Telugu Global
NEWS

ఐపీఎల్ లో హైదరాబాద్ బుల్లెట్లు! భువీ, ఉమ్రాన్ ఇద్దరూ ఇద్దరే

టాటా – ఐపీఎల్ 15వ సీజన్ రౌండ్ రాబిన్ లీగ్ లో మాజీ చాంపియన్ హైదరాబాద్ సన్ రైజర్స్ తన ప్రస్థానాన్ని పడుతూలేస్తూ సాగిస్తున్నా. పేసర్ల జోడీ భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్ మాత్రం తమ సత్తా చాటుతూ జట్టు విజయాలలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ముంబై వాంఖడీ స్టేడియం వేదికగా ఐదుసార్లు విజేత ముంబై ఇండియన్స్ తో ముగిసిన 13వ రౌండ్ పోరులో తమజట్టు 3 పరుగుల సంచలన విజయం సాధించడంలో స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్, […]

Rage of Hyderabadis in IPL: Showstoppers Bhuvi and Imran
X

టాటా – ఐపీఎల్ 15వ సీజన్ రౌండ్ రాబిన్ లీగ్ లో మాజీ చాంపియన్ హైదరాబాద్ సన్ రైజర్స్ తన ప్రస్థానాన్ని పడుతూలేస్తూ సాగిస్తున్నా. పేసర్ల జోడీ భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్ మాత్రం తమ సత్తా చాటుతూ జట్టు విజయాలలో కీలకపాత్ర పోషిస్తున్నారు.

ముంబై వాంఖడీ స్టేడియం వేదికగా ఐదుసార్లు విజేత ముంబై ఇండియన్స్ తో ముగిసిన 13వ రౌండ్ పోరులో తమజట్టు 3 పరుగుల సంచలన విజయం సాధించడంలో స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్, మెరుపు ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ ప్రధానపాత్ర వహించారు.

భువీ మేడిన్ ఓవర్ మ్యాజిక్

డెత్ ఓవర్లలో బౌలింగ్ స్పెషలిస్ట్ గా పేరున్న భువనేశ్వర్ కుమార్ మరోసారి తన అమ్ములపొదిలోని అస్త్ర్రాలను ప్రయోగించి..ముంబైని ఉక్కిరిబిక్కిరి చేశాడు. మ్యాచ్ నెగ్గాలంటే ఆఖరి 12 బాల్స్ లో 19 పరుగులు మాత్రమే చేయాల్సిన ముంబైని ఆట 19వ ఓవర్లో భువనేశ్వర్ కుమార్ మేడిన్ ఓవర్ తో కట్టిపడేశాడు.

ఒక్కమాటలో చెప్పాలంటే 194 పరుగల భారీ లక్ష్య ఛేదనలో ముంబై ఆఖరి ఓవర్ ఆఖరిబంతి వరకూ పోరాడి…20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగుల స్కోరుకే పరిమితం కావడంలో భువీ బౌలింగ్ చాతుర్యమనే చెప్పాలి.

మొత్తం మీద భువీ వేసిన 19వ ఓవర్‌ మ్యాచ్‌ మొత్తానికే హైలైట్‌గా మిగిలిపోతుంది. ఆఖరి రెండు ఓవర్లలో ముంబై 19 పరుగులు చేయాల్సిన సమయంలో
నిర్ణయాత్మక 19వ ఓవర్ వేయటానికి వచ్చిన స్వింగ్ జాదూ భువీ ..యార్కర్లతో బుమ్రాను బంధించాడు. కనీసం ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మొయిడిన్‌ ఓవర్‌ వేసి సన్‌రైజర్స్‌ సంచలన విజయానికి మార్గం సుగమం చేశాడు. ఈ ఓవర్‌లో పరుగులేవీ ఇవ్వకుండా కట్టడి చేసిన భువీ.. అరంగేట్రం ఆటగాడు సంజయ్‌ యాదవ్‌ వికెట్‌ పడగొట్టి మొయిడిన్‌ వికెట్‌ ఘనతను సొంతం చేసుకున్నాడు.

11 మేడిన్ ఓవర్లతో సరికొత్త రికార్డు

ఈ క్రమంలో భువీ మరో అరుదైన ఘనతను సాధించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక మెయిడిన్లు వేసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో భారత మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్ 14 మెయిడిన్‌ ఓవర్లతో అగ్రస్థానంలో ఉండగా.. భువీ 11 మేడిన్ ఓవర్లతో రెండు, 10 మేడిన్ ఓవర్లతో ఇర్ఫాన్ పఠాన్‌ మూడు, ముంబై మాజీ ఫాస్ట్ బౌలర్ లాసిత్ మలింగ 8, జస్ప్రీత్ బుమ్రా 8 మేడిన్ ఓవర్లతో మొదటి ఐదుస్థానాలలో కొనసాగుతున్నారు.

పవర్ ప్లే కింగ్ భువీ

ఇక…ఐపీఎల్ గత 15 సీజన్ల చరిత్రలోనే పవర్ ప్లే ఓవర్లలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ గా కూడా భువనేశ్వర్ కుమార్ మరో రికార్డు నెలకొల్పాడు.

ముంబైతో ముగిసిన ప్రస్తుత సీజన్ 13వ రౌండ్ మ్యాచ్ వరకూ భువీ 6.05 సగటుతో 54 వికెట్లు పడగొట్టడం ద్వారా అగ్రస్థానంలో నిలిచాడు.

పంజాబ్ పేసర్ సందీప్ శర్మ 53 వికెట్లతో రెండు, జహీర్ ఖాన్ 52 వికెట్లతో మూడు, 51 వికెట్లతో ఉమేశ్ యాదవ్ నాలుగు, 44 వికెట్లతో ఇశాంత్ శర్మ ఐదు, 44 వికెట్లతో ధవళ్ కులకర్ణి ఆరు స్థానాలలో ఉన్నారు.

బుమ్రాను మించిన ఉమ్రాన్

ఈ మ్యాచ్ ద్వారా. భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా పేరుతో ఉన్న రికార్డును హైదరాబాద్ సన్ రైజర్స్ యువ ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ తెరమరుగు చేశాడు.

ఐపీఎల్ లో ఓ సీజన్‌లో 20 అంత కంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన అతి పిన్నవయస్కుడైన భారత బౌలర్ గా ఉమ్రాన్ మాలిక్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

ప్రస్తుత 15వ సీజన్ 13 రౌండ్ల మ్యాచ్ ల్లో 22 ఏళ్ల 176 రోజుల వయసులో ఉమ్రాన్ మాలిక్ 20కి పైగా వికెట్లు పడగొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు.

ఉమ్రాన్‌కు ముందు ఈ రికార్డు ముంబై ఇండియన్స్‌ పేసర్‌ బుమ్రా పేరునే ఉంది. 2017 ఐపీఎల్‌ సీజన్‌లో బుమ్రా 23 సంవత్సరాల 165 రోజుల వయసులో. 16 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు పడగొట్టడం ద్వారా అత్యంత పిన్నవయసులో 20 వికెట్లు పడగొట్టిన భారత బౌలర్ గా రికార్డు నెలకొల్పాడు.

ప్రస్తుత సీజన్‌లో ఉమ్రాన్‌ కేవలం 13 రౌండ్ల మ్యాచ్‌ల్లోనే 21 వికెట్లు సాధించడం విశేషం.

మొత్తం మీద. ముంబై పై 13వ రౌండ్ విజయంతో ప్లే ఆఫ్ అవకాశాలను సాంకేతికంగా సజీవంగా హైదరాబాద్ నిలుపుకోడంలో పేసర్లజోడీ భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్ ప్రధానపాత్ర వహించారనడంలో ఏమాత్రం సందేహం లేదు.

Click Here For More Updates! Sports News

First Published:  18 May 2022 2:22 AM GMT
Next Story