Telugu Global
National

యూపీలో రాజ్యాంగం అపహాస్యం.. సీజేఐ అడ్డుకోండి

కోర్టులు నిజానిజాలు నిర్ధారించి వేయాల్సిన శిక్షలను ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథే అమలు చేస్తున్న తీరుపై జాతీయ స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతున్నాయి. కోర్టులకు ప్రత్యామ్నాయ వ్యవస్థగా బుల్డోజర్‌ వ్యవస్థను తీసుకొచ్చారన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితులపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో పాటు 12 మంది న్యాయ ప్రముఖులు భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణకు లేఖ రాశారు. తక్షణం జోక్యం చేసుకుని ఉత్తరప్రదేశ్‌లో బుల్డోజర్‌ నుంచి రాజ్యాంగాన్ని కాపాడాలని కోరారు. నిందితులు పోలీసులు కస్టడీలో ఉన్న సమయంలో […]

యూపీలో రాజ్యాంగం అపహాస్యం.. సీజేఐ అడ్డుకోండి
X

కోర్టులు నిజానిజాలు నిర్ధారించి వేయాల్సిన శిక్షలను ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథే అమలు చేస్తున్న తీరుపై జాతీయ స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతున్నాయి. కోర్టులకు ప్రత్యామ్నాయ వ్యవస్థగా బుల్డోజర్‌ వ్యవస్థను తీసుకొచ్చారన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి.

ఈ పరిస్థితులపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో పాటు 12 మంది న్యాయ ప్రముఖులు భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణకు లేఖ రాశారు. తక్షణం జోక్యం చేసుకుని ఉత్తరప్రదేశ్‌లో బుల్డోజర్‌ నుంచి రాజ్యాంగాన్ని కాపాడాలని కోరారు. నిందితులు పోలీసులు కస్టడీలో ఉన్న సమయంలో వారి ఇళ్లపైకి బుల్డోజర్‌ను పంపడం చట్టాన్ని ఉల్లంఘించడమేనని, దీనిపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేయాలని ప్రముఖులు విజ్ఞప్తి చేశారు.

రాజ్యాంగాన్ని అవహేళన చేయడమే కాకుండా, మానవ హక్కులను కాల రాస్తుంటే చూస్తూ ఊరుకోవడం సరికాదన్నారు. కస్టడీలో లాఠీచార్జ్ చేయడం, నోటీసులు ఇవ్వకుండానే ఇళ్లు కూల్చివేయడం, అందులోనూ ముస్లిం వర్గానికి చెందిన నిరసనకారులనే లక్ష్యంగా చేసుకోవడం దేశ అంతరాత్మను కుదిపేస్తోందని ఆవేదన చెందారు. నిరసనకారులపై ఏకంగా జాతీయ భద్రతా చట్టం, యూపీ గ్యాంగ్ స్టర్స్‌ అండ్ యాంటీ సోషియల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్‌ యాక్ట్‌ను ప్రయోగించారని ఇది ఎంతమాత్రం సమంజసం కాదని వారు అభిప్రాయపడ్డారు.

నిరసన తెలిపే వారికి ప్రభుత్వ చర్యలు ఒక గుణపాఠంగా ఉండిపోవాలని, భవిష్యత్తులో మరోసారి నిరసన తెలపాలంటే భయపడేలా చర్యలుండాలని ముఖ్యమంత్రే స్వయంగా చెప్పారని దాంతో పోలీసులు మరింత రెచ్చిపోతున్నారని లేఖలో ప్రస్తావించారు. ప్రభుత్వ యంత్రాంగమే ఈస్థాయిలో క్రూరంగా వ్యవహరిస్తే ఇక న్యాయబద్ద పాలన, పౌర హక్కుల పరిరక్షణ ఎలా సాధ్యమవుతుందని న్యాయప్రముఖులు లేఖలో ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టే జోక్యం చేసుకుని ప్రజల హక్కులకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. లేఖ రాసిన వారిలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ సుదర్శన్ రెడ్డి, వి. గోపాలగౌడ, ఏకే గంగూలీతో పాటు పలు హైకోర్టుల మాజీ న్యాయమూర్తులూ ఉన్నారు.

First Published:  14 Jun 2022 9:05 PM GMT
Next Story