Telugu Global
NEWS

‘ నా జీవితాన్ని నాశనం చేశారు’.. డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ ఆక్రోశం

డ్రగ్స్ కేసులో తనను అరెస్టు చేసి తన జీవితాన్ని నాశనం చేశారంటూ బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్.. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వద్ద వాపోయాడు. తనపై ఇంత అపవాదు అవసరమా అని ఆక్రోశించాడట. డ్రగ్స్ కేసుకు సంబంధించి ముంబై లోని ఓ క్రూజ్ షిప్ లో గత ఏడాది అక్టోబరులో ఆర్యన్ ఖాన్ సహా మరికొంతమందిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. దర్యాప్తు నేపథ్యంలో ఖాన్ సుమారు నెల రోజులపాటు […]

aryan-khan
X

డ్రగ్స్ కేసులో తనను అరెస్టు చేసి తన జీవితాన్ని నాశనం చేశారంటూ బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్.. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వద్ద వాపోయాడు. తనపై ఇంత అపవాదు అవసరమా అని ఆక్రోశించాడట. డ్రగ్స్ కేసుకు సంబంధించి ముంబై లోని ఓ క్రూజ్ షిప్ లో గత ఏడాది అక్టోబరులో ఆర్యన్ ఖాన్ సహా మరికొంతమందిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. దర్యాప్తు నేపథ్యంలో ఖాన్ సుమారు నెల రోజులపాటు అధికారుల కస్టడీలో ఉన్నాడు. చివరకు జైలు నుంచి బెయిలుపై బయటపడ్డాడు. నిందితులకు సంబంధించి ఛార్జి షీట్ లో ఇతని పేరు లేదంటూ గత నెలలోనే ఇతనికి ఎన్సీబీ క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే ఈ వ్యవహారంలో చాలావరకు మౌనంగా ఉన్న ఆర్యన్ ఖాన్.. తన కస్టడీ సమయంలో ఉద్వేగంగా కనిపించాడని ,మలి దశలో ఇన్వెస్టిగేట్ చేసిన ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ (ఆపరేషన్స్) సంజయ్ సింగ్ తెలిపారు. ఈయన ఆధ్వర్యంలో ప్రభుత్వం నాడు ‘సిట్’ ను ఏర్పాటు చేసింది. తనను ఈ సంస్థ ‘అంతర్జాతీయ డ్రగ్ ట్రాఫికర్’ గా పరిగణిస్తోందని, అసలు తన వద్ద ఎలాంటి మాదకద్రవ్యాలను అధికారులు కనుగొనలేదని, కానీ అరెస్టు చేశారని ఆర్యన్ ఖాన్ విలపించినట్టు సంజయ్ సింగ్ చెప్పారు. నా వద్ద ఏ విధమైన ఆధారాలు లభించకపోయినప్పటికీ చాలాకాలం పాటు జైల్లో ఉండాల్సి వచ్చిందని, ఈ శిక్షకు నేను అర్హుడినా అని ప్రశ్నించాడని ఆయన వెల్లడించారు. నా ప్రతిష్టను మంట గలిపారు.. ఎన్నో వారాల పాటు జైల్లో ఉన్నాను.. ఇంత వ్యవహారం అవసరమా అని అతడు వాపోయాడని ఆయన చెప్పారు. తనను, తన సహచరులను సమాజాన్ని నాశనం చేసే పెద్ద క్రిమినల్స్ గానో, రాక్షసులు గానో చిత్రీకరించారని, ప్రతిరోజు తాము నరకం అనుభవించామని ఆర్యన్ ఖాన్ కళ్లనీళ్లు పెట్టుకున్నంత పని చేశారని సంజయ్ సింగ్ పేర్కొన్నారు.

ఆర్యన్ ఖాన్ అరెస్టు నిర్ణయం ఏ ఒక్కరిదో కాదట

డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ ను అరెస్టు చేయాలని తీసుకున్న నిర్ణయం ఏ ఒక్కరిదో కాదని, ఈ అంశంలో నాటి దర్యాప్తు అధికారి సమీర్ వాంఖడే ఒక్కరే కాకుండా ఇతర అధికారులుకూడా ఇందుకు ఏకీభవించారని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వర్గాలు తాజాగా తెలిపాయి. కానీ వాంఖడేను ఒక్కరినే వేలెత్తి చూపి చెన్నైకి ఐ ఆర్ ఎస్ అధికారిగా బదిలీ చేశారని ఈ వర్గాలు వివరించాయి. ఈ కేసు దర్యాప్తులో ఎన్నో అవకతవకలకు ఈయన బాధ్యుడంటూ ఇలా చర్య తీసుకున్నారని, కొందరు పెద్ద ‘తలకాయల’ హస్తం ఇందులో ఉందని ఈ వర్గాలు పేర్కొన్నాయి. ఆర్యన్ ఖాన్ జీవితం నాశనం కావడానికి వాంఖడే ఒక్కడే కారణం కాదన్నట్టు స్పష్టం చేశాయి. ఓ వర్గం మీడియా వాంఖడేను బలిపశువును చేసిందని ఇవి అభిప్రాయపడ్డాయి. ఆర్యన్ అరెస్టుకు నెల రోజుల ముందు ..ఇన్వెస్టిగేషన్లల్లో ప్రతిభ చూపినందుకు సమీర్ వాంఖడేకి కేంద్ర మంత్రి అవార్డు కూడా లభించిందని తన పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి తెలిపారు.ప్రజలు ఇప్పటికైనా వాస్తవాలు గ్రహిస్తారని ఆశిస్తున్నానని ఆయన పేర్కొన్నాడు.

First Published:  11 Jun 2022 2:29 AM GMT
Next Story