Telugu Global
National

బీజేపీకి ప్రత్యామ్నాయ ఎజండా@ తెలంగాణ

”ఎప్పుడూ శత్రువును ఉత్కంఠకు గురి చెయ్యండి. తప్పుదోవ పట్టించండి.ఆశ్యర్యపరచండి.అలాంటి యుక్తులు ప్రతిసారీ విజయాన్ని కలిగిస్తాయి.ఆ విధంగా ఒక చిన్నసైన్యం పెద్ద పెద్ద సేనను ఓడించి మట్టి కరిపించగలదు”.అని 1824-1863 కాలానికి చెందిన యుద్ధనిపుణుడు జనరల్ స్టోన్ వాల్ జాక్సన్ అన్నాడు.సరిగ్గా అలాంటి వ్యూహమే తెలంగాణ నిర్మాత కేసీఆర్ అనుసరిస్తున్నారు.ఆయన మదిలో మెదిలిన ‘జాతీయ పార్టీ’ అందులో భాగమే. జాతీయపార్టీ పెడితే లాభమా, నష్టమా? రాజకీయంగా ఎలాంటి పర్యవసానాలు ఉంటాయన్న చర్చ వేరు. కానీ సిద్ధిపేట నమూనాను తెలంగాణ […]

alternative-agenda-for-bjp-telangana-state
X

”ఎప్పుడూ శత్రువును ఉత్కంఠకు గురి చెయ్యండి. తప్పుదోవ పట్టించండి.ఆశ్యర్యపరచండి.అలాంటి యుక్తులు ప్రతిసారీ విజయాన్ని కలిగిస్తాయి.ఆ విధంగా ఒక చిన్నసైన్యం పెద్ద పెద్ద సేనను ఓడించి మట్టి కరిపించగలదు”.అని 1824-1863 కాలానికి చెందిన యుద్ధనిపుణుడు జనరల్ స్టోన్ వాల్ జాక్సన్ అన్నాడు.సరిగ్గా అలాంటి వ్యూహమే తెలంగాణ నిర్మాత కేసీఆర్ అనుసరిస్తున్నారు.ఆయన మదిలో మెదిలిన ‘జాతీయ పార్టీ’ అందులో భాగమే. జాతీయపార్టీ పెడితే లాభమా, నష్టమా? రాజకీయంగా ఎలాంటి పర్యవసానాలు ఉంటాయన్న చర్చ వేరు. కానీ సిద్ధిపేట నమూనాను తెలంగాణ మొత్తానికి వర్తింపజేయగలిగినపుడు,తెలంగాణ నమూనాను యావద్దేశానికి ఎందుకు వర్తింప జేయలేమన్న ఆలోచన నుంచి జాతీయ పార్టీ ఆవిర్భవించి ఉండవచ్చు.

నిజానికి దేశంలో ఇవాళ సుప్రసిద్ధ రాజకీయ వేత్తలుగా చెలామణిలో ఉన్న హేమాహేమీలు ఎంత మంది ఉన్నా ‘విజన్’ ఉన్నవాళ్ళు అతి తక్కువ.కనుక ఆ గ్యాప్ కేసీఆర్ కు కలిసి రావచ్చు. వ్యవసాయం, సాగునీరు, విద్యుత్తు.. వంటి కీలకమైన రంగాలపైన ముఖ్యమంత్రి కేసీఆర్ కున్న సాధికారత మరొకరికి లేదు.అయితే ఒక రాష్ట్రంలో ‘మెరుపులు’ మెరిపించినంత సులభంగా దేశానికి దిశా నిర్దేశం ఇవ్వడం కుదురుతుందా? ఆయన వెంట కలిసి నడిచేవారెవరు?నడవని వారెవరు?అవరోధాలు ఏమిటి? అనే సందేహాలు సహజం.ఈ సందేహాలకు సమాధానం కొద్దిరోజుల్లోనే లభించవచ్చు.యుద్ధంలో గెలుపోటములు ముఖ్యమా కాదు,పోరాడామా లేదా అన్నదే ముఖ్యం.కేసీఆర్ అదే పాలసీతో ముందుకు వెడుతున్నట్టు అర్ధమవుతోంది.బీజేపీతో కేసీఆర్ తలపడాలనుకుంటున్నారు.కనుక సంకల్ప బలం అవసరం.అది ఆయనకు పుష్కలంగా ఉన్నది.జాతీయ స్థాయిలో రాజకీయ శూన్యత నెలకొని ఉన్న మాట నిజం.కాంగ్రెస్ బలహీనపడిపోవడం ఇందుకు ప్రధాన కారణమన్నది ప్రత్యేకంగా చెప్పవలసినదేమీ లేదు.కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్,ఛత్తీస్ గఢ్ లకు పరిమితమైంది.మహారాష్ట్రలో ‘మహా వికాస్ అఘాడీ’ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నది.కాంగ్రెస్ కు ఆమ్ ఆద్మీ పార్టీకి తేడా ఏమిటి? ఆప్ కూడా ఢిల్లీ,పంజాబ్ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది.

కేసీఆర్ అనాలోచితంగా ‘జాతీయ పార్టీ’ గురించి నిర్ణయం తీసుకుంటున్నట్టు అనుకోవడం అమాయకత్వం కాగలదు.ఆయనకు ‘రాజనీతి’,’యుద్ధనీతి’లోనూ అపారమైన నైపుణ్యం ఉన్నది.అవి ఎత్తులు కావచ్చు,జిత్తులు కావచ్చు.ప్రజలకు కావలసింది మ్యాజిక్కే. లాజిక్కు కాదు.అలా అని ఆయన జాతీయరాజకీయాల్లో ‘మ్యాజిక్’ చేయడానికి మాత్రమే క్రియాశీల పాత్ర పోషించబోవడం లేదు.జాతీయ స్థాయి రాజకీయాల్లో ‘శూన్యత’ ను భర్తీ చేయడం మ్యాజిక్ తో సాధ్యం కాదు.లాజిక్ కావాలి.అందుకు అవసరమైన ‘తంత్రం’ కావాలి.ఆప్ ఢిల్లీ నుంచి పంజాబ్ కు విస్తరించింది.క్రమంగా ఇతర రాష్ట్రాలకు పాకాలన్నది కేజ్రీవాల్ ప్రణాళిక.కేసీఆర్ స్టైలు అందుకు పూర్తి విరుద్ధం.ఆయన నేరుగా కొండను ఢీ కొనే పనిలో తలమునకలై ఉన్నారు.కేంద్రంలో ఒకరిని గద్దె దింపి,మరొకరిని గద్దె నెక్కించే పథకాలకు కేసీఆర్ వ్యతిరేకం.ఈ విషయాన్ని ఆయన లెఫ్ట్ పార్టీల నాయకులకు ముఖమ్మీదే చెప్పేశారు.

అయితే తెలంగాణను విడిచిపెట్టి ఢిల్లీతో సమరం చేయడం ‘నేల విడిచి సాము’చెయ్యడం వంటిదని చాలామందిలో ఒక అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఈ అభిప్రాయానికి మూలం.. తెలంగాణలో 2023 లో గట్టెక్కడం కష్టమేమో! అనే విశ్లేషణలు.తెలంగాణ ఆయన ‘హోమ్ గ్రౌండ్’. దానిని ఆయన విడిచి పెడతానని చెప్పడం లేదు.విడిచిపెట్టే అవకాశాలూ లేవు.టిఆర్ఎస్ లో కేసీఆర్ కు ప్రత్యామ్నాయం కేసీఆరే! అందువల్ల ఆయన ఎంతో ముందుచూపుతోనే ‘జాతీయ’ మైదానాన్ని ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది.బీజేపీయేతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఈ.డి,సీబీఐ తదితర సంస్థల దాడులు, ప్రత్యర్థులపై తప్పుడు కేసులు,కేంద్ర రాష్ట్రాల మధ్య సమాఖ్య స్ఫూర్తిని చావుదెబ్బ తీస్తుండడం వంటి అంశాలపై మొట్ట మొదట ‘కత్తి దూసిన’ నాయకుడు కేసీఆర్.

బీజేపీకి వ్యతిరేక పక్షాలుగా మనకు కనిపిస్తున్న పార్టీలన్నీ నిజంగా ‘వ్యతిరేక’మైనవి కావు.అనేక కారణాలతో ఆ పార్టీలు అట్లా వ్యవహరిస్తున్నవి.ఒడిశాలో నవీన్ పట్నాయక్ వంటి వారంతా ‘గోడ మీద పిల్లి’వాటం ముఖ్యమంత్రులే! మరి కొందరు ‘తటస్థం’ గా ఉన్నట్టు చెప్పుకుంటారు.అదొక ‘ముసుగు’.ఈ ప్రపంచంలో తటస్థమన్నది బూటకం.ఏదో ఒక ‘శిబిరం’ వైపునకు మొగ్గుజూపడం తప్ప న్యూట్రల్ ఉండదు.ప్రస్తుతం బీజేపీతో ముఖాముఖి తలపడుతున్న వాళ్లలో తమిళనాడు,తెలంగాణ,బెంగాల్ ముఖ్యమంత్రులు స్టాలిన్,కేసీఆర్,మమతా బెనర్జీ ముందు వరుసలో ఉన్నారు.

కాగా రాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణ,ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్,జగన్ వైఖరి తూర్పు – పడమర వలె ఉన్నది.రాష్ట్రపతి ఎన్నికలో రెండు తెలుగు రాష్ట్రాలు కీలకం కావడంతో అందరి దృష్టి ఇటు వైపే పడింది.ఇదివరకు రాష్ట్రపతి ఎన్నికలో రామనాధ్ కోవింద్ కు టిఆర్ఎస్ మద్దతు తెలిపింది.అయితే ఆ పరిస్థితి ప్రస్తుతం లేదు.బీజేపీ,టిఆర్ఎస్ ఉప్పు,నిప్పులా ఉన్నవి.కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ సమర శంఖం పూరించి చాలాకాలమయ్యింది.అయితే జగన్ మాత్రం బీజేపీ అభ్యర్థికి మద్దతివ్వడం తధ్యమని వార్తలందుతున్నవి. భార‌త రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్ధిగా ఎవ‌రిని బ‌రిలో దింపాల‌నే విష‌యంలో వివిధ రాజకీయ పార్టీలతో చ‌ర్చించ‌డం,వారి మ‌నోగ‌తం తెలుసుకునే బాధ్య‌త‌ను రాజ్య‌స‌భ‌ విప‌క్ష నాయకుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గేకు సోనియా అప్ప‌గించారు.

ఎన్డీయేత‌ర‌, యూపీయేత‌ర ప‌క్షాలతోనూ మంత‌నాలు జ‌రపాల‌ని ఖ‌ర్గేను సోనియా ఆదేశించారు.బిజెపియేతర నాయకులతో చ‌ర్చించే ప్రక్రియను మల్లికార్జున ఖర్గే ప్రారంభించారు. ఈ ప్రక్రియను ‘కేసీఆర్ చక్రానికి సోనియా అడ్డు’ అంటూ ఒక దినపత్రిక శనివారం ఒక కథనాన్ని వండి వార్చింది.ఈ కథనం కేసీఆర్ కు నెగెటివ్ అనుకుంటే పొరబాటే! ఆ వార్తే నిజమైతే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో సక్సెస్ అయినట్లే.కేసీఆర్ కన్నా ముందే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ‘ప్రతిపక్షాల ఉమ్మడి’ అభ్యర్థిని అన్వేషిస్తున్నారంటే ఎట్లా అర్ధం చేసుకోవాలి!

ఇదిలా ఉండగా కేసీఆర్ బీజేపీకి దూరం కావడంతో ఎపి ముఖ్యమంత్రి జగన్ బీజేపీకి దగ్గరవుతున్నారు. జగన్ ఇటీవలి కాలంలో పలుమార్లు ఢిల్లీ పర్యటనలు చేశారు.ప్రధాని మోడీ,అమిత్ షా, కేంద్రమంత్రులతో సమావేశాలు జరుపుతూ వస్తున్నారు.రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతు తెలియజేయాలని ప్రధాని మోడీ జగన్ ను కోరారు.అందుకు ఏపీ ముఖ్యమంత్రి కొన్ని షరతులు పెట్టినట్టు సమాచారం అందుతోంది. చాలాకాలంగా పెండింగులో ఉన్న పోలవరం ప్రాజెక్టు, విభజన హామీలు, ఆర్థిక లోటుతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రానికి చేయూత అందించాలని జగన్ కేంద్రాన్ని కోరారు.ఏపీ రాజధాని నిర్మాణంలోనూ కేంద్రం ఆర్థిక సాయం అందించాలని ఆయన కోరారు.జగన్ షరతులను బీజేపీ అగ్రనాయకత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది.

బీజేపీ అభ్యర్థికి పోటీగా ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని నిలబెడితే బీజేపీకి ఇబ్బందికరమే! బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బీజేపీకి దూరంగా ఉంటున్నారు.రాజకీయాలలో ఎవరు ఎప్పుడు మిత్రులు అవుతారో ఎప్పుడు శత్రువులు అవుతారో తెలియదు. ఈసమయంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ కీలకంగా మారారు. ప్రాంతీయ పార్టీలు తమ ప్రయోజనాల నేపథ్యంలోనే ఇతర పార్టీలకు ప్రత్యక్షంగా లేదా
పరోక్షంగా మద్దతు ఇస్తుంటాయి.పార్లమెంట్ ఉభయ సభలలో బీజేపీకి పూర్తి బలం ఉన్నది.కానీ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎమ్మెల్యేల ఓట్లు కీలకం.

2017 లో రాంనాథ్ కొవింద్ ఎన్నిక వేళ టిఆర్ఎస్, శివసేన,ఆప్, అకాలీదళ్ పార్టీలు మద్దతు తెలిపినందున ఆయన ఎన్నికకు అడ్డంకులు ఏర్పడలేదు.వివిధ కారణాలతో టిఆర్ఎస్,అకాలీదళ్,ఆప్ పార్టీలు బీజేపీకి దూరం అయ్యాయి.కనుక ఆ పార్టీలు రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతు తెలిపే అవకాశం లేదు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రపతి అభ్యర్థి గురించి ఊహాగానాలు మినహా ప్రధాని మోడీ మనసులో మాట బయటపెట్టడం లేదు. కేసీఆర్‌ ఏమి ఆలోచిస్తున్నారు?ఎలాంటి మ్యాజిక్‌ చేయబోతున్నారు? వంటి ప్రశ్నలకు ఆయనే జవాబు చెప్పాలి.ఎన్నికలకు గైరుహాజరు అయినా అంతిమంగా బీజేపీని సమర్ధించినట్లే అవుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ ఇప్పటికే చెప్పేశారు.

కాగా ”త్వరలో సంచలనం ఖాయం” అని ఢిల్లీ,బెంగళూరులో రెండు సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.ఆయన మనసులోని ‘సంచలనం’గురించి చాలా ఉహాగానాలున్నవి.అయితే ‘జాతీయపార్టీ’ ప్రకటనతో ఆ ఊహాగానాలకు తెరపడవచ్చును.కేసీఆర్ జాతీయపార్టీ సక్సెస్ కావడం కష్టమే కావచ్చు,కానీ అసాధ్యం కాదు.ఆయన ఆత్మస్థయిర్యమే తెలంగాణ అవతరణకు కారణమైంది.జాతీయ స్థాయిలో రాజకీయాలు నడపడానికి గాను టిఆర్ఎస్ కు ఆర్ధిక వనరుల ఇబ్బందులు లేకపోవచ్చు కానీ ఆయన ఆలోచనాసరళితో ఏకీభవించి నడిచే ‘మానవ వనరులు’ కావలసి ఉన్నది.

First Published:  11 Jun 2022 12:38 AM GMT
Next Story