Telugu Global
National

నేషనల్ హెరాల్డ్ కేసు క‌థా క‌మామిషు ఏంటి?

నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను కలిగి ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రమోట్ చేసిన యంగ్ ఇండియన్‌లో ఆర్థిక అవకతవకలకు సంబంధించి ED సోనియాగాంధీ, రాహుల్‌గాంధీల‌తోపాటు మ‌రో ముగ్గురిపై కేసు న‌మోదైంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ)లోని క్రిమినల్ సెక్షన్ల కింద రాహుల్ గాంధీ, సోనియా గాంధీల వాంగ్మూలాలను నమోదు చేయాలని ఈడీ అధికారులు వారిద్ద‌రినీ విచారించ‌డానికి నోటీసులు జారీ చేశారు. దీనిపై దేశ‌వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు ఆందోళ‌న‌ల బాటప‌ట్టాయి. యంగ్ ఇండియన్ లిమిటెడ్ (వైఐఎల్) అసోసియేటెడ్ జర్నల్స్ […]

what-is-the-national-herald-case-and-why-has-the-ed-summoned-sonia-and-rahul-gandhi
X

నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను కలిగి ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రమోట్ చేసిన యంగ్ ఇండియన్‌లో ఆర్థిక అవకతవకలకు సంబంధించి ED సోనియాగాంధీ, రాహుల్‌గాంధీల‌తోపాటు మ‌రో ముగ్గురిపై కేసు న‌మోదైంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ)లోని క్రిమినల్ సెక్షన్ల కింద రాహుల్ గాంధీ, సోనియా గాంధీల వాంగ్మూలాలను నమోదు చేయాలని ఈడీ అధికారులు వారిద్ద‌రినీ విచారించ‌డానికి నోటీసులు జారీ చేశారు. దీనిపై దేశ‌వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు ఆందోళ‌న‌ల బాటప‌ట్టాయి.

యంగ్ ఇండియన్ లిమిటెడ్ (వైఐఎల్) అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కొనుగోలులో కాంగ్రెస్ నాయకులు మోసానికి పాల్ప‌డ్డార‌ని, షేర్ హోల్డ‌ర్ల న‌మ్మ‌కాన్ని ఉల్లంఘించారని ఆరోపిస్తూ, ఒక‌ప్ప‌టి జ‌న‌తా పార్టీ నేత ప్ర‌స్తుత భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు, న్యాయవాది సుబ్రమణ్యస్వామి ట్రయల్ కోర్టులో 2012లో ఒక ఫిర్యాదును దాఖలు చేశారు. నేషనల్ హెరాల్డ్ ఆస్తులను యంగ్ ఇండియ‌న్ లిమిటెడ్ (వైఐఎల్) దురుద్దేశపూర్వకంగా స్వాధీనం చేసుకున్నదన్న‌ది ఆయ‌న ఆరోప‌ణ‌.

నేషనల్ హెరాల్డ్ గురించి

స్వాతంత్య్ర ఉద్య‌మ కాలంలో అంటే, 1938లో నేష‌న‌ల్ హెరాల్డ్ ప‌త్రిక జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూచేత స్థాపించిన వార్తా ప‌త్రిక‌. ఇది భారత జాతీయ కాంగ్రెస్‌లోని ఉదారవాదుల‌ ఆందోళనలను దేశ‌వ్యాప్తంగా ప్ర‌చారం చేయ‌డానికి ఉద్దేశించబడింది. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) ద్వారా ప్రచురించబడిన ఈ వార్తాపత్రిక స్వాతంత్య్రం తర్వాత కాంగ్రెస్ పార్టీ మౌత్ పీస్ (అధికార ప‌త్రిక‌) అయింది. AJL నేష‌న‌ల్ హెరాల్డ్ (ఇంగ్లీష్‌లో)తో పాటు నవజీవన్‌(హిందీ), క్వామీ అవాజ్ (ఉర్దూ) భాష‌ల్లో మ‌రో రెండు వార్తాపత్రికలను కూడా ప్రచురించింది, 2008లో రూ.90 కోట్లకు పైగా అప్పుతో ఈ పేపర్ మూతపడింది.

అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) గురించి..

అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) జవహర్‌లాల్ నెహ్రూ ఆలోచన నుంచి పుట్టిన వార్తా సంస్థ. 1937లో, నెహ్రూ మ‌రో 5,000 మంది ఇతర స్వాతంత్య్ర సమరయోధులను వాటాదారులుగా చేర్చుకుని ఈ సంస్థను ప్రారంభించారు. ఈ కంపెనీ ప్రత్యేకంగా ఏ వ్యక్తికి చెందినది కాదు. 2010 నాటికి కంపెనీకి 1,057 మంది వాటాదారులు ఉన్నారు. కాలానుక్ర‌మంగా ఇది నష్టాలను చ‌విచూస్తూ వ‌చ్చింది. ఈ ప‌రిస్థితుల్లో దాని హోల్డింగ్స్ 2011లో యంగ్ ఇండియాకు బదిలీ చేశారు. AJL ఆధ్వ‌ర్యంలో 2008 వరకు నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను ఆంగ్లంలో, క్వామీ అవాజ్ ప‌త్రిక‌ను ఉర్దూలో, నవజీవన్‌ను హిందీలో ప్రచురించింది. జనవరి 21, 2016న ఈ మూడు దినపత్రికలను పునఃప్రారంభించాలని అసోసియేటెడ్ జ‌ర్న‌ల్స్ లిమిటెడ్ నిర్ణయించింది.

యంగ్ ఇండియా లిమిటెడ్ గురించి

యంగ్ ఇండియా లిమిటెడ్ 2010లో స్థాపించబడింది, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ దీనికి డైరెక్టర్‌గా ఉన్నారు. కంపెనీ షేర్లలో రాహుల్ గాంధీ, ఆయన తల్లి సోనియా 76 శాతం వాటాను కలిగి ఉండగా, మిగిలిన 24 శాతం కాంగ్రెస్ నేతలు మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్‌ల వద్ద ఉన్నాయి. కంపెనీకి ఎలాంటి వాణిజ్య కార్యకలాపాలు లేవని బైలాస్‌లో రాసుకున్నారు.

AJL వాటాదారుల ఆరోపణలు

YIL సంస్థ‌ AJLని స్వాధీనం చేసుకున్నప్పుడు తమకు ఎటువంటి నోటీసు ఇవ్వలేదని మాజీ న్యాయ మంత్రి శాంతి భూషణ్, అలహాబాద్, మద్రాస్ హైకోర్టుల మాజీ ప్రధాన న్యాయమూర్తి మార్కండేయ కట్జూతో సహా చాలా మంది వాటాదారులు ఆరోపించారు. త‌మ తండ్రుల ద్వారా సంక్ర‌మించిన వాటాలను 2010లో ఎలాంటి స‌మ్మ‌తి లేకుండానే AJLకి బదిలీ చేశార‌ని ఆరోపించారు.

నేషనల్ హెరాల్డ్ కేసులో సుబ్రమణ్యస్వామి ఎవరి పేరు పెట్టారు?

సుబ్ర‌మ‌ణ్య స్వామి నేషనల్ హెరాల్డ్ కేసులో, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, జర్నలిస్టు సుమన్ దూబే, టెక్నోక్రాట్ శామ్ పిట్రోడా పేర్లును నిందితులుగా పెట్టారు.

నేషనల్ హెరాల్డ్ కేసు..

2,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన ఆస్తులను, లాభాన్ని పొందేందుకు చ‌ట్ట‌విరుద్ధ‌మైన‌ పద్ధతిలో YIL కైవసం చేసుకుందని సుబ్రమణియన్ స్వామి ట్ర‌య‌ల్ కోర్టులో ఫిర్యాదు చేశారు. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్( AJL) కాంగ్రెస్ పార్టీకి బకాయిపడిన రూ. 90.25 కోట్లను తిరిగి పొందేందుకు యంగ్ ఇండియా లిమిటెడ్(YIL) కేవలం రూ.50 లక్షలు చెల్లించిందని స్వామి ఆరోపించారు; వార్తాపత్రికను ప్రారంభించడానికి ముందు ఆ మొత్తాన్ని అసోసియేటెడ్ జ‌ర్న‌ల్స్ లిమిటెడ్‌కు రుణంగా అందించార‌ని, ఆ రుణం కూడా కాంగ్రెస్ పార్టీ నిధుల నుంచి చట్టవిరుద్ధంగా ఇచ్చిందేన‌ని కూడా ఆరోపించారు.

ఈడీ ద‌ర్యాప్తు షురూ..

2014లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈ కేసులో మనీలాండరింగ్ జరిగిందా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించింది. 18 సెప్టెంబర్ 2015న నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తన దర్యాప్తును తిరిగి ప్రారంభించింది.

ఆరోపణలపై కాంగ్రెస్‌ స్పందన

వైఐఎల్ లాభాపేక్షతో కాకుండా “ధార్మిక లక్ష్యంతో” సృష్టించబడిందని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఇది కంపెనీ షేర్లను బదిలీ చేయడం వెనుక ఎలాంటి లాభాపేక్ష లేదు కాబ‌ట్టి, ఈ బ‌దిలీ ప్ర‌క్రియ టెక్నిక‌ల్‌గా మాత్ర‌మే వాణిజ్య లావాదేవీ అని, ఈ లావాదేవీలో “అక్రమం” లేదని కూడా పేర్కొంది. ఇది రాజకీయ ప్రేరేపిత ఫిర్యాదు మాత్ర‌మే అని, సుబ్ర‌మ‌ణ్య‌ స్వామి దాఖలు చేసిన ఫిర్యాదుపై అభ్యంతరాలను కూడా లేవనెత్తింది.

కోర్టుల్లో నేషనల్ హెరాల్డ్ కేసు..

డిసెంబరు 19, 2015న ట్రయల్ కోర్టు ఈ కేసులో సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు బెయిల్ మంజూరు చేసింది. 2016లో, ఈ కేసులోని ఐదుగురు నిందితులకు (సోనియా, రాహుల్‌గాంధీలు, మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దూబే) సుప్రీంకోర్టు మినహాయింపు ఇచ్చింది. ఈ కేసు విచార‌ణ వేగ‌వంతం చేసేలా ట్ర‌య‌ల్‌కోర్టుకు ఆదేశాలు ఇవ్వ‌డానికి హైకోర్టును ఆశ్ర‌యించ‌మ‌ని కూడా సుప్రీంకోర్టు సుబ్ర‌మ‌ణ్య‌స్వామికి సూచించింది. సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన ప్రైవేట్ క్రిమినల్ ఫిర్యాదు ఆధారంగా యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ఆదాయపు పన్ను శాఖ విచారణను ఇక్కడి ట్రయల్ కోర్టు స్వీకరించిన తర్వాత పీఎంఎల్‌ఏ క్రిమినల్ నిబంధనల ప్రకారం ఏజెన్సీ తాజా కేసు నమోదు చేసింది.

రాహుల్ సోనియాల‌కు నోటీసులు

నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో జూన్ 13న విచారణకు హాజరు కావాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా సమన్లు ​​జారీ చేసింది. ఇంత‌కుముందు నోటీసుల్లో జూన్ 2న సెంట్రల్ ఢిల్లీలోని ఫెడరల్ ఏజెన్సీ ప్రధాన కార్యాలయంలో హాజరు కావాలని హాజ‌రుకావాల‌ని 51 ఏళ్ల రాహుల్ గాంధీని ఈడీ అధికారులు కోరారు. అతను దేశం వెలుపల ఉన్నందున జూన్ 13వ‌ తేదీ హాజ‌ర‌వుతాన‌ని చెప్పారు. అయితే సోనియా గాంధీని ఈ కేసులో జూన్ 8న ప్ర‌శ్నించాల్సి ఉండ‌గా, కోవిడ్ సంబంధిత కార‌ణాల‌తో ఆమె ఆస్ప‌త్రిలో చేర‌డంతో వీలు కాలేదు. విచారణలో భాగంగా ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, పవన్ బన్సాల్‌లను కూడా ఈడీ అధికారులు ప్రశ్నించింది. అయితే ఇవ‌న్నీ రాజ‌కీయ వేధింపుల్లో భాగంగానే జ‌రుగుతున్నాయ‌ని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.

ఇలాంటి బూటకపు, కల్పిత కేసులు నమోదు చేయడం ద్వారా వారు తమ పిరికిపంద కుట్రలో విజయం సాధించలేరని మోదీ ప్రభుత్వం తెలుసుకోవాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి అభిషేక్ మను సింఘ్వీ మీడియాతో చెప్పారు.

First Published:  13 Jun 2022 4:44 AM GMT
Next Story