఫెల్ నడాల్ 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ తో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఫెదరర్, జోకోవిచ్ చెరో 20 టైటిల్స్ చొప్పున నెగ్గి సంయుక్త ద్వితీయస్థానంలో నిలిచారు. వింబుల్డన్ టైటిల్ ను 7వసారి జోకో నెగ్గితే ఫెదరర్ 20 టైటిల్స్ రికార్డును అధిగమించి..21 టైటిల్స్ తో నడాల్ తర్వాతి స్థానంలో నిలువగలుగుతాడు.

జోకోవిచ్ పై కిర్గిసోదే పైచేయి..

ప్రపంచ 40వ ర్యాంక్ ఆటగాడు నిక్ కిర్గిసోకు టాప్ ర్యాంకర్ జోకోవిచ్ ప్రత్యర్థిగా 2-0 రికార్డు ఉంది. జోకోవిచ్ తో గతంలో తలపడిన రెండుకు రెండుసార్లు కిర్గిసోనే విజేతగా నిలిచాడు. వింబుల్డన్ లో వరుసగా గత మూడు టైటిల్స్ నెగ్గిన జోకోవిచ్ కు ఆదివారం జరిగే టైటిల్ సమరంలో 27 ఏళ్ల కిర్గిసో నుంచి గట్టిపోటీ ఎదురుకానుంది. గ్రాస్ కోర్టు టెన్నిస్ లో అత్యంత బలమైన ఆటగాడిగా కిర్గిసోకు పేరుంది. క్వార్టర్ ఫైనల్స్ వరకూ అలవోకగా నెగ్గుతూ సెమీస్ చేరిన కిర్గిసో.. గ్రౌండ్లో అడుగుపెట్టకుండానే ఫైనల్స్ చేరుకోగలిగాడు. సెమీఫైనల్స్ లో ప్రత్యర్థి, 2వ సీడ్ రాఫెల్ నడాల్.. పక్కటెముకల గాయంతో టోర్నీ నుంచి ఉపసంహరించుకోడంతో కిర్గిసోకు నేరుగా ఫైనల్లో పాల్గొనే అవకాశం దక్కింది. టైటిల్ సమరంలో కిర్గిసో ఒకవేళ సంచలన విజయం సాధించగలిగితే అది సరికొత్త చరిత్రే అవుతుంది. విజేతగా నిలిచిన ఆటగాడికి ట్రోఫీతో పాటు 15 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ సైతం సొంతం కానుంది.

First Published:  10 July 2022 1:24 AM GMT
Next Story