Telugu Global
National

సబ్కా సాథ్, సబ్కా వికాస్: ఈ రోజుతో… బీజేపీకి దేశంలో ఒక్క ముస్లిం ఎంపీ, ఎమ్మెల్యే లేరు

సబ్కా సాథ్, సబ్కా వికాస్ (అందరికీ మద్దతు, అందరి అభివృద్ది) అని చెప్పుకునే భారతీయ జనతాపార్టీకి దేశంలో అతి పెద్ద జనాభా అయిన ముస్లిం కమ్యూనిటీ నుండి ఈ రోజు తర్వాత ఒక్క ఎంపీ, ఒక్క ఎమ్మెల్యే కూడా ఉండటం లేదు. ఈ ఏడాది జులై 7 తర్వాత, అంటే ఈరోజు తర్వాత ‘ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ’ అని చెప్పుకునే అధికార భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి లోక్ స‌భ, రాజ్యసభలో ఒక్క ముస్లిం ఎంపి […]

సబ్కా సాథ్, సబ్కా వికాస్: ఈ రోజుతో… బీజేపీకి దేశంలో ఒక్క ముస్లిం ఎంపీ, ఎమ్మెల్యే లేరు
X

సబ్కా సాథ్, సబ్కా వికాస్ (అందరికీ మద్దతు, అందరి అభివృద్ది) అని చెప్పుకునే భారతీయ జనతాపార్టీకి దేశంలో అతి పెద్ద జనాభా అయిన ముస్లిం కమ్యూనిటీ నుండి ఈ రోజు తర్వాత ఒక్క ఎంపీ, ఒక్క ఎమ్మెల్యే కూడా ఉండటం లేదు.

ఈ ఏడాది జులై 7 తర్వాత, అంటే ఈరోజు తర్వాత ‘ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ’ అని చెప్పుకునే అధికార భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి లోక్ స‌భ, రాజ్యసభలో ఒక్క ముస్లిం ఎంపి కూడా ఉండరు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని 31 అసెంబ్లీలలో దేనిలోనైనా ఒక్క ఎమ్మెల్యేని కలిగి ఉన్నారా? అంటే అది కూడా లేదు.

బిజెపి ప్రస్తుతం లోక్‌సభతో పాటు 17 రాష్ట్రాలు మరియు యుటిలలో మెజారిటీని కలిగి ఉంది. ఇందులో ముస్లిం సమాజానికి చెందిన ఒక్క‌ ప్రతినిధి లేకపోవడం ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్’ అనే బీజేపీ నినాదపు డొల్ల తనం తెలియజేస్తోంది.

ప్రస్తుతం బీజేపీకి కేంద్ర మంత్రి నఖ్వీ చివరి ముస్లిం ఎంపీ. రాజ్యసభలో మిగిలిన ముగ్గురు ముస్లిం ఎంపీలు కొద్ది రోజుల క్రితమే పదవీ విరమణ చేశారు.

జర్నలిస్ట్ మరియు మాజీ కేంద్ర మంత్రి ఎం.జె. అక్బర్ పై మహిళల లైంగిక వేధింపుల ఆరోపణలతో అక్టోబరు, 2018లో తన పదవికి రాజీనామా చేశారు. జూన్ 29తో ఆయన పదవీకాలం ముగిసిపోయింది. ఆ తర్వాత, బిజెపి జాతీయ అధికార ప్రతినిధి సయ్యద్ జాఫర్ ఆలం పదవీకాలం జూలై 4న ముగిసింది. ఇక రాజ్యసభలో హౌస్ డిప్యూటీ లీడర్, కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ పదవీకాలం జూలై 7న (ఈ రోజు)ముగుస్తుంది.

దీంతో పార్లమెంట్‌లోని ఉభయ సభల్లోనూ బీజేపీకి ముస్లిం ఎంపీలు ఒక్కరు కూడా మిగలరు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో బీహార్‌లోని భాగల్‌పూర్ నుంచి గెలిచిన షానవాజ్ హుస్సేన్ లోక్‌సభలో ఆ పార్టీ చివరి ముస్లిం ఎంపీ.

నిజానికి 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున ముస్లిం అభ్యర్థి ఒక్కరు కూడా గెలవలేదు

2014, 2019 సార్వత్రిక ఎన్నికలలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి, దాని మిత్రపక్షాలతో కలిసి మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగినప్పటికీ, ఆ పార్టీ ముస్లిం అభ్యర్థులెవరూ లోక్ సభకు ఎన్నుకోబడలేదు.

2014లో మొత్తం 482 మంది ఎంపీ అభ్యర్థుల్లో ఏడుగురు ముస్లిం అభ్యర్థులను బీజేపీ బరిలోకి దింపింది. అయితే, ఆ సమయంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న షానవాజ్ హుస్సేన్‌తో సహా అందరూ ఓడిపోయారు.

2019 లో, కాషాయ‌ పార్టీ జమ్మూ కాశ్మీర్‌లో ముగ్గురు, పశ్చిమ బెంగాల్‌లో ఇద్దరు, లక్షద్వీప్‌లో ఒకరు చొప్పున మొత్తం ఆరుగురు ముస్లిం అభ్యర్థులను రంగంలోకి దించింది కానీ వారిలో ఎవరూగెలవలేదు.

బీజేపీ ముస్లిం అభ్యర్థులు ఎక్కువ మంది ముస్లిం-ఆధిక్యత ఉన్న నియోజకవర్గాల నుండి బరిలోకి దిగారు. అయితే కాషాయ పార్టీ రాడికల్, మతతత్వ ఎజెండాతో విసిగిపోయిన ముస్లిం సమాజం, సాధారణంగా BJP అభ్యర్థికి వ్యతిరేకంగా ఓట్లు వేశారు.

ఒక మాజీ కేంద్ర మంత్రి మాట్లాడుతూ, “బీజేపీ ఎప్పుడూ ముస్లింలను చేరుకోవడానికి ప్రయత్నించలేదు. ఇది ముస్లింల‌ నుండి అభ్యర్థులను నిలబెట్టింది, కానీ దానికి లభించిన మద్దతు అంతంత మాత్రమే. కాబట్టి, చాలా సంవత్సరాలుగా, పార్టీ నాయకులు ముస్లిమేతరుల మద్దతుపైననే దృష్టి పెట్టడం ప్రారంభించారు.” అన్నారు.

“ఒక నియోజకవర్గంలో 30% ముస్లిం జనాభా ఉంటే, గెలవడానికి వారు మిగిలిన 70% నుండి వీలైనన్ని ఎక్కువ ఓట్లను తెచ్చుకోవాలనే విషయం బిజెపి అభ్యర్థికి తెలుసు” అని మాజీ మంత్రి అన్నారు.

పైగా ముస్లిం అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా బిజెపి ఎటువంటి లాభాలను పొందలేదు, వారు ఎన్నికల బరిలోకి దిగడం వల్ల హిందూ ఓట్లు కూడా చీలిపోయాయి, వాటిలో కొన్ని ఓట్లు ప్రత్యర్థి పార్టీల ఇతర ముస్లిమేతర అభ్యర్థుల వైపు వెళ్ళాయి.

అంతేకాకుండా, ముస్లిం ఓటర్లు తక్కువగా ఉన్న స్థానాల్లో పోటీ చేసినంత ఉత్సాహంతో పార్టీ ఈ స్థానాల్లో పోటీ చేయదని చాలా మంది బీజేపీ కార్యకర్తలే నమ్ముతున్నారు.

‘మోదీ వేవ్’గా భావించిన 2014 ఎన్నికలలో, బిజెపి మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు, ఆ పార్టీ మొత్తం 31% ఓట్లను సాధించగలిగింది. అయినప్పటికీ, ఆ పార్టీ ముస్లిం అభ్యర్థులు వారి ముస్లిమేతర ప్రత్యర్ధుల కంటే చాలా ఘోరమైన ఓట్ల శాతం సాధించారు.

ముస్లిం అభ్యర్థులు సగటున దాదాపు 80,000 ఓట్లు సాధించగా, బీజేపీకి చెందిన ముస్లిమేతర అభ్యర్థులకు సగటున 3.5 లక్షల ఓట్లు వచ్చాయి.

ఇక ఒక్క పార్లమెంటులోనే కాదు 28 రాష్ట్రాలు, మూడు యుటిల శాసనసభలలో ప్రస్తుతం ఒక్క బిజెపి శాసనసభ్యుడు కూడా లేడు.

కొన్ని సంవత్సరాల క్రితం వరకు, పార్టీకి మొత్తం నలుగురు ముస్లిం శాసనసభ్యులు ఉన్నారు. జమ్మూ కాశ్మీర్, అస్సాంలో ఒక్కొక్కరు, రాజస్థాన్‌లో ఇద్దరు ఉండేవారు.

ఈ ఏడాది ప్రారంభంలో ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత మందిర్-మసీదు రాజకీయాలు ఊపందుకున్నాయి. అయితే తదుపరి సార్వత్రిక ఎన్నికలకు రెండు సంవత్సరాల కంటే తక్కువ సమయం ఉంది. మరో వైపు ఆ ఎన్నికల కోసం బీజేపీ అప్పుడే తీవ్ర కసరత్తు ప్రారంభించింది. అయితే ముస్లింలకు చేరువవడం కోసం ఆ పార్టీ ఎటువంటి ప్రయత్నం చేయడం లేదు. పైగా ఆ కమ్యూనిటీ మొత్తాన్ని దూరం చేసుకుంటున్న సంకేతాలు మాత్రం భారీగానే కనపడుతున్నాయి

ఇటీవలి ప్రవక్త మొహమ్మద్‌కు వ్యతిరేకంగా బిజెపి అధికార ప్రతినిధి చేసిన ప్రకటనలతో సహా అనేక పరిణామాలు బీజేపీకి ముస్లింలకు మధ్య‌ అగాధాన్ని మరింత విస్తృతం చేశాయి.

అయితే ఇలా ముస్లిం సమాజంలో వ్యతిరేకత వల్ల హిందూ సమాజం మొత్తం తమవైపు నిలబడుతుందనే బీజేపీ ఆశ నెరవేరుతుందా ?

First Published:  7 July 2022 1:29 AM GMT
Next Story