Telugu Global
National

సత్యాగ్రహాలు, నిరసనల మధ్య ఈడీ ఎదుట హాజరైన రాహుల్ గాంధీ

అనుకున్న ముహూర్తం రానే వచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోమవారం ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి చేరుకొని అధికారుల ఎదుట హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో పార్టీ నేతలతో పాటు సోదరి ప్రియాంక గాంధీ కూడా ఆయన వెంట ఉన్నారు. మా నేతను అధికారులు ప్రశ్నిస్తుంటే మేం ఊరికే కూర్చోవాలా అన్నట్టు భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు ఈడీ ఆఫీసు ఎదుట ధర్నాకు కూర్చున్నారు. ఇక దేశవ్యాప్తంగా సత్యాగ్రహాలు, నిరసనలు సరేసరి ! హస్తినలో […]

congress-leader-rahul-gandhi-appears-before-ed-in-
X

అనుకున్న ముహూర్తం రానే వచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోమవారం ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి చేరుకొని అధికారుల ఎదుట హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో పార్టీ నేతలతో పాటు సోదరి ప్రియాంక గాంధీ కూడా ఆయన వెంట ఉన్నారు. మా నేతను అధికారులు ప్రశ్నిస్తుంటే మేం ఊరికే కూర్చోవాలా అన్నట్టు భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు ఈడీ ఆఫీసు ఎదుట ధర్నాకు కూర్చున్నారు.

ఇక దేశవ్యాప్తంగా సత్యాగ్రహాలు, నిరసనలు సరేసరి ! హస్తినలో జరిగిన సత్యాగ్రహ మార్చ్ లో పి.చిదంబరం, దిగ్విజయ్ సింగ్, భూపేష్ బాఘేల్, అశోక్ గెహ్లాట్ వంటి పలువురు సీనియర్ నేతలు కూడా పాల్గొని స్వామిభక్తిని చాటుకున్నారు.

నగరంలో అనేక చోట్ల ‘సత్యమేవ జయతే’ అని రాసి ఉన్న స్లోగన్ తో బాటు భారీ రాహుల్ గాంధీ కటౌట్లు, పోస్టర్లు దర్శనమిచ్చాయి. అసలు ఇదీ ఒక కేసేనా ? ప్రధాని మోడీ ప్రభుత్వం మా పార్టీపై చేపట్టిన కక్ష సాధింపు చర్య గాక మరేమిటి అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా రుసరుసలాడారు. పోలీసుల అనుమతి లేకున్నా వందల సంఖ్యలో మా పార్టీ కార్యకర్తలు మార్చ్ ని కొనసాగిస్తారని, నిరసన తెలియజేస్తారని ఆయన అన్నారు. అయితే ఇదంతా ‘ఫేక్ సత్యాగ్రహమని’ బీజేపీ కొట్టిపారేసిందనుకోండి !

ఇక రజిని పటేల్, అఖిలేష్ ప్రసాద్ సింగ్, ఎల్.హనుమంతయ్య, తిరునావురక్కరసు వంటి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని మందిర్ మార్గ్ పోలీసు స్టేషన్ కి తరలించారు. కానీ, ఈ అరెస్టులకు భయపడేది లేదని వీరంతా ధీమాగా చెబుతున్నారు. దేశంలో ఈ రోజు ఏం జరుగుతోందో దానికి మేం నిరసన తెలియజేస్తున్నాం..

హింసను సహించేది లేదని ప్రధాని మోడీ దేశానికి ఓ సందేశాన్ని ఇవ్వాల్సిన తరుణమిదే అని కాంగ్రెస్ నేత, రాజస్థాన్ సీఎం కూడా అయిన అశోక్ గెహ్లాట్ అన్నారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా అరెస్టు అవుతున్నారని ఆయన చెప్పారు.

బుల్డోజర్లేవీ ? కార్తీ చిదంబరం సెటైర్

తమ నేత రాహుల్ గాంధీ పట్ల సంఘీభావం తెలిపేందుకు తామంతా ఢిల్లీకి చేరుకున్నామని, ఈడీని ఈ ప్రభుత్వం ఎలా దుర్వినియోగం చేస్తోందో ప్రజలకు వివరిస్తామని చిదంబరం కుమారుడు, కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం అన్నారు. ఈడీ కేసులన్నీ బోగస్ అని ఆయన కొట్టి పారేశారు. (తనమీద ఈ సంస్థ పెట్టిన కేసులు కూడా ఉన్నాయి మరి!) తనకూ చాలాసార్లు ఈడీ నోటీసులు వచ్చాయని, ఈ కేసుల విషయంలో తాను ఎక్స్ పర్ట్ నని ఆయన సెటైర్ వేశారు. అంతే కాదు ! కాంగ్రెస్ కార్యకర్తలను చెదరగొట్టేందుకు ఇక్కడ ‘బుల్డోజర్లు మిస్సయ్యాయని’ ఆయన వ్యాఖ్యానించారు.

నగరంలో పోలీసులు బ్యారికేడ్లను మాత్రమే పెట్టారని, కానీ ఇవి మిస్సయ్యాయని బీజేపీని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మైనారిటీ వర్గాల జీవితాలను, వారి ఇళ్లను కూల్చివేసేందుకు బహుశా బుల్డోజర్లను వినియోగిస్తున్నారని కార్తీ చిదంబరం పేర్కొన్నారు. యూపీలోని ప్రయాగ్ రాజ్ లో అల్లర్ల సూత్రధారుల ఇళ్లను యూపీ ప్రభుత్వం బుల్డోజర్లతో కూల్చివేసిన ఉదంతాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించినట్టు కనబడుతోంది.

First Published:  13 Jun 2022 2:00 AM GMT
Next Story