Telugu Global
National

భారత పౌరసత్వం ఇవ్వాలని కోర్టు మెట్లెక్కిన ”ఏ దేశానికి చెందని” మహిళ

ఓ బాలిక 10 ఏళ్ల వయస్సులో తన తల్లితో కలిసి ఉగాండా నుంచి ఇండియాకు వచ్చింది. అప్పుడు తల్లిదండ్రుల వెంట వచ్చిన సదరు బాలిక పాస్‌పోర్ట్ వివరాలు ఇప్పుడు తెలియడం లేదు. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా ఇప్పుడు తన వద్ద లేవు. ఆ బాలిక తల్లిదండ్రులు ఉగాండా నుంచి వచ్చినా.. వారికి మాత్రం బ్రిటిష్ పాస్‌పోర్టులు ఉన్నాయి. అలా ఆ బాలిక వచ్చి ఇప్పటికి 55 ఏళ్లు గడిచాయి. ప్రస్తుతం ఆమెను ఉగాండా, బ్రిటన్ దేశాలు […]

Bombay High court
X

ఓ బాలిక 10 ఏళ్ల వయస్సులో తన తల్లితో కలిసి ఉగాండా నుంచి ఇండియాకు వచ్చింది. అప్పుడు తల్లిదండ్రుల వెంట వచ్చిన సదరు బాలిక పాస్‌పోర్ట్ వివరాలు ఇప్పుడు తెలియడం లేదు. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా ఇప్పుడు తన వద్ద లేవు. ఆ బాలిక తల్లిదండ్రులు ఉగాండా నుంచి వచ్చినా.. వారికి మాత్రం బ్రిటిష్ పాస్‌పోర్టులు ఉన్నాయి.

అలా ఆ బాలిక వచ్చి ఇప్పటికి 55 ఏళ్లు గడిచాయి. ప్రస్తుతం ఆమెను ఉగాండా, బ్రిటన్ దేశాలు కూడా తమ పౌరురాలు కాదని అంటున్నాయి. మరోవైపు ఇండియన్ పాస్‌పోర్ట్ ఇవ్వడానికి అధికారులు నిరాకరిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఏ దేశానికి చెందకుండా పోయింది. దీంతో సదరు మహిళ (66) తనకు భారత పౌరసత్వం కల్పించాలని కోరుతూ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

భారత మూలాలున్న తల్లిదండ్రులకు ఉగాండాలో 1955లో పుట్టిన బాలిక, 1966లో ఇండియాకు వచ్చింది. అప్పట్లో ఆమె తల్లిదండ్రులకు బ్రిటిష్ పాస్‌పోర్ట్స్ ఉన్నాయి. అప్పటి నుంచి సదరు బాలిక ఇండియాలోనే నివసిస్తోంది. 1977లో ఒక భారతీయుడిని పెళ్లి కూడా చేసుకున్నది. ప్రస్తుతం ముంబైలోని అంధేరీలో నివసిస్తున్న సదరు మహిళ భారత పౌరసత్వం కోసం 2019లో ముంబై డిప్యుటీ కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నది. అయితే ఆ సమయంలో ఆమె అనుకోకుండా చేసిన ఒక మిస్టేక్ కారణంగా డిప్యుటీ కలెక్టర్ దరఖాస్తును రిజెక్ట్ చేశారు. దీంతో ఈ దరఖాస్తును మరోసారి పరిశీలించి తనకు భారత పౌరసత్వం ఇప్పించాలని హైకోర్టును ఆశ్రయించింది.

సదరు మహిళ ఇండియాకు 1966లో తన తల్లితో పాటు వచ్చిందని, అయితే ఆన్‌లైన్ అప్లికేషన్ నింపిన సమయంలో 2019 వరకు వీసాపై నివసించినట్లు తప్పుగా పేర్కొన్నదని.. దీంతో అప్లికేషన్‌ను అధికారులు రిజెక్ట్ చేశారని ఆమె తరపు అడ్వొకేట్ ఆదిత్య చితాలే హైకోర్టు డివిజన్ బెంచ్ జస్టీస్ ఎస్వీ గంగాపూర్ వాలా, జస్టీస్ ఎస్‌డబ్ల్యూ మోదక్‌కు విన్నవించారు. భారత పాస్‌పోర్ట్ కోసం మూడు సార్లు దరఖాస్తు చేస్తే రిజెక్ట్ చేశారని, తన తల్లిదండ్రులకు బ్రిటిష్ పాస్‌పోర్టులు ఉండటంతో.. తాను ఎలా ఇండియాకు వచ్చానో తెలిపే డాక్యుమెంట్లు సబ్‌మిట్ చేయమని అధికారులు కోరారని తెలిపింది. కానీ తన వద్ద ఎలాంటి డాక్యుమెంట్లు లేవని.. తాను తల్లి వెంట వచ్చానని పేర్కొన్నది. పాస్‌పోర్ట్ ఇవ్వాలంటే ముందు భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేయమని రీజనల్ పాస్‌పోర్ట్ అధికారి చెప్పినట్లు ఆమె కోర్టుకు తెలిపింది.

ఇక మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్‌టర్నల్ ఎఫైర్స్ తరపున అద్వైత సెత్నా తన వాదనలు వినిపించారు. వేరే దేశానికి చెందిన పాస్‌పోర్ట్ సబ్మిట్ చేస్తే తప్పకుండా భారత పౌరసత్వం ఇవ్వడానికి సిద్దంగా ఉన్నట్లు చెప్పారు. తల్లిదండ్రులు బ్రిటిష్ పాస్‌పోర్ట్ ఉండటంతో.. ఆమె ఆ దేశ ఎంబసీని కూడా సంప్రదించారని.. కానీ వాళ్లు ఆమెకు సదరు పాస్‌పోర్ట్ ఇవ్వాడానికి నిరాకరించినట్లు పేర్కొన్నారు. సదరు మహిళ వద్ద సంబంధిత డాక్యుమెంట్లు లేకపోవడం వల్లే బ్రిటిష్ ఎంబసీ కూడా చేతులెత్తేసిందని పేర్కొన్నారు.

ఉగాండా ఎంబసీని కలసి కావల్సిన డాక్యుమెంట్లు సబ్మిట్ చేస్తే పిటిషనర్‌కు తప్పకుండా పౌరసత్వం ఇస్తామని సెత్నా తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆమెను శత్రువులా పరిగణించడం లేదని కూడా పేర్కొన్నారు. కాగా, ఇందుకోసం కాస్త సమయం కావాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు. దీంతో అగస్టు 22న వాదలను వింటామని చెప్పి, కేసు వాయిదా వేసింది. కాగా, మహిళ కూతుర్లు, కొడుకులు, మనుమళ్లకు ఇండియన్ సిటిజన్‌షిప్ ఉండటం గమనార్హం.

First Published:  9 July 2022 12:49 AM GMT
Next Story