Telugu Global
National

అసత్య వార్తలతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్న కొన్ని మీడియా సంస్థలు

ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడంలో కొందరు జర్నలిస్టులు, కొన్ని మీడియా సంస్థలు కూడా మత సంస్థలతో పోటీ పడుతుండటం ఆందోళనకలిగించే అంశం. గతంలో కొన్ని జాతీయ ఛానళ్ళు జేఎన్ యూ లో విద్యార్థులపై అసత్యాలు ప్రచారం చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. అనేక చోట్ల‌ మత ఘర్షణలు జరిగినప్పుడల్లా కొన్ని ఛానళ్ళు వక్రీకరణలతో వార్తలు ప్రసారం చేయడం అలవాటుగా చేసుకున్నాయి. కొన్ని ప్రాంతీయ ఛానళ్ళు కూడా అదే బాటలో నడుస్తున్నాయి. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నాయి. తాజాగా […]

Fake News
X

ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడంలో కొందరు జర్నలిస్టులు, కొన్ని మీడియా సంస్థలు కూడా మత సంస్థలతో పోటీ పడుతుండటం ఆందోళనకలిగించే అంశం. గతంలో కొన్ని జాతీయ ఛానళ్ళు జేఎన్ యూ లో విద్యార్థులపై అసత్యాలు ప్రచారం చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. అనేక చోట్ల‌ మత ఘర్షణలు జరిగినప్పుడల్లా కొన్ని ఛానళ్ళు వక్రీకరణలతో వార్తలు ప్రసారం చేయడం అలవాటుగా చేసుకున్నాయి. కొన్ని ప్రాంతీయ ఛానళ్ళు కూడా అదే బాటలో నడుస్తున్నాయి. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నాయి. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ ఛానల్ ఇలాంటి ఓ ఫేక్ న్యూస్ ను ప్రసారం చేసి కలకలం సృష్టించింది.

ఈ మధ్య కర్నాటకలో హిజబ్ అంశం ఎంత వివాదం సృష్టించిందో మర్చిపోలేము. ఇప్పటికీ హిజబ్ మంటలు ఇంకా ఆరనేలేదు. ముస్లిం విద్యార్థులు హిజబ్ ధరించడానికి వ్యతిరేకంగా కాషాయ కండువాలు ధరించి వేలాది మంది విద్యార్థులు చేసిన రచ్చ చూసి ఉన్నాం. ఇప్పుడు బెంగుళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (BMTC)లో అలాంటిదే జరుగుతోందంటూ ఓ ఛానల్ వార్తలు ప్రసారం చేసింది. ముస్లిం ఉద్యోగులు తలపై టోపీలు పెట్టుకోవడానికి నిరసనగా హిందూ ఉద్యోగులు మెడపై కాషాయ కండువాలు వేసుకొన్నారని ఆ ఛానల్ చెప్పింది. కొంత మంది ముస్లిం సహోద్యోగులపై హిందూ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారని ఆ చానల్ వార్తలు ప్రసారం చేసింది. అయితే ఆ వార్త పచ్చి అబద్దమని BMTC యాజమాన్యం, కార్మిక సంఘాలు తేల్చి చెప్పాయి. ఫేక్ న్యూస్ ప్రసారం చేసి తమ మధ్య విద్వేశాలు రెచ్చగొట్టవద్దని KSRTC స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ హెచ్‌వి అనంత సుబ్బారావు హెచ్చరించారు.

BMTC అధికారి ఒకరు మాట్లాడుతూ, “వారు సంబంధం లేని క్లిప్పింగ్‌లను చూపించారు. ముస్లిం ఉద్యోగులు క్యాప్‌లు ధరించడాన్ని వ్యతిరేకిస్తూ హిందూ ఉద్యోగులు కాషాయ కండువాలు ధరించారన్నది అస్సలు నిజం కాదు. వారు మాట్లాడిన డ్రైవర్ వద్ద‌ కాషాయ రంగు గుడ్డ ఉంది. ఆయన దానిని మొహం తుడుచుకోవడానికి వాడుతానని స్పష్టంగా చెప్పారు. కానీ ఆ ఛానల్ వాళ్ళు ఆయన మాటలు రికార్డ్ చేయకుండానే వెళ్ళిపోయారు. ఈ వార్త ఫేక్.” అని అన్నారు.

KSRTC స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ హెచ్‌వి అనంత సుబ్బారావు మాట్లాడుతూ, BMTCకి యూనిఫాం ఉంది, దాని డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది ఆ యూనిఫాం నే ధరించాలి. వారిలో కొందరు యూనిఫాంతో పాటు క్యాప్‌లను కూడా ధరిస్తారు. ఇది చాలా సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. ఈ సంఘటన గురించి మీడియాలో వచ్చిన కథనాలను చూశాము. అయితే రాష్ట్రంలో ఎక్కడా ఇలాంటి సంఘటన‌ జరిగినట్టు మా దృష్టికి రాలేదు. ఎవ్వరూ పిర్యాదు చేయలేదు.” అని చెప్పారు.

”కొంతమంది ముస్లింలు క్యాప్స్ ధరించే ఆచారం చాలాకాలంగా ఉంది. వారు ప్రార్థనలు కూడా చేస్తారు. అయితే దీని వల్ల ఎప్పుడూ ఎలాంటి సమస్యలు రాలేదు. ప్రతి డిపో కూడా గణేశ పండుగను జరుపుకుంటుంది, ఇక్కడ వారి మతంతో సంబంధం లేకుండా ఉద్యోగులందరూ పాల్గొంటారు. ఇక్కడ ఎన్నడూ మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తలేదు, ” అని ఆయన అన్నారు.

కొంతమంది హిందువులు తమ విశ్వాసాల కారణంగా కాషాయపు కండువా ధరించాలని కోరుకుంటే, అది వారి ప్రత్యేక హక్కు అని కూడా సుబ్బారావు అన్నారు. “కానీ వారు ప్రతీకార చర్యగా అలాంటి పనిచేయడం సరైంది కాదు. సాధారణంగా, ఈ రంగంలో చాలా మంది ముస్లింలు పనిచేస్తున్నారు. మేము ఎప్పుడూ మత విద్వేషాల‌ సమస్యను ఎదుర్కోలేదు. రవాణా విభాగం ఎల్లప్పుడూ చాలా శాంతియుతంగా సహజీవనం చేస్తుంది. ద్వేషపూరిత ప్రచారాన్ని మేము ఖండిస్తున్నాము, ”అన్నారాయన.

First Published:  14 Jun 2022 4:47 AM
Next Story