Telugu Global
NEWS

ఆరోగ్యశ్రీ చరిత్ర ఇది.. వైఎస్ జగన్ కాపీ కొట్టడం ఏంటి?

ఏపీలో పర్యటిస్తున్న బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆశ్చర్యపరిచాయి. ‘మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ అనే పథకానికే ఆరోగ్యశ్రీ అని పేరు పెట్టి వైఎస్ జగన్ ప్రభుత్వం ఏపీలో అమలు చేస్తోంది’ అని అన్నారు. మోడీ పథకాన్నే జగన్ కాపీ కొట్టారంటూ వ్యాఖ్యానించారు. జేపీ నడ్డా మాటలు విన్నవారు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇది నడ్డా అమాయకత్వమా? లేదా కావాలనే అన్నారా అనేది ఆ పార్టీ నేతలు కూడా […]

ఆరోగ్యశ్రీ
X

ఏపీలో పర్యటిస్తున్న బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆశ్చర్యపరిచాయి. ‘మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ అనే పథకానికే ఆరోగ్యశ్రీ అని పేరు పెట్టి వైఎస్ జగన్ ప్రభుత్వం ఏపీలో అమలు చేస్తోంది’ అని అన్నారు. మోడీ పథకాన్నే జగన్ కాపీ కొట్టారంటూ వ్యాఖ్యానించారు. జేపీ నడ్డా మాటలు విన్నవారు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇది నడ్డా అమాయకత్వమా? లేదా కావాలనే అన్నారా అనేది ఆ పార్టీ నేతలు కూడా చెప్పలేకపోతున్నారు. అసలు ఆరోగ్యశ్రీ అనగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు గుర్తుకు వస్తారో అందరికీ తెలిసిన విషయమే.

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేద వారికి కూడా ఖరీదైన వైద్యం అందించాలనే లక్ష్యంతో 2004లో అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారు. 2007 ఏప్రిల్‌లతో సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో ఈ పథకం ప్రారంభమైంది. దారిద్ర్య‌ రేఖకు దిగువన (బీపీఎల్) ఉన్న కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డుతో లింక్ చేసి ఈ పథకాన్ని అమలు చేశారు. ఎంతో ఖరీదైన వైద్యాన్ని కూడా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అందిస్తున్నారు. సమైక్యరాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా తెలంగాణ, ఏపీల్లో అదే పేరుతో ఇప్పటికీ కొనసాగుతున్నది. మొదట్లో రాజీవ్ ఆరోగ్యశ్రీగా ఉన్న ఈ పథకం.. ఇప్పుడు ఏపీలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీగా కొనసాగుతోంది.

ఆరోగ్యశ్రీలో క్యాన్సర్, గుండె జబ్బులు, కిడ్నీ, లివర్ సంబంధిత వ్యాధుల వంటి తీవ్రమైన జబ్బులకు కూడా ఇందులో ఉచితంగానే చికిత్స లభిస్తున్నది. వైఎస్ఆర్ రెండో సారి సీఎం కావడానికి ఆరోగ్యశ్రీ ప్రముఖ పాత్ర పోషించిందంటే అతిశయోక్తి కాదు. అప్పట్లో ఈ పథకం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.

కాపీ కొట్టింది బీజేపీనే..
ఆరోగ్యశ్రీ పథకాన్ని వైఎస్ జగన్ కాపీ కొట్టారని బీజేపీ అధినేత జేపీ నడ్డా తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అయితే వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని మొదట కాపీ కొట్టింది బీజేపీ ప్రభుత్వమే. 2007లో వైఎస్ఆర్ దీన్ని ప్రారంభించగా.. దానికి వస్తున్న ఆదరణను చూసి.. పక్కనే ఉన్న కర్నాటక ప్రభుత్వం కూడా కాపీ కొట్టింది. బీజేపీకి చెందిన యాడ్యురప్ప సీఎంగా ఉన్న సమయంలో (పథకం అమలయ్యే సమయానికి ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఉన్నది) ఈ పథకాన్ని కాపీ కొట్టి వాజ్‌పేయి ఆరోగ్యశ్రీగా పేరు పెట్టి అమలు చేశారు. 80 శాతం వరల్డ్ బ్యాంక్, 20 శాతం రాష్ట్ర నిధులతో కర్నాటకలో ఈ పథకం అమలు చేశారు. వాజ్‌పేయి ఆరోగ్యశ్రీ పథకం లబ్దిదారులకు హైదరాబాద్‌లోని ఆసుపత్రుల్లో కూడా చికిత్స చేయించుకునే వెసులు బాటు కోవిడ్ ముందు వరకు ఉన్నది. వాస్తవం చెప్పాలంటే.. ప్రస్తుతం ఆయుష్మాన్ భారత్ పథకమే ఆరోగ్యశ్రీ నుంచి కాపీ కొట్టిందని చాలా మంది అంటున్నారు.

ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఇప్పుడు వేటికవే అమలు చేస్తున్నా.. ఇరు రాష్ట్రాల్లో ఎవరిని అడిగినా ఆరోగ్యశ్రీ వైఎస్ జగన్ తండ్రి రాజశేఖర్‌రెడ్డి పథకమే అని ఇప్పటికీ చెప్తుంటారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఎన్నో సార్లు అసెంబ్లీ వేదికగానే ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ చలవే అని చెప్పారు. ఏపీలో గత 15 ఏళ్లుగా ఉన్న పథకాన్ని మరింత మెరుగుపరిచి వైఎస్ జగన్ కొనసాగిస్తున్నారు. అలాంటిది ఇవాళ జేపీ నడ్డా అది మోడీ పథకాన్ని కాపీ కొట్టిందని చెప్పగానే తెలుగు ప్రజలకు నవ్వాలో ఏడ్వాలో అర్థం కావడం లేదు.

First Published:  6 Jun 2022 8:08 AM GMT
Next Story